నెగిటివ్ కాంపెయిన్ – పాజిటివ్ రిజల్ట్స్

నెగిటివ్ ఫలితాలు ఆసిస్తూ తీవ్రస్థాయిలో చేసే కొన్ని ప్రచారాలు బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు. మరీ ముఖ్యంగా కుల, మత, ప్రాంతీయ అంశాలకు సంబంధించిన విషయాలు ఎంత తక్కువ [more]

Update: 2020-12-30 09:30 GMT

నెగిటివ్ ఫలితాలు ఆసిస్తూ తీవ్రస్థాయిలో చేసే కొన్ని ప్రచారాలు బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు. మరీ ముఖ్యంగా కుల, మత, ప్రాంతీయ అంశాలకు సంబంధించిన విషయాలు ఎంత తక్కువ వివాదం చేసుకుంటే అంత మంచిది. ఈ అంశాల్లో దూకుడు అనుకూల ఫలితాలకంటే ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.

బీజేపీని హిందూ మతతత్వ పార్టీగా…..

1980 దశకం నుండి బిజెపిని హిందూ మతతత్వ పార్టీ అంటూ కాంగ్రెస్, కమ్యూనిస్టులు తీవ్రస్థాయిలో చేసిన ప్రచారం బెడిసికొట్టి, ప్రచారం చేసిన శక్తులు బలహీనపడ్డాయి. మరో వైపు ఈ ప్రచారం బిజెపి బలోపేతంకావడానికి ఉపయోగపడింది. రెండు స్థానాలనుండి నేడు 300లకు పైగా స్థానాలకు బలం పెంచుకోడానికి ఈ ప్రచారం పనికొచ్చింది.

ఇప్పుడు జగన్ ను….

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి కొందరు క్రైస్తవ మతంపై మొదలుపెట్టిన ‘హేట్’ ప్రచారం కూడా ఇలాంటి ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఈ తీవ్రస్థాయి ప్రచారం అటు జగన్మోహన్ రెడ్డి బలపడేందుకు, ఇటు క్రైస్తవమతం విస్తరించేందుకు దారితీసే అవకాశం ఉంది. ఇది గతం మనకు నేర్పిస్తున్న పాఠం. నేర్చుకుంటే మంచిది.

అది వికటిస్తే….?

ఇప్పటికే ఒక వర్గం (మతం) ప్రజల్లో ‘కన్సాలిడేషన్’ మొదలయింది. ఇతర వర్గాలు ఈ ‘విక్టిమైజేషన్’ రాజకీయాలకు నిరసనగా దాడికి గురవుతున్న వర్గానికి, నేతకు సానుభూతి ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని రాజకీయ శక్తులు వ్యూహాత్మకంగా చేసిన ఈ ‘విక్టిమైజేషన్ పాలిటిక్స్’ వికటించి జగన్ తిరుగులేని అధిక్యంతో అధికారంలోకి వచ్చిన విషయం, అంతకు ముందు దేశంలో బిజెపి బలపడిన విషయం మర్చిపోరాదు. రాష్ట్రంలో 2019 ఎన్నికలు నేర్పుతున్న పాఠం కూడా ఇదే. కొన్ని సందర్భాల్లో మౌనానికి, సహనానికి మించిన యుద్ధం మరోటిలేదు.

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News