జగన్ మనసు దోచేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ?

అతను అందరి కంటే ఘనుడు అనిపించుకుంటున్నారు. రాజకీయాల్లో బహు మొనగాడుగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. జగన్ మనసెరిగి వ్యవహరించడంతో దిట్టగా నిరూపించుకుంటున్నారు. ఆయనే విశాఖ దక్షిణ నియోజకవర్గానికి [more]

Update: 2020-12-22 02:00 GMT

అతను అందరి కంటే ఘనుడు అనిపించుకుంటున్నారు. రాజకీయాల్లో బహు మొనగాడుగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. జగన్ మనసెరిగి వ్యవహరించడంతో దిట్టగా నిరూపించుకుంటున్నారు. ఆయనే విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన కొద్ది నెలల క్రితం వైసీపీకి మద్దతు ప్రకటించారు. తన ఇద్దరు కుమారులకు వైసీపీ కండువా కప్పేశారు. ఇక తాను కూడా పూర్తి జగన్ మనిషిగా మారి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ఎప్పటికపుడు జనంలోకి తీసుకెళ్తున్నారు.

వారి కంటే మిన్నగా…..

జగన్ తాడేపల్లిలో ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభిస్తే చాలు దానిని తన నియోజకవర్గంలో భారీ ఎత్తున జనంలోకి తీసుకెళ్తున్నారు వాసుపల్లి. ఆయన గతంలో టీడీపీలో ఉన్నపుడు కూడా ఇలాగే చేసేవారు. ముఖ్యమంత్రులు వివిధ పధకాలను ప్రారంభించినా ఆయా లబ్దిదారులకు వాటిని చేరువ చేయడం అధికారుల పని. అయితే ఇక్కడే రంగంలోకి దిగి ఎమ్మెల్యే వాసుపల్లి తానూ ఉన్నాను అనిపించుకుంటున్నారు. తమ ప్రభుత్వం ఈ పని చేస్తోంది అని వారికి చెప్పడం ద్వారా ఆ క్రెడిట్ ని పార్టీ ఖాతాలో వేస్తున్నారు. తాజాగా జగనన్న జీవ క్రాంతి పధకాన్ని వాసుపల్లి తన నియోజకవర్గంలో ప్రారంభించిన తీరుకు వైసీపీ నేతలే షాక్ తిన్నారు. తమకు అలాంటి ఆలోచన ఎందుకు తట్టలేదని కూడా బాధపడ్డారు.

భారీ ర్యాలీతో హుషార్ ….

విశాఖ దక్షిణంలో వైసీపీ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ ఇపుడు బలమైన నేతగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి రావడంతో ఎటు చూసినా ఆ పార్టీ జెండాలే కనిపిస్తున్నాయి. జగనన్న జీవ క్రాంతి పధకం లబ్దిదారులతో ఆయన భారీ ర్యాలీని మొత్తం నియోజకవర్గంలో నిర్వహించి వైసీపీ ఘనతను చాటారు. లబ్దిదారులతో కలసి చేపట్టిన ఈ ర్యాలీ విజయవంతం అయింది. జగన్ ఈ పధకం ద్వారా లబ్దిదారులకు అందిస్తున్న గరిష్ట లాభాన్ని కూడా ఎమ్మెల్యే వాసుపల్లి చక్కగా వివరించడం ద్వారా ఆయా సామాజికవర్గాలను వైసీపీ వైపుగా సులువుగా మళ్ళించగలిగారు.

మళ్ళీ ఆయనేనా…?

పూర్వాశ్రమంలో ఆర్మీ మనిషి అయిన వాసుపల్లి ఏ పని చేసినా క్రమ శిక్షణతో చేస్తారు. ఆయన అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు తన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టి పార్టీ ఉనికిని గట్టిగా చాటారు. ఇపుడు ఆ పార్టీ విపక్షంలో ఉండగా ఆయన వైసీపీలోకి వచ్చేశారు. దాంతో నియోజకవర్గంలో ఎక్కడా కూడా టీడీపీ జెండా రెపరెపలే లేని దుస్థితి ఏర్పడింది. మరో వైపు అధికారంలో వైసీపీ ఉండడంతో ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వాసుపల్లి దక్షిణంలో వైసీపీని స్ట్రాంగ్ చేసే పనిలో పడ్డారు. ఇక జగన్ పధకాలను జనంలోకి తీసుకెళ్తూ పార్టీకి భారీ మైలేజ్ ని తెస్తున్న ఈ ఎమ్మెల్యే పట్ల అధినాయకత్వం కూడా పూర్తి సానుకూలతతో ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ వాసుపల్లిదేనని పార్టీలో మాట అయితే ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి వాసుపల్లి కనికట్టు రాజకీయంతో వైసీపీలోని ఆశావహుల ఆట అలా కట్టించేశారని అంటున్నారు.

Tags:    

Similar News