దారిలోకి తెచ్చారా…?

జగన్ అంటే జగమొండి అని ట్విట్టర్ లో చంద్రబాబు సెటైర్లు వేస్తారు. గిట్టని వారు కూడా అయన్ని మొండి అంటారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ [more]

Update: 2019-09-13 05:00 GMT

జగన్ అంటే జగమొండి అని ట్విట్టర్ లో చంద్రబాబు సెటైర్లు వేస్తారు. గిట్టని వారు కూడా అయన్ని మొండి అంటారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కి జగన్ మొండితనం మంచిగా కనిపిస్తుంది. ఆయన అనుకుంటే ఏదైనా చేస్తారని చెబుతూ మొండి ప్రస్తావన తీసుకువస్తారు. ఇక వైసీపీలోనే కాదు, బయట కూడా జగన్ ని మొండి అనే వారు ఉన్నారు. అయితే ఇష్టపడేవారికి అది జగన్ లోని పట్టుదలగా కనిపిస్తుంది. ఏపీ రాజకీయాల్లో తనదైన మార్క్ చూపించాలని గద్దెనిక్కిన జగన్ దానికి తగినట్లుగానే పాలన చేస్తూ వస్తున్నారు. కొన్ని విషయాల్లో ఆయన ఎక్కడా రాజీ పడడంలేదు. పైగా ఆయనే చెప్పుకువస్తున్నారు, తనపైన వత్తిళ్ళు ఎన్నో ఉన్నాయని, అయినా తాను మొండిగా ముందుకు సాగుతున్నానని. అటువంటి జగన్ ఇపుడు ఓ కీలకమైన విషయంలో వెనకడుగు వేశారట.

విద్యుత్ ఒప్పందాలపై వెనక్కు….

జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఒకటే మాట చెబుతున్నారు. అయిదేళ్ల టీడీపీ హయాంలో విద్యుత్ ఒప్పందాల వల్ల ఏపీకి పాతిక వేల కోట్ల భారం పడిందని, వాటిని తిరిగి సమీక్షిస్తామని కూడా చెప్పారు. ఈ విషయంలో పాత ఒప్పందాలను తిరగతోడడం ద్వారా ఏపీలో ప్రజలకు నష్టాల, కష్టాల భారాన్ని కూడా తగ్గిస్తానని జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలు గమనిస్తే కొంతమంది దీని మీద కోర్టుకు వెళ్ళి అడ్డుపెట్టారు, కేంద్రం సైతం విద్యుత్ ఒప్పందాలను తిరగతోడరాదని హుకుం జారీ చేసింది. దాని వల్ల ఒక్క ఏపీకే కాదు, దేశంలోని అన్ని ఒప్పందాల మీద ప్రభావం పడుతుందని కూడా హెచ్చరించింది. ఇక జపాన్ లాంటి దేశాలు కూడా ఈ విషయంలో తమ అసంత్రుప్తిని వ్యక్తం చేశాయి. వాటికి కూడా ఇక్కడ విద్యుత్ కాంట్రాక్టులు ఉన్నాయి. ఇవన్నీ ఒకటైతే కేంద్రం నుంచి వచ్చిన వత్తిళ్ళ ఫలితంగా జగన్ ఎట్టకేలకు పాత ఒప్పందాల జోలికి పోనని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

బాబు ఖుషీయేనా…?

ఈ మేరకు కేంద్రానికి ఏపీ సర్కార్ లేఖ రాసినట్లుగా కూడా ప్రచారంలో ఉంది. పాత ఒప్పందాలను తాను ముట్టుకోనని, ఇకపై జరిగే కొత్త ఒప్పందాలను మాత్రం సమీక్షించుకుంటామని ఏపీ సర్కార్ ఆ లేఖలో కేంద్రానికి తెలియచేసినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ ఒప్పందాల విషయంలో పదే పదే ఏపీ వైఖరిని కోరుతూ కేంద్ర పెద్దలు వత్తిడి తెచ్చారు. మొత్తానికి జగన్ ని తమ దారిని తెచ్చుకున్నారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా విద్యుత్ ఒప్పందాలను తిరగతోడమని చెప్పడం ద్వారా జగన్ చంద్రబాబు విధానాలకు జై కొట్టినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బాబు అవినీతికి పాల్పడ్డారని ప్రచారం చేసిన జగన్ చివరికి వెనక్కు పోవడం ఓ విధంగా టీడీపీకి లాభమే కాకుండా పొలిటికల్ గా కూడ అడ్వాంటెజ్ గా ఉంటుందని అంటున్నారు. చూశారా మా మీద పెద్దగా గోల చేసి కూడా ఒక్క అవినీతిని నిరూపించలేకపోయారని బాబుతో సహా తమ్ముళ్ళు గొంతెత్తి అరచే అవకాశం ఉంది. అయితే జగన్ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని, కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉండరాదన్న విధానంతోనే ఆయన ఇలా చేశారని అంటున్నారు.

Tags:    

Similar News