తిరుపతిలో గెలిచినా జగన్ కి తలనొప్పేనా ?

ఇప్పటి దాకా చూసుకుంటే తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ విజయం ఖాయం. అనూహ్య పరిణామాలు జరిగితే మెజారిటీ ఏమైనా తగ్గుతుందేమో కానీ ఫ్యాన్ నీడ నుంచి తిరుపతి [more]

Update: 2020-12-22 12:30 GMT

ఇప్పటి దాకా చూసుకుంటే తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ విజయం ఖాయం. అనూహ్య పరిణామాలు జరిగితే మెజారిటీ ఏమైనా తగ్గుతుందేమో కానీ ఫ్యాన్ నీడ నుంచి తిరుపతి ఎంపీ సీటుని వేరు చేసే సీన్ ఏపీలో మరో పార్టీకి లేదు అన్నది నిజం. అయితే తిరుపతి లో గెలిచినా కూడా జగన్ కి కొత్త తలనొప్పులు అనేకం వస్తాయట. దాని మీదనే ఇపుడు వైసీపీలోనూ ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోందిట. తిరుపతిలో బీజేపీ దూకుడు అంతా కూడా సెకండ్ ప్లేస్ కోసమన్నది అందరికీ తెలిసిందే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 16 వేల ఓట్లను తెచ్చుకుని నోటా కంటే 9 వేల ఓట్ల తేడాతో వెనకబడిన బీజేపీకి ఇప్పటికిపుడు గెలుపు అంటే అది అందని పండే మరి.

టీడీపీని నెట్టేసి …..

బీజేపీ లక్ష్యం ఏపీలో ఒక్కటే. అది తెలుగుదేశం పార్టీని మూడవ స్థానానికి నెట్టేసి తానే అసలైన ప్రధాన ప్రతిపక్షం అని నిరూపించుకోవడం. దాని కోసమే బీజేపీ తెగ దూకుడు చేస్తోంది. తెలుగుదేశానికి తిరుపతిలో బీజేపీ కంటే ఎక్కువగానే బ‌లం ఉంది. గత ఎన్నికల్లో దాదాపుగా అయిదు లక్షల ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. అయితే ఏడాదిన్నరగా టీడీపీ డల్ గా ఉంది. పార్టీ తరఫున కూడా పెద్దగా కార్యక్రమాలు ఏవీ లేవు. గత పది నెలలుగా చంద్రబాబే హైదరాబాద్ ను వీడి రాలేదు. ఇక పార్టీ నాయకులు అయితే ఏ మాత్రం చురుగ్గా లేరు. దాంతో ఉప ఎన్నికల హడావుడి టీడీపీలో పెద్దగా కనిపించకపోవడమే బీజేపీకి కొత్త హుషార్ తెస్తోందిట.

ఉల్టా పల్టా అయితే …

ఇక బీజేపీకి ప్లాన్ ఏ, ప్లాన్ బీ కూడా ఉన్నాయట. ప్లాన్ ఏ అయితే తెలుగుదేశాన్ని తోసి ముందుకు దూసుకుపోవడం. ఆ విధంగా ఆ పార్టీని ఏపీలో సోదిలో లేకుండా చేస్తామని భయం పుట్టించడం, తద్వారా టీడీపీ క్యాడర్ ని తమ వైపుగా ఆకట్టుకోవడం. అయితే బీజేపీ అనుకుంటున్నట్లుగా రెండవ ప్లేస్ లోకి వచ్చినపుడే ఇవన్నీ సాధ్యపడతాయి. కానీ బీజేపీ ఎంత ఎగిరినా గత పదహారు వేలకు మరో పదహారు వేలు మాత్రమే ఓట్లు రాబట్టి చతికిలపడితే, మూడవ స్థానానికే పరిమితం అయితే సంగతేంటన్నది కూడా ప్రశ్నగా ఉంది. దానికి సమాధానమే ప్లాన్ బీ గా కమలనాధులు ముందుకు తెస్తారట.

పొత్తుల ఎత్తులతో ….

ఒకవేళ తాను అనుకున్నట్లుగా తిరుపతి ఉప ఎన్నికలో పెర్ఫార్మెన్స్ బీజేపీ ఇవ్వకపోతే ఏపీలో రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీలతో బీజేపీ పొత్తుకు రెడీ అవుతుందిట. అపుడు కూడా పై చేయి తనదేలా ఉండేలా చూసుకుంటూ బేరాలకు దిగుతుందిట. ప్లాన్ బీకి బాబు రెడీ అయినా కూడా మునుపటి మాదిరిగా జూనియర్ పార్టనర్ గా ఉండేందుకు మాత్రం బీజేపీ ఒప్పుకోదనే అంటున్నారు. ఇక వైసీపీ రెడీ అయినా పొత్తుకు కమలానికి అభ్యంతరం ఉండదని అంటున్నారు. సరిగ్గా ఇక్కడే కొత్త తలనొప్పులు జగన్ కి మొదలవుతాయని అంటున్నారు. బీజేపీ సేకండ్ ప్లేస్ లో ఉంటే కాషాయ రెపరెపలతో రానున్న మూడేళ్ల కాలమంతా ఏపీని డైరెక్ట్ గా ఊపేస్తుంది. మూడవ స్థానంలో ఉంటే పొత్తుల పేరిట ఒత్తిడి తెచ్చి రాజకీయ బ్లాక్ మెయిల్ కి దిగే చాన్స్ ఉంది. ఇక మరోవైపు టీడీపీ బీజేపీ జనసేన కలిసినా అది జగన్ కి ఇబ్బందే. అలా కాదు తనకు పొత్తుల ఆహ్వానం అందించినా కూడా మరో రకమైన ఇబ్బందే. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల తరువాత బీజేపీ ఏ ప్లాన్ తో ముందుకువస్తుందోనని వైసీపీ శిబిరం తెగ కలవరపడుతోందిట. అంటే తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలిచినా కూడా ఆనందం అసలు ఉండదు అన్న మాట.

Tags:    

Similar News