“నేమ్” లోనే ఉందంట అసలు కథంతా?

సహజంగా పార్టీ వ్యవస్థాపకుల పేర్లు స్కీమ్ లకు పెడతారు. అలాగే మరణించిన తమ నేతల పేర్లను వివిధ పథకాలకు పెట్టి వారిని నిత్యం జనంలో ఉంచేలా పార్టీ [more]

Update: 2021-01-04 13:30 GMT

సహజంగా పార్టీ వ్యవస్థాపకుల పేర్లు స్కీమ్ లకు పెడతారు. అలాగే మరణించిన తమ నేతల పేర్లను వివిధ పథకాలకు పెట్టి వారిని నిత్యం జనంలో ఉంచేలా పార్టీ అధినేతలు చర్యలు తీసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రుల పేర్లతోనే ఎక్కువ పథకాలు నడుస్తున్నాయి. అటు చంద్రబాబు, ఇటు జగన్ ముఖ్యమంత్రిగా తమ హయాంలో తమ పేర్లు పథకాలను పెట్టుకోవడానికే ఇష్టపడుతున్నారు. ఇందుకు కారణాలేంటి? వైఎస్, ఎన్టీఆర్ లను వదిలేశారా? అంటే కాదు. దానికో బలమైన కారణముందంటున్నారు విశ్లేషకులు.

చంద్రబాబు కూడా…..

తెలుగుదేశం పార్టీని నందమూరి తారకరామారావు స్థాపించారు. తర్వాత చంద్రబాబు చేతిలోకి టీడీపీ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పథకాలకు ఎన్టీఆర్ పేర్లనే పెట్టేవారు. తన పేరును ఎక్కడా వాడుకునే వారు కారు. కానీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎక్కువ పథకాలకు చంద్రబాబు తన పేర్లనే పెట్టుకున్నారు. చంద్రన్న బీమా, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నించారు. ఎన్టీఆర్ పేరును అతి తక్కువగా పథకాలకు వాడారన్న విమర్శలను చంద్రబాబు అప్పట్లో ఎదుర్కొన్నారు.

జగన్ సయితం….

ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పలు పథకాలకు పెట్టినా ప్రజల్లోకి వెళ్లే పథకాలకు మాత్రం జగన్ తన పేరునే పెట్టు కుంటున్నారు. జగనన్న చేయూత, జగనన్న ఇళ్ల పట్టాలు, జగనన్న గోరుముద్ద వంటి పథకాలను ఈ పదిహేను నెలల కాలంలో పెట్టుకున్నారు. నిజానికి జగన్ కు చిన్న వయసు. రాజకీయంగా ఇంకా ఎంతో భవిష్యత్ ఉంది. అయినా తనపేరుకే జగన్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

కొత్త జనరేషన్ కోసమే……

అయితే ఇందుకు జగన్, చంద్రబాబులను తప్పుపట్టలేం. ఎన్టీఆర్ ఇప్పటికే ఒక జనరేషన్ కు తెలియదు. వైఎస్ కూడా దాదాపు అంతే. వచ్చే ఎన్నికల నాటికి కొత్త ఓటర్లు లక్షల సంఖ్యలో రానున్నారు. వీరికి ఆ నేతల పేర్లు తెలియవు. అందుకే జగన్, చంద్రబాబులు తమ పేర్లతోనే జనంలోకి వెళితే కొంత ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. దివంగత నేతల పేర్లు పెట్టడానికి వీరిద్దరికి పెద్దగా అభ్యంతరం లేకపోయినా, ఎన్నికల్లో కొత్త జనరేషన్ కు గుర్తుండటానికే ఈ పథకాలకు తమ పేర్లను పెట్టుకుంటున్నారని ఒక సీనియర్ నేత విశ్లేషించారు. అదీ విషయం. అయితే ప్రజల సొమ్ముతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తమ పేర్లును పెట్టుకోవడం ఏంటన్న ప్రశ్నలు కూడా విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News