జగన్ కి బొత్తిగా బాలేదే ?

జగన్ కి 2020 అసలు బాగులేదు. ఆయన అనుకున్నవి, ప్రతిష్టగా భావించినవి ఏవీ కూడా ఈ ఏడాది అసలు వర్కౌట్ కాలేదనే చెప్పాలి. గత డిసెంబర్లో ఎంతో [more]

Update: 2020-12-17 13:30 GMT

జగన్ కి 2020 అసలు బాగులేదు. ఆయన అనుకున్నవి, ప్రతిష్టగా భావించినవి ఏవీ కూడా ఈ ఏడాది అసలు వర్కౌట్ కాలేదనే చెప్పాలి. గత డిసెంబర్లో ఎంతో ఉత్సాహంగా శీతాకాల సమావేశాల చివరి రోజున మూడు రాజధానుల ప్రకటనతో జగన్ చలి సీజన్ లో వేడి పుట్టించారు. ఆ తరువాత ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టి మరీ మూడు రాజధానుల బిల్లు ఆమోదించారు. ఇంకేముంది ఇక తొందరలోనే చలో వైజాగ్ అని అంతా అనుకున్నారు. అమరావతి రాజధాని నిండా మునిగింది అని కూడా అంచనా కట్టారు. కానీ జరిగింది వేరు. మూడు రాజధానుల బిల్లు చట్టంగా మారడానికి ఆరు నెలలు పడితే అదిపుడు న్యాయ స్థానాల్లో విచారణలో ఉంది.

లోకల్ ఫైట్ అలా…..

ఇక మార్చి వెళ్ళేలోపు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టేసుకుని పార్టీని రూట్ లెవెల్ వరకూ బలోపేతం చేద్దామని, ప్రభుత్వ పదవులు అన్నీ ఏకమొత్తంగా వైసీపీ పరం చేద్దామని జగన్ అద్భుతమైన ప్లాన్ వేశారు. అనుకున్నట్లుగా మార్చిలో స్థానిక ఎన్నికలు జరిగితే జగన్ కోరుకున్నది జరిగేదే. ఈపాటికి పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా మొత్తం వైసీపీ వారే పదవుల్లో కొనసాగేవారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన బిగ్ ట్విస్ట్ కి స్థానిక ఎన్నికలు అలా ఎటూ కాకుండా పోయాయి. ఇక ఎన్నికల సంఘంతో కొత్త పంచాయతీ మొదలైంది. అది ఆరని మంటలా అలా కొనసాగుతూనే ఉంది.

కరోనా కష్టాలు…..

జగన్ సీఎం సీటు ఎక్కిన ముహూర్తం ఎలా ఉందో ఏమో కాదు కానీ గత పాలకులు ఎవరూ పడని కష్టాలు కరోనాతో జగన్ పడ్డారు. అప్పటికి అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు, ఇంకా గట్టిగా సీట్లో కుదురుకోలేదు. కానీ అంతు పట్టని మహమ్మరిలా కరోనా వచ్చిపడిపోయింది. ఇది దేశమంతా ఉన్నా కూడా ఏపీ పరిస్థితి భిన్నం. ఆర్ధికంగా ఇబ్బందులు. రాజకీయంగా సవాళ్ళతో సతమవుతున్న జగన్ కి ఏపీ వంటి పేదరాష్ట్రాన్ని ముందుంచుకుని కరోనాతో యుద్ధం చేయడం అతి పెద్ద కష్టంగానే మారింది. ఇక ఏడాది చివరకు వచ్చేసరికి ఏలూరులో వింత జబ్బు బయటపడి మరో సవాల్ చేస్తోంది. ఈ మధ్యలో వరదలు, ప్రకృతి వైపరిత్యాలు ఒక్కటేంటి జగన్ సర్కార్ కి ఎక్కడా మనశ్శాంతి లేకుండా చేశాయనే చెప్పాలి.

ధిక్కార స్వరాలు…..

ఈ ఏడాది ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ ఎంపీ రెబెల్ గా మారి వారి కంటే ఎక్కువగా జగన్ కి తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఆయనే నర్సాపురం ఎంపీ రఘురామరాజు. ఆయన జగన్ ని ఆయన పార్టీని తూర్పార పట్టిన విధానం చూసిన వారు జగన్ మీద జాలి పడడం కంటే ఏమీ చేయలేని స్థితి. ఇక వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ మీద డైరెక్ట్ గా బాణాలు వేయడమే కాదు, ఘాటైన విమర్శలతో గుక్కతిప్పుకోనీయని పరిస్థితి కల్పించారు.దానికి తోడు అన్నట్లుగా పార్టీలో ఈ ఏడాది పడగెత్తిన విభేదాలు కూడా 151 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టిన ఆనందాన్ని జగన్ కి దూరం చేసినవే అని చెప్పాలి. మొత్తానికి చూసుకుంటే జగన్ కి 2020 మాత్రం అలవి కాని కష్టాలతో కలసిరానిదిగానే మారింది అని చెప్పాలి.

Tags:    

Similar News