పెద్ద ఆశలే ఉన్నాయిగా

ముఖ్యమంత్రి జగన్ కేంద్రం మీద గంపెడాశలే పెట్టుకున్నారు. గత ఆరు నెలలుగా కేంద్రం నుంచి ఏపీకి ఎంత వచ్చింది అన్నది పక్కన పెడితే జగన్ ఇంకా మోడీ [more]

Update: 2019-12-22 02:00 GMT

ముఖ్యమంత్రి జగన్ కేంద్రం మీద గంపెడాశలే పెట్టుకున్నారు. గత ఆరు నెలలుగా కేంద్రం నుంచి ఏపీకి ఎంత వచ్చింది అన్నది పక్కన పెడితే జగన్ ఇంకా మోడీ భారీగా సహాయం చేస్తారని గట్టి అంచనాలే వేసుకుంటున్నారు. ఏపీకి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం భేటీలో జగన్ విప్పిన కోరికల చిట్టాను చూస్తే ఇపుడున్న మోడీ, అమిత్ షా వీటిని తీర్చేందుకు ముందుకువస్తారా అన్న డౌట్లు సగటు జనానికి కలగక మానవు. జగన్ కోరినవి సమజంసమైనవే కానీ ఢిల్లీ ప్రభువులకు మాత్రం అవి గొంతెమ్మ కోరికలుగా కనిపించినా ఆశ్చర్యపోనవరం లేదు. ఎందుకంటే పెద్ద చిట్టానే జగన్ ఆర్ధిక సంఘానికి అందించారు.

అది జరిగే పనేనా…?

జగన్ ఏపీ ప్రజల తరఫున ఏం చేయాలనుకుంటున్నారో, తన ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి చక్కగానే 15వ ఆర్ధిక సంఘానికి వివరించారు. ఇందులో భాగంగా ఏపీకి ఇచ్చిన కేంద్ర రుణాలు 22, 733 కోట్ల వరకూ ఒక్క కలం పోటుతో మాఫీ చేయాలని జగన్ అడుగుతున్నారు. ఇప్పటికే కేంద్రం వేల కోట్లు అడిగితే వందల్లో విదిలిస్తోంది. అది కూడా అన్ని నివేదికలు తెప్పించుకుని పదే పదే తిప్పించుకుని ఏదో మొక్కుబడిగా ఇచ్చామని అంటోంది. మరి రుణమాఫీ అన్న పెద్ద మాట జగన్ వాడేశారు. అక్కడ ఉన్నది మోడీ, అమిత్ షా. వారు ఉదారంగా సాయం చేసేందుకు ఎందుకు ముందుకువస్తారన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది.

భారీగానే సాయం…

జగన్ ఇంతటితో ఊరుకోలేదుగా. రీసోర్స్ గ్యాప్ కింద 40,543 కోట్ల రూపాయలను కూడా కేంద్రం ఇప్పించేలా చూడాలని జగన్ కోరుతున్నారు. 2020 నుంచి 2025 మంధ్య లోకల్ బాడీలకు రిసోర్స్ గ్యాప్ కింద ఈ నిధులు ఇచ్చేలా చూడాలని జగన్ పెద్ద కోరికే కోరారు. నిజానికి ఈ రెండు కోరికలు కలిపితేనే కేంద్రం దాదాపుగా 63 వేల కోట్లు ఏపీకి భూరి సాయం చేయాలన్నమాట. అప్పట్లో చంద్రబాబు వంటి దోస్త్ ఉండగానే కేంద్రం పెద్దగా చేసింది లేదు. బీజేపీకి జగన్ ఏమవుతారని కేంద్రం ఇంత పెద్ద మొత్తాల్లో ఆర్ధిక సాయం చేస్తుందని ఆర్ధిక వేత్తలు సైతం అనుమానిస్తున్నారు.

ఉదారం అంటే…?

ఇపుడున్న రాజకీయాల్లో ఉదారం అన్న మాట వినిపిస్తోందా. అసలు ఎపుడో నాలుగు దశాబ్దాల క్రితం ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలోనేనాటి ప్రతిపక్ష నేత ఎన్టీఆర్ ఏపీ సీఎం గా ఉంటేనే నానా ఇబ్బందులు పెట్టారు. నిధులు సరిగ్గా విడుదల చేయలేదు. అధికారాల్లో కత్తెర వేయడానికి చూశారు. ఇపుడు మరింతగా ముదిరిన రాజకీయం ఉంది. మోడీ, అమిత్ షాలకు రాజకీయ కుతూహలం ఎక్కువ అన్నది బహిరంగ రహస్యం. అటువంటి వారు జగన్ సర్కార్ సమర్ధ పాలన కోసం తామంతట తాముగా సాయం చేసేటంత ఉదారత ఉందా అన్నది పెద్ద ప్రశ్న.

హోదా గుర్తుందా…?

నిజానికి ప్రత్యేక హోదా ముగిసిన అంశమని ఢిల్లీ పాలకులు తరచూ చెబుతున్న మాట. అది కూడా సెటైరికల్ గా మాత్రమే వారు వాడుతున్నారు. నిజంగా వారి నోటి వెంట హోదా అన్న మాట ఎపుడూ రాదు. కానీ జగన్ మాత్రం ప్రత్యేక హోదా హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని వాపోతున్నారు. 15వ ఆర్ధిక సంఘం ముందు దాన్ని పెట్టారు. నిజానికి కోరుకో నరుడా అంటే అవసరం ఉన్నవీ లేనివీ అన్నీ కలిపి పెద్ద జాబితానే ముందుకు వస్తాయి. కానీ జగన్ మాత్రం ఏపీ అవసరాల గురించే అడిగారు. గత ప్రభుత్వ నిర్వాకం చెప్పారు. పనిలో పనిగా గత అయిదేళ్ళ ఎన్డీయే పాలనలో ఏపీకి ఎంత తక్కువ నిధులు ఇచ్చినదీ గుర్తుచేశారు. అన్నీ చెప్పి భారీ సాయం కావాలంటున్నారు. మరి జగన్ నమ్మకం ఎంత గొప్పదో కదా. దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి మోడీకి ఉందా?

Tags:    

Similar News