సై అనకుంటే సీన్ రివర్సేనా?

జగన్ ఏమైనా ప్రపంచ మేధావా అని చంద్రబాబు ఎద్దేవా చేయవచ్చు. కానీ ఆయన ఏపీ రాజకీయ వరకూ మాత్రం తన పరిణితిని బాగానే చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న [more]

Update: 2019-12-19 12:30 GMT

జగన్ ఏమైనా ప్రపంచ మేధావా అని చంద్రబాబు ఎద్దేవా చేయవచ్చు. కానీ ఆయన ఏపీ రాజకీయ వరకూ మాత్రం తన పరిణితిని బాగానే చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అంతవరకూ జగన్ మేధావిగానే ఒప్పుకోవాలి. లేకపోతే జగన్ అంటేనే ఒంటి కాలి మీద లేచే విపక్షాల నుంచి జై కొట్టించుకోవడం అంటే మాటలా. చంద్రబాబు టైంలో కూడా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని జగన్ తుదికంటా వ్యతిరేకించారు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అవుతోంది. జగన్ మీద పీకల లోతు కోపం ఉన్నా కూడా చంద్రబాబు కూడా సై అనాల్సివస్తోంది.

మూడ్ మార్చేశాయా..?

ఏపీలో మూడు రాజధానుల రాజకీయాల మీదనే ఇపుడు అంతా చర్చగా ఉంది. ఓ విధంగా పొలిటికల్ సీన్ మూడ్ ని మార్చేసే చర్చగా ఇది ముందు వరసలో ఉంది. జగన్ అన్నట్లుగా మూడు రాజధానులు ఉంటే తప్పేంటని ఆయా ప్రాంతాల వారు అనుకుంటున్నారు. మరి జగన్ మీద తీవ్రంగా విరుచుకుపడిన చంద్రబాబు సైతం ఈ విషయంలో పునరాలోచనలో పడిపోయారు. మూడు రాజధానులు అంటూ జగన్ చెప్పాక తొలి రోజు పెద్ద నోరు చేసుకుని తుగ్లక్ అన్న చంద్రబాబు రెండవ రోజు మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యారు. దానికి కారణం సొంత పార్టీ నుంచే మద్దతు లేకపోవడం.

బూమరాంగేనా..?

కర్నూలు అన్నది బాధిత రాజధాని నగరం. నిజానికి న్యాయం ఇన్నాళ్ళకు జరిగింది అని అక్కడ వారు అనుకుంటున్నారు. బాబు సహచరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి కూడా అక్కడ హైకోర్టు ఏర్పాటుకు జై కొట్టేశాక బాబు నోరు ఏ విధంగా బయటకు వస్తుంది మరి. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు పరిపాలనా రాజధాని అంటే టీడీపీకి చెందిన గంటా శ్రీనివాసరావు కూడా వెల్ కం జగన్ అనేశారు. మిగిలిన నాయకులు సైతం మౌనంగానే మద్దతు ఇస్తున్నపుడు చంద్రబాబు తొందరపడి మరిన్ని మాటలు అంటే కచ్చితంగా బూమరాంగే అవుతుంది మరి.

ఆచీ తూచీ…..

నిజానికి జగన్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలను వ్యతిరేకించాలని టీడీపీకి కసితీరా ఉన్నా కూడా జనం మూడ్ చూసి వెనక్కితగ్గాల్సివస్తోందట. ఉదాహరణకు ఆంగ్ల మాధ్యమం సర్కార్ బడుల్లో ప్రవేశ పెట్టడమైనా, దిశా చట్టం విషయమైనా, మధ్యపాన నిషేషం వంటివైనా కూడా జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూంటే బాబు అండ్ కో కి ఇష్టం లేకపోయినా సరే అనాల్సిరావడం రాజకీయ విషాదమే. ఇపుడు మరో మారు బాబు అన్న మాటనే గుర్తు చేసుకుంటే జగన్ తాను ప్రపంచ మేధావి అని ఎక్కడా చెప్పలేదు కానీ తన రాజకీయానికి తగినట్లుగా మాత్రం చకచకా పావులు కదుపుతున్నారు. అదే తమ్ముళ్ళను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Tags:    

Similar News