ఎంత తిడుతున్నా అంతేనా?

జగన్ రాజకీయాల్లోకి వచ్చాక తిన్నన్ని తిట్లు మరే నాయకుడు తిని ఉండరేమో. జగన్ అన్ని పార్టీలకు నాడూ నేడూ కూడా టార్గెట్ అవుతున్నాడు. ఇక జగన్ విషయంలో [more]

Update: 2020-12-18 05:00 GMT

జగన్ రాజకీయాల్లోకి వచ్చాక తిన్నన్ని తిట్లు మరే నాయకుడు తిని ఉండరేమో. జగన్ అన్ని పార్టీలకు నాడూ నేడూ కూడా టార్గెట్ అవుతున్నాడు. ఇక జగన్ విషయంలో అధికార టీడీపీ ఇప్పటికి దేశంలో ఉన్నన్ని తిట్లన్నీ కలిపి తిట్టేసింది. అంతర్జాతీయ పరిణామాలను ఆసరా చేసుకుని అక్కడ వాళ్లతో పోలుస్తూ కొత్త తిట్లు కూడా తిడుతోంది. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ తో జగన్ ని పోలుస్తూ టీడీపీ పెద్దలు తమ ఆవేశాన్ని అలా తీర్చుకున్నారు. ట్రంప్ మాదిరిగానే అహంభావంతో పాలిస్తున్న జగన్ కి కూడా పరాభవం తప్పదని కూడా గట్టిగానే శాపనార్ధాలు పెడుతున్నారు.

ఆయనతో పోలిక …

ఇక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ని నియంతగా పేర్కొంటారు. ఆయన్ని తీసుకువచ్చి జగన్ తో పోలిక పెడుతున్నారు బీజేపీకి చెందిన విష్ణు కుమార్ రాజు. కిమ్ కి ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత లేదుట. ప్రజల కష్ట సుఖాలు అసలు పట్టించుకోరుట. అలాగే జగన్ కూడా వ్యవహరిస్తున్నారు అని రాజు గారి భావనట. అందుకే కిమ్ తో జగన్ ని పోలుస్తూ ఆయన వెంటనే గద్దె దిగాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

వ్యక్తిగత విమర్శలే ….

తెలుగుదేశం పార్టీ సిద్ధాంతల మీద విమర్శలు చేయడం ఏనాడో మానుకుంది. ఇక రాజకీయాల్లో పరుష పదజాలాన్ని ఉపయోగించడం వ్యక్తిత్వ హననం చేయడం కూడా టీడీపీ నుంచే మొదలైంది. జనాలకు ఎవరి మీద అయితే పూర్తి వ్యతిరేకత ఉంటుందో వారిని చూసి మరీ జగన్ లాంటి వారికి పోలిక పెట్టడం తిట్టడం కూడా టీడీపీ పొలిటికల్ లాజిక్ లో ఒక భాగం. కరోనా విపత్తు వేళ నుంచి కూడా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో జగన్ కి పోలిక తెచ్చి రచ్చ చేస్తున్న టీడీపీకి అక్కడ ఆయన ఓడిపోవడం కూడా కలసివచ్చింది. నిజంగా ట్రంప్ గెలిస్తే టీడీపీ వేరే పేరు వెతుక్కునేదేమో కానీ ట్రంప్ ఓటమి కావడంతో ఇక్కడ జగన్ కూడా ఓడిపోతాడంటూ రాజకీయ పులిహోర కలిపిస్తోంది.

ఆ వాసనలతోనే …

ఇక ఉన్నది బీజేపీలో అయినా టీడీపీ వాసనలు చాలానే ఉన్నాయి రాజుకు. అందుకే ఆయన కూడా జగన్ మీద విమర్శలు చేస్తూ ఏకంగా అంతర్జాతీయ నేతలను రంగంలోకి దించేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. లోకల్ పాలిటిక్స్ లోకి ఇతర దేశాల నాయకులను తెచ్చి పలుచన చేయాలని చూస్తే అది వికటించి దౌత్య పరమైన వివాదాలు రేగినా రేగవచ్చు. అయినా మన నాయకులు ఎప్పటికపుడు నాలుక మడతేసేవారు కాబట్టి అంత దూరం కధ నడిస్తే అదే ట్రంప్, కిమ్ లని కూడా కీర్తించకుండా ఉంటారా. మొత్తానికి ఇద్దరు నియంతల లాంటి నాయకులతో జగన్ కి పోలిక పెట్టి జనాల్లో ద్వేషాన్ని రగిలించడానికి టీడీపీ బీజేపీ వేస్తున్న ఎత్తులు ఎంతవర‌కూ ఫలిస్తాయో చూడాలి.

Tags:    

Similar News