బాబుకు ఇక కునుకు పట్టదంతే ?

జగన్ జనంలో ఉంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంటుంది. జగన్ కి సినీ స్టార్స్ కి మించిన గ్లామర్ జనంలో ఉంది. జగన్ [more]

Update: 2020-12-23 02:00 GMT

జగన్ జనంలో ఉంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంటుంది. జగన్ కి సినీ స్టార్స్ కి మించిన గ్లామర్ జనంలో ఉంది. జగన్ వస్తే చాలు జనం అలా వెంట నడుస్తారు. జగన్ దాదాపు పదిహేను నెలల పాటు చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం. ఏ జిల్లాకు వెళ్ళినా కూడా నాడు జగన్ వెంట వేలాదిగా జనం పరుగులు తీస్తూ ముందుకు సాగడం ఆంధ్రావనే కాదు, యావత్తూ దేశమంతా చూసింది. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి కొద్ది నెలల్లో రెండేళ్ళు పూర్తి అవుతాయి. జగన్ ఈ మధ్యకాలమంతా నల్లపూస అయిపోయారనే సొంత పార్టీ నుంచి కూడా కామెంట్స్ వచ్చిపడుతున్నాయి.

సరైన సమయంలో….

ఇక అధికారంలోకి జగన్ ఈ కాలమంతా వృధాగా ఏమీ చేయలేదు. ఆయన వరసపెట్టి సమీక్షలు చేశారు. తాను అనుకున్న పధకాలను పరుగులు పెట్టించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అహరహం శ్రమించారు. ఇపుడు జగన్ దాదాపుగా పాలనను ఒక గాడిన పెట్టారు. అందుకే సరైన సమయంలో ఆయన కాలు మళ్ళీ బయటపెట్టాలనుకుంటున్నారు. తాను చేసిన అభివృద్ధి కానీ, ఇచ్చిన పధకాలు కానీ జనాలకు ఎంతవరకూ చేరాయన్నది స్వయంగా చెక్ చేసుకోవడానికి జగన్ ఇకపైన ఏపీవ్యాప్తంగా టూర్లు వేస్తారని అంటున్నారు.

జిల్లా పర్యటనలు షురూ….

ఎన్ని చెప్పుకున్నా కూడా వైసీపీకి, ప్రభుత్వానికీ కూడా జగనే ఆధారం. ఆయన ఉంటేనే అటు అధికార యంత్రాంగమైనా ఇటు పార్టీ శ్రేణులైనా ముందుకు కదిలేది. అందుకే ఇంతకాలం మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఆధారపడిన జగన్ ఇక తాను జిల్లాల పర్యటనలకు నడుం బిగించారు అంటున్నారు. జగన్ జిల్లా టూర్ల వెనక రాజకీయ కారణాలు కూడా చాలానే ఉన్నాయి. వచ్చే ఏడాది మేలో లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరిపించాలని జగన్ గట్టిగా భావిస్తున్నారు. ఆనాటికి పార్టీని కూడా ఒక గాడిన పెట్టాలన్నది ఆయన ఆలోచన. అలాగే వైసీపీ సర్కార్ అందించిన పధకాల వల్ల లబ్ది పొందుతున్న వారిని అందరినీ తమవైపు తిప్పుకోవడం ద్వారా పటిష్టమైన ఓటు బ్యాంక్ ని తయారు చేసుకోవాలన్నది కూడా మరో ఆలోచన. ఇక ప్రభుత్వాధినేతగా పధకాల్లో ఏమైనా లోపాలు ఉంటే తెలుసుకుని సరిచేసుకోవడం కూడా ఇంకో ఆలోచనగా చెబుతున్నారు.

ప్రకంపనలేనా….?

జగన్ కాలు బయటపెడితే విపక్షాలకు కలవరమేనని అంటున్నారు. ఇప్పటిదాకా ఏపీలో విపక్షం గట్టిగా నిలబడి సర్కర్ ని నిలదీసిన సంఘటనలు పెద్దగా లేవు. పైగా జగన్ కూడా ఆ అవకాశం ఎపుడూ ఇవ్వలేదు. ఇపుడు మెల్లగా ప్రతిపక్షం సౌండ్ చేయడానికి రెడీ అవుతోంది. దానికి తోడు తిరుపతి ఉప ఎన్నిక కూడా ఉంది. దాంతో ఎట్టి పరిస్థితుల్లో విపక్షం పై చేయి సాధించకుండా చూసేందుకే జగన్ జిల్లాల పర్యటనలు రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. మరి దీనికి రచ్చ బండ అని పేరు పెడతారా. లేక మరో పేరు అనుకుంటారో అన్నది తొందరలోనే డిసైడ్ చేస్తారట. మొత్తానికి జగన్ జిల్లా టూర్లు చేస్తే టీడీపీకీ, చంద్రబాబుకే ముందు నిద్రపట్టదు అని అంటున్నారు. జగన్ జనాలను తన వైపుగా మళ్ళించుకుంటే ఏపీలో మళ్ళీ 2019 నాటి ఫలితాలే లోకల్ బాడీస్ లో వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. చూడాలి మరి జగన్ జిల్లా టూర్లు ఏ రకమైన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయో.

Tags:    

Similar News