జగన్ కి దోస్తీ అంటే గిట్టదా?

జగన్ రాజకీయాల్లోకి రావడమే తండ్రి శత్రువులను వారసత్వంగా పొందారు. ఇక జగన్ మార్క్ దూకుడుతో ఎప్పటికపుడు కొత్త శత్రువులను ఆయన తయారుచేసుకుంటూనే ఉన్నారు. పదేళ్ల ప్రతిపక్ష పాత్రలో [more]

Update: 2019-10-22 02:00 GMT

జగన్ రాజకీయాల్లోకి రావడమే తండ్రి శత్రువులను వారసత్వంగా పొందారు. ఇక జగన్ మార్క్ దూకుడుతో ఎప్పటికపుడు కొత్త శత్రువులను ఆయన తయారుచేసుకుంటూనే ఉన్నారు. పదేళ్ల ప్రతిపక్ష పాత్రలో జగన్ అంటే ఎందరో గిట్టని వారు తయారయ్యారు. ఇక జగన్ కి ఎవరితోనూ పడదని, ఆయన తత్వానికి దోస్తీలు అసలు పడవని కూడా ప్రచారం ఉన్న సంగతి విదితమే. ఇది చాలదన్నట్లుగా జగన్ అధికారం చేపట్టాక మరింతమందికి కన్నెర్ర అయ్యారు. జగన్ వైపు నుంచి ఎంత ఆరాటం వుందో తెలియదు కానీ ఎన్నికల వరకూ మాత్రం బీజేపీ జగన్ తో తెర వెనక దోస్తీ చేసినట్లుగా కనిపించింది. ఈ రకమైన వ్యూహాలు, రాజకీయాలు జగన్ చేయలేరని అనుకున్న వారు కూడా ఇది నిజమేనా అని ఆశ్చర్యపోవాల్సివచ్చింది. ఇక ఎన్నికల ఫలితాలు తరువాత జగన్ కి బంపర్ మెజారిటీ వచ్చేసింది. దాంతో బీజేపీకి అదే అసూయగా మారిందని రాజకీయాల్లో చెప్పుకుంటున్నారు.

అసలైన శత్రువా…?

ఏపీలో చంద్రబాబు బరువు దించేసుకుంటే జగన్ ని సులువుగా మెడలు వంచేయవచ్చు అనుకున్నా బీజేపీకి జగన్ కి జనాల్లో ఇంత ఆదరణ ఉందా అని ఫలితాలు చూసి ఆశ్చర్యపోవాల్సివచ్చింది. దాంతో ఇపుడు బీజేపీకి బాబు కంటే జగన్ పెద్ద శత్రువు అయ్యారు. జగన్ ని బదనాం చేయడం అంటే చాలా కష్టమని కూడా బీజేపీకి అర్ధమైపోయింది. నీటిలో మొసలి మాదిరిగా జనంలో బలం ఉన్న జగన్ ని పక్కన పెట్టడం చాల బిగ్ టాస్క్ అని కూడా కమలనాధులు భావిస్తున్నారు. ఈ విధంగా జగన్ బీజేపీకి శత్రువు కావడం రాజకీయల్లో పెద్ద ట్విస్ట్.

పవన్ అంతేగా…?

ఇక జనసేనాని పవన్ కి కి మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబం అంటే ఎందుకో గిట్టదని ప్రచారంలో ఉంది. ఆయన 2009 ఎన్నికల ముందు యువరాజ్యం అధినేతగా ప్రచారానికి వస్తూనే పంచెలూడగొడతా అంటూ ఆవేశంతో వూగిపోయారు. పంచె కట్టు సీఎం అప్పట్లో వైఎస్సార్ మాత్రమే. ఆ విధంగా పవన్ ఫస్ట్ టార్గెట్ వైఎస్సార్నే చేశారు. తరువాత 2014 ఎన్నికల్లో కూడా జగన్ కి అధికారం దక్కకూడదనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ బాహాటంగా చెప్పుకున్నారు. 2019 ఎన్నికల వేళ పవన్ ప్రతిపక్షంలో ఉండి కూడా సాటి ప్రతిపక్షమైన వైసీపీ మీదనే విరుచుకుపడ్డారు. ఇపుడు ఎటూ అధికార పక్షంగా జగన్ మాత్రమే పవన్ కి టార్గెట్.

కేసీఆర్ సైతం….

ఇపుడు చూసుకుంటే జగన్ కి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహబాంధవుడు అంటూ కధనాలు వచ్చాయి. అయితే ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో జగన్ మీదనే కేసీఆర్ గుస్సాగా ఉన్నట్లుగా చెబుతున్నారు. నిజానికి ఆర్టీసీ సమ్మెకు జగన్ ప్రత్యక్ష కారణం కాదు కానీ ఆయన ఏపీలో అర్టీసీని విలీనం చేయడంతో ఆ వత్తిడి కేసీఆర్ మీద గట్టిగానే పడింది. దాంతో జగన్ పెద్ద తలనొప్పి అని కేసీఆర్ భావిస్తున్నట్లుగా భోగట్టా. వీటికి తోడు లక్షా ముప్పయివేల జాబ్స్ భర్తీ చేయడం, అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కేసీఆర్ జగన్ బంధం ముందు కూడా ఇలాగే కొనసాగుతుందాన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వామపక్షాల తీరు చూసినా జగన్ కి ఎపుడూ వారు చెలిమి హస్తం అందివ్వలేదు. ఆదిలో కాంగ్రెస్ తో మొదలైన రాజకీయ శత్రుత్వం ఇలా పదేళ్లలో విస్తరించడం అంటే జగన్ దూకుడే కారణమా అన్న చర్చ కూడా సాగుతోంది. టీడీపీ ఎటూ బద్ద శత్రువు అన్నది వేరేగా చెప్పక్కరలేదు. ఈ నేపధ్యంలో జగన్ ప్రజలనే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.

Tags:    

Similar News