జగన్ కోటను బద్దలు కొడతారా ?

జగన్ కి అనాదిగా రాయలసీమ గట్టి మద్దతు ఇస్తూ వస్తోంది. ఎందుకంటే సీమవాసులు జగన్ న్యాయం చేస్తారని నమ్మకంతోనే వెన్నంటి ఉన్నారు. వైఎస్సార్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి [more]

Update: 2020-12-26 02:00 GMT

జగన్ కి అనాదిగా రాయలసీమ గట్టి మద్దతు ఇస్తూ వస్తోంది. ఎందుకంటే సీమవాసులు జగన్ న్యాయం చేస్తారని నమ్మకంతోనే వెన్నంటి ఉన్నారు. వైఎస్సార్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి ఎలా ఉన్న సీమ వారికి న్యాయం చేయడంతో ఎపుడూ ముందుండేవారు. పోతిరెడ్డిపాడు ఎత్తి పోతల పధకాన్ని వైఎస్సార్ నాడు దూకుడుగా ప్రారంభించకపోతే సీమ వాసులకు నీళ్ళు ఎక్కడ నుంచి వచ్చేవి అన్న ప్రశ్న ఇప్పటికీ ఉంది. అలాగే సీమ ప్రయోజనాల కోసం వైఎస్సార్ సీఎం గా ఉండగానే కార్యాచరణ సిద్ధం చేసి అడుగులు వేశారు. ఇక ఆయన చనిపోవడంతో కుమారుడు జగన్ కి అంతకు మించి మద్దతు ఇస్తూ సీమ జనం ఆయనతోనే అంతా అన్నారు.

ఆశాభంగమేనా …?

జగన్ సీఎం అయ్యాక సంక్షేమం తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే సీమకు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నా దానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. నిధుల సమస్య కూడా ఉంది. ఇక కడపకు స్టీల్ ప్లాంట్ అని జగన్ పునాది రాయి అయితే వేశారు కానీ ఎక్కడా అడుగు ముందుకు పడలేదు. తెలుగుదేశం తెచ్చిన కియా పరిశ్రమ, తిరుపతిలో శ్రీ సిటీ తప్ప జగన్ ఏడాదిన్నర పాలనలో చెప్పుకునే విధంగా రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. అయితే మూడు రాజధానుల ప్రతిపాదనతో జగన్ సీమకు కొంచెం న్యాయం చేయాలని చూశారు. కానీ అది న్యాయ వివాదంలో పడింది.

బీజేపీ హైజాక్….

ఇక మూడు రాజధానుల విషయంలో ఒక్క అడుగు కూడా వైసీపీ సర్కార్ ముందుకు వేయలేకపోతోంది. బీజేపీ మాత్రం ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తోంది. దాంతో ఈ మధ్య జగన్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు హైకోర్టుని కర్నూలు కి తరలించమని కోరి వచ్చారు. దానికే ఇపుడు బీజేపీ పదును పెడుతోందని అంటున్నారు. హైకోర్టు తరలింపు అంత సులువు కాదు, కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదించాలి. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారానే అది సాకారం అవుతుంది. అంటే ఇక్కడ జగన్ కేవలం ప్రతిపాదించినా పని మొత్తం చేయాల్సింది కేంద్రమే. అందువల్ల ఈ క్రెడిట్ జగన్ కి ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది. తామే రాయలసీమ డిక్లరేషన్ ఆమోదించి హైకోర్టుని మొదట కోరామని, అందువల్ల రేపు కర్నూలు కి హైకోర్టు తరలింపు ద్వారా సీమలోని నాలుగు జిల్లాల ప్రజల అభిమానాన్ని మనసారా చూరగొనాలని బీజేపీ భారీ పధకాన్నే రచిస్తోంది.

ఎదిగితే దెబ్బేనా…?

బీజేపీ చూపు ఇపుడు రాయలసీమ మీద ఉంది. ఇక్కడ టీడీపీ ఏనాడో చేతులెత్తెసింది. పైగా వైసీపీ తప్ప మరో పార్టీ కూడా ఇక్కడ గట్టిగా లేకుండా ఉంది. దాంతో ఆ లోటుని భర్తీ చేస్తూ తామే సరైన ఆల్టర్నేషన్ అని బీజేపీ నిరూపించుకుంటే మొత్తం 51 సీట్లు కలిగిన సీమ నుంచే రాష్ట్ర అధికారం వైపుగా అడుగులు వేయాలని బీజేపీ చూస్తోంది. దానికి నాందిగా హై కోర్టు అంశాన్ని వాడుకోవాలనుకుంటోంది. బీజేపీ తలచుకుంటే హై కోర్టు కర్నూల్ కి తప్పక‌ వస్తుంది. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి కూడా తగిన వాతావరణం రూపొందుతుంది. దాంతోనే బీజేపీ ఇపుడు సీమ వైపు పూర్తిగా చూపు సారించింది అంటున్నారు. జగన్ ని 2011 నుంచి వరసగా అనేక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో గెలిపించుకువస్తున్న సీమ వాసులు కొత్త ఆలోచనలు కనుక చేస్తే వైసీపీ కంచుకోటలకు బీటలు వారినట్లేనని అంటున్నారు.

Tags:    

Similar News