వస్తేరానీ… రాకుంటే పోనీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 15వ తేదీన రైతు భరోసా కార్యక్రమాన్ని అట్ట హాసంగా ప్రారంభించనున్నారు. తన ప్రభుత్వం రైతు పక్షపాతి అని నిరూపించుకోవడానికి జగన్ [more]

Update: 2019-10-07 11:00 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 15వ తేదీన రైతు భరోసా కార్యక్రమాన్ని అట్ట హాసంగా ప్రారంభించనున్నారు. తన ప్రభుత్వం రైతు పక్షపాతి అని నిరూపించుకోవడానికి జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు విడుదల చేసిన రుణమాఫీ ఉత్తర్వులను జగన్ సర్కార్ రద్దు చేసింది. ఆ స్థానంలో రైతు భరోసా కార్యక్రమాన్నిచేపట్టింది. ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని పిలిచి రైతు భరోసాను అట్టహాసంగా ప్రారంభించాలనుకున్నారు.

రైతు భరోసా కార్యక్రమాన్ని…..

జగన్ పాదయాత్రలోనూ, తన మ్యానిఫేస్టోలోనూ రైతు భరోసా కార్యక్రమం అత్యంత ముఖ్యమైంది. ఈనెల 15వ తేదీ నుంచి పథకం ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ అర్హులైన ప్రతిరైతు కుటుంబానికి పెట్టుబడి కింద యాభై వేలు ఇస్తారు. అలాగే పంట వేసే సమయానికి 12, 500లు ఇస్తామని జగన్ ప్రకటించారు. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ పథకం కింద అర్హులైన లబ్దిదారుల జాబితా సిద్ధమవుతోంది. ఎన్ని ఎకరాలున్నప్పటికీ యాభైవేల రూపాయలు పెట్టుబడి కింద ఇవ్వనున్నారు.

స్వయంగా వెళ్లి….

అయితే ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా వైఎస్ జగన్ వెళ్లి రైతు భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఒక ప్రతిష్టాత్మకైన పథకాన్ని ప్రధాని మంత్రి చేత ప్రారంభిస్తే బాగుంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మోడీతో భేటీ అయి ఆహ్వానం పలికారు. కానీ జగన్ ఆహ్వానాన్ని మోదీ మన్నించారా? తిరస్కరించారా? అన్నది బయటకు రాలేదు. ఇటు సీఎంవో గాని, అటు పీఎంవో గాని మోదీ వస్తున్నారా? లేదా? అన్నది ఇప్పటి వరకూ తెలియజేయలేదు.

రాకుంటేనే బెటరా?

దీంతో మోదీ ఆంధ్రప్రదేశ్ రాకపై సందిగ్దత నెలకొంది. వైసీపీ సర్కార్ కూడా మోదీ రాకపై ఎలాంటి ప్రకటనచేయలేదు. జగన్ కూడా నరేంద్ర మోడీ వస్తే వంద …రాకుంటే వేయి దండాలు అన్నట్లుగానే ఆలోచిస్తున్నట్లుంది. మోదీ రెండోసారి ప్రధాని మంత్రి అయిన తర్వాత కూడా విభజన ఆంధ్రప్రదేశ్ కు పెద్దగా చేసిందేమీలేదు. న్యాయంగా,చట్టపరంగా రావాల్సిన నిధులు మాత్రమే కేంద్రం విడుదల చేస్తుంది. అవి రాష్ట్రం అడిగినా అడగకపోయినా విడుదలయ్యే నిధులే. మనసులో మాత్రం జగన్ మోదీ ఈ కార్యక్రమానికి రాకపోవడమే బెటరని ఫీలవుతున్నట్లుంది. అందుకే పెద్దగా మోదీ రాక విషయంపై పెద్దగా పట్టించుకోవడం లేదు.

Tags:    

Similar News