జగన్ వరం…శాపమైందా?

ముఖ్యమంత్రి జగన్ ని ఓ విషయంలో పరమశివుడిగా కూడా అభివర్ణించాలేమో. వరాలు అడిగితే చాలు ముందూ వెనకా చూసుకోకుండా ఆయన ఇచ్చేస్తారు. దాని వల్ల అప్పటికి బాగానే [more]

Update: 2019-11-15 14:30 GMT

ముఖ్యమంత్రి జగన్ ని ఓ విషయంలో పరమశివుడిగా కూడా అభివర్ణించాలేమో. వరాలు అడిగితే చాలు ముందూ వెనకా చూసుకోకుండా ఆయన ఇచ్చేస్తారు. దాని వల్ల అప్పటికి బాగానే ఉన్నా తరువాత చూసుకుంటే పర్యవసానాలు వేరేగా వుంటున్నాయి అంటున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన సర్కార్ తమదని జగన్ వస్తూనే వరాలు అనేకం ఇచ్చేశారు ఇపుడు అదే శాపమవుతోందని ఉన్నతస్థాయి అధికార యంత్రాంగం మధపడుతోంది. తాను గత ముఖ్యమంత్రి చంద్రబాబులా ఉద్యోగులను రాత్రీ పగలు ఇబ్బంది పెట్టనని వారు వర్కింగ్ అవర్స్ దాటితే ఆఫీసుల్లో ఉండనక్కరలేదని జగన్ కొత్తల్లో హామీ ఇచ్చేశారు. ఇపుడు దాన్ని పట్టుకుని ఉద్యోగులు మొరాయిస్తున్నారు. సాయంత్రం అయిదు దాటితే తాము ఆఫీసుల్లో ఉండమని గట్టిగా చెప్పేస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

సిక్కోలు నుంచే….

ఇక ఉద్యమాలకు పురిటిగడ్డగా చెప్పుకునే శ్రీకాకుళం నుంచే ఉద్యోగులు ఈ రకమైన గర్జన మొదలెట్టారు. ముఖ్యమంత్రి జగనే తమకు హామీ ఇస్తే ఇక కలెక్టర్, ఇతర అధికారులతో సంబంధం ఏముందని రెవిన్యూ ఉద్యోగులు అంటున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం అయిదు దాటితే ఆఫీసుల్లో ఉండమని తాళాలు వేసి మరీ తప్పుకుంటున్నారు. కలెక్టర్, ఇతత అధికారులు వీడియో కాన్ఫరెన్సులు పెట్టి మరీ తమను పది వరకూ వాయగొడుతున్నారని, ఈ బండ చాకిరీ చేయలేమని అంటున్నారు. ఠంచనుకుగా తాము డ్యూటీ దిగిపోతామని అల్టిమేటమే కలెక్టర్ కి ఇచ్చేశారు. నిజంగా ఉద్యోగులకు ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ మాటవరసకు వరంగా ఇచ్చినా సర్కార్ ఆఫీసుల్లో పని కచ్చితంగా అయిదుతో పూర్తి అవుతుందా అని ఉన్నతాధికారులు అంటున్నారు. అసలు పని కూడా అపుడే మొదలవుతుందని కూడా చెబుతున్నారు.

ఏపీకి పాకుతున్న పోరాటం…

ఇక సిక్కోలులో రెవిన్యూ ఉద్యోగులు అయిదింటికే తాళాలు వేసుకుని ఆఫీస్ నుంచి బయటపడుతూంటే మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా అదే అనుసరిస్తున్నారు. దాంతో జిల్లా అంతటా ప్రభుత్వ పధకాల అమలు నిలిచిపోతోందని ఉన్నతాధికారులు గగ్గోలు పెడుతున్నారు. మరో వైపు సిక్కోలు తరహా ఉద్యమాన్ని ఇతర జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామలతో నవరత్నాలు లాంటి ప్రభుత్వ స్కీములు అమలు ఆగిపోతోందని అంటున్నారు.

పాలన ఆగినట్లేనా?

నిజానికి పది నుంచి అయిదు గంటల వరకే పని అని చెప్పినా కూడా ప్రభుత్వ కార్యక్రమాల వత్తిడి, మంత్రుల పర్యటనలు, సమావేశాలు ఇలా చాలా ప్రతీ రోజూ జరుగుతూ ఉంటాయి. అయిదింటికి తాళం వేసుకుని వెళ్ళిపోతామని ఉద్యోగులు అంటే మొత్తానికి మొత్తం ప్రభుత్వ పాలన ఆగిపోయినట్లేనని ఉన్నతాధికారులు అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ అన్నది తాను పని లేకపోతే ఎక్కువగా ఇబ్బంది పెట్టను అని మాత్రమే అని, దాన్ని పట్టుకుని పని ఉన్నా సరే మొత్తానికి మొత్తం డ్యూటీ గీత దాటమని అంటే ఇక సర్కార్ నడచినట్లేనని వైసీపీ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి దృష్టికి వెళ్ళింది. ఆయన ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.

Tags:    

Similar News