ఆ సైన్యం ఇపుడు గుర్తొచ్చిందా ?

జగన్ విజయంలో ఎన్నో అంశాలు ప్రధాన పాత్ర పోషించాయి. అందులో అగ్ర తాంబూలం జగన్ దే . అయితే ఒక సినిమాలో హీరో ఒక్కడే ఉంటే చాలదు, [more]

Update: 2020-12-15 02:00 GMT

జగన్ విజయంలో ఎన్నో అంశాలు ప్రధాన పాత్ర పోషించాయి. అందులో అగ్ర తాంబూలం జగన్ దే . అయితే ఒక సినిమాలో హీరో ఒక్కడే ఉంటే చాలదు, హీరోయిన్ గ్లామర్ కావాలి. అలాగే కామెడీ, బలమైన కంటెంట్, పవర్ ఫుల్ విలన్, కధా గమనం అన్నీ బాగుంటేనే సక్సెస్ అవుతుంది. అలా చూసుకుంటే వైసీపీ పొలిటికల్ సినిమా సక్సెస్ లో జగన్ ది మేజర్ షేర్ అనుకున్నా మిగిలిన అంశాల్లో అతి కీలకమైనది సోషల్ మీడియా విభాగం. ఏపీలో వేలల్లో ఉన్న వైసీపీ సైన్యం కొన్నేళ్ళ పాటు టీడీపీతో సామాజిక మాధ్యమాల ద్వారా ఒక పెద్ద యుద్ధమే చేశారు. వైసీపీ భావజాలాన్ని సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి పంపించి జగన్ మీద పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగించే రీతిలో వారు బ్రహ్మాండంగా పనిచేశారు.

చీల్చి చెండాడారుగా..?

నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు, లోకేష్, ఆయన గారి మంత్రులు చేసే అతి చిన్న తప్పులను కూడా సోషల్ మీడియా భూతద్దంలో పెట్టి మరీ రచ్చ రచ్చ చేశారు. ఫలితంగానే జనంలో బాబు పట్ల విరక్తి కలిగింది. ఏదో ఒక సభలో లోకేష్ అంబేద్కర్ జయంతిని వర్ధంతిగా తప్పు చెబితే దాన్ని చీల్చిచెండాడిన ఘనత కూడా వైసీపీ సోషల్ వింగ్ దే. అలా జగన్ పాదయాత్రలోని పాజిటివ్ అంశాలను, వైసీపీ అజెండాను ఎప్పటికపుడు జనం ముందుంచుతూనే ప్రత్యర్ధిని అల్లరి పాలు చేయడంతో సోషల్ మీడియా వింగ్ అద్భుతమైన పాత్ర పోషించింది. మరి వారు ఇపుడు ఎక్కడ ఉన్నారు. గత ఏడాదిన్నరగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ కంప్లీట్ గా డల్ అయిపోయింది.

సడీ సందడీ లేదుగా….?

ఒకనాడు బెబ్బులి మాదిరిగా గర్జించిన వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇపుడు అసలు సౌండ్ చేయడంలేదు. మరో వైపు మీరు నేర్పిన విద్యయే నీరజాక్షా అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ రెచ్చి రచ్చ చేస్తోంది. ఇపుడు వారిది టైం అన్నట్లుగా జగన్ సర్కార్ చేసే చిన్న తప్పులను ఎప్పటికపుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టి జనంలో కంపు కంపు చేస్తున్నారు. ఈ మధ్యన చూస్తే జగన్ వెల్లువలా ఇస్తున్న సంక్షేమ పధకాల మీద కూడా దాడి చేస్తూ ఏపీ ఖజానా చిల్లు పడుతోందని టీడీపీ వింగ్ గగ్గోలు పెడుతోంది. అది చివరకి తటస్థులకు, చదువరులకు చేరి భారీ చర్చకు కూడా దారితీస్తోంది.

అండగా ఉంటారా …?

మొత్తానికి గెలుపు అంతా తమ ఖాతాలో వేసుకుని జబ్బలు చరుస్తున్న పార్టీ పెద్దలకు సోషల్ మీడియా వీర సైనికుల అక్కర అవసరం అర్జంటుగా ఇపుడు తెలిసాయట. నయమే. ఇంకా ఏపీలో ఏ ఒక్క ఎన్నికా జరగకముందే వైసీపీ ఇలా మేలుకోవడం మంచి పరిణామమే. తాజాగా విజయవాడలో విశాఖలో సోషల్ మీడియా కార్యకర్తలతో వైసీపీ పెద్దలు మీటింగులు పెట్టి మరీ వారితో కొత్త కనెక్షన్లు పెట్టుకుంటున్నారు. మీకు పార్టీ అండగా ఉంటుందని హామీలు కూడా ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర స్థాయి సోషల్ మీడియా వైసీపీ వర్కర్ల మీటింగులో అయితే పార్టీ ఇంచార్జి, ఎంపీ విజయసాయిరెడ్డి అనేక రకాల రాయితీలు కూడా వారికి ప్రకటించారు. అర్హతలను బట్టి ఉద్యోగ‌ ఉపాధి అవకాశాలు కూడా వేలల్లో కల్పిస్తామని కూడా ప్రకటించారు. మొత్తానికి తెప్ప తగలేయకుండా వైసీపీ తెలివి తెచ్చుకుని సోషల్ మీడియా సైన్యాన్ని రీచార్జ్ చేసే పనికి పూనుకోవడం మంచి పరిణామమే కానీ వారిని అలా హామీలతో వదిలేస్తేనే మళ్ళీ కధ మొదటికి వస్తుంది. పార్టీకి అపూర్వ విజయం అందించిన వారిని గుర్తు పెట్టుకుని తమతోనే ముందుకు తీసుకెళ్తేనే జగన్ కి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని గుర్తెరగాలి.

Tags:    

Similar News