నిగ్గు తేల్చలేకపోతున్నారా?

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూడు నెలలు దాటింది. ఎన్నికలకు ముందు ప్రచారంలోనూ, తన సుదీర్ఘ పాదయాత్రలోనూ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కా ప్రణాళికతో [more]

Update: 2019-09-15 08:00 GMT

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూడు నెలలు దాటింది. ఎన్నికలకు ముందు ప్రచారంలోనూ, తన సుదీర్ఘ పాదయాత్రలోనూ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. కానీ అదే సమయంలో వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై మాత్రం నిజాల నిగ్గు తేల్చడం లేదు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ టీడీపీ నేతలు రెండున్నర లక్షల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. టీడీపీ నేతల అవినీతిపై ఒక పుస్తకాన్ని కూడా వైసీపీ ముద్రించి ప్రజలకు పంచింది. ప్రజలు కూడా కొంత వరకూ దీనిని నమ్మారు.

మూడు నెలలు దాటుతున్నా….

అయితే అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటుతున్నప్పటికీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ టీడీపీ అవినీతిని ఆధారాలతో ఒక్కటీ బయటపెట్టలేదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో జగన్ పోలవరం, పట్టిసీమ, అమరావతి రాజధాని నిర్మాణాల్లో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. పోలవరంపై నిపుణుల కమిటీని కూడా నియమించారు. అయితే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేశారు తప్పించి అందులో అవినీతి జరిగిందని వైఎస్ జగన్ సర్కార్ చూపలేకపోయింది.

ఆధారాలు దొరకడం లేదా?

ఇక మరో ముఖ్యమైనది పట్టిసీమ. పట్టిసీమ విషయంలో కాగ్ తప్పుపట్టిన విషయాన్ని కూడా వైసీపీ అప్పట్లో నానా హంగామా చేసింది. ఇందులో కూడా ఎటువంటి అవినీతిని ఆధారాలతో జగన్ ప్రభుత్వం చూపించలేకపోయింది. రాజధాని నిర్మాణంలో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని, టీడీపీ నేతలు, బినామీల వేలాది ఎకరాలు రాజధానిలో భూములు కొనుగోలు చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. దీనిపై కూడా ఇంతవరకూ స్పష్టమైన ఆధారాలను జగన్ సర్కార్ బయట పెట్ట లేకపోయింది.

పెట్టీ కేసులపైనే…..

ప్రధాన అంశాలను వదిలేసి పెట్టీ కేసులపైనే జగన్ సర్కార్ ఎక్కువ దృష్టి పెడుతుందన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ నాయకులపై పాత కేసులు తిరగదోడటం తప్ప జగన్ సర్కార్ సాధించిందేమీ లేదంటున్నారు. చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్, కోడెల శివప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యరపతినేని శ్రీనివాస్ లాంటి నేతల వ్యక్తిగత కేసులు, అవినీతిపైనే జగన్ సర్కార్ కేసులు నమోదు చేసి టీడీపీ మొత్తాన్ని అవినీతి పార్టీగా చిత్రీకరించాలని చూస్తుందని టీడీపీ నేతలుఆరోపిస్తున్నారు. కానీ ఎన్నికలకు ముందు టీడీపై వైఎస్ జగన్ ఆరోపించిన అవినీతిని మాత్రం ఇప్పటి వరకూ బయట పెట్టకపోవడంపై వైసీపీలోనే సర్వత్రా చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News