చిర్రెత్తిస్తున్నాడుగా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత తన స్టయిల్ ను పూర్తిగా మార్చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకమునుపు వివిధ రకాల దుస్తులు ధరించేవారు. [more]

Update: 2019-10-06 12:30 GMT

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత తన స్టయిల్ ను పూర్తిగా మార్చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకమునుపు వివిధ రకాల దుస్తులు ధరించేవారు. కానీ పాదయాత్ర నుంచి ఆయన తన వేషధారణను పూర్తిగా మార్చేశారు. తెలుపు చొక్కా, ఖాకీరంగు ప్యాంటు పాదయాత్రలో ధరించారు. ముఖ్యమంత్రి అయినా అవే రంగులను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఖాకీరంగు ప్యాంటు శ్రమకు, తెల్ల చొక్కా శాంతికి చిహ్నమని ఆ రంగులను ఎంచుకున్నారట.

అనుకూలంగా మార్చుకోవాల్సిన….

ఇంతవరకూ బాగానే ఉంది. జగన్ ఏ దుస్తులు వేస్తే మనకెందుకు? ఆయన హుందాగా ఉంటున్నారు. అది చాలు కానీ, చంద్రబాబు లాగా ఎందుకు మీడియా సమావేశాలు పెట్టడం లేదు? తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అంశాలను కూడా జగన్ ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలపై జగన్ స్పందించలేదు. దానికి కొన్ని కారణాలున్నాయనుకుందాం. తాను మాట్లాడిన తర్వాత ఇక ఏమీ ఉండదని ఆ అంశాలకి కామా పెట్టేస్తున్నారు అనుకుందాం.

మోడీ తో భేటీ వివరాలను…..

తాజాగా జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఇద్దరి సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. ప్రధాని మోడీ తో జగన్ అనేక అంశాలపై చర్చించి ఉంటారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం రివర్స్ టెండర్లు, కడప స్టీల్ ఫ్యాక్టరీ వంటి అంశాలు చర్చలకు వచ్చాయని చెబుతున్నారు. ఫలానా అంశాలు చర్చకు వచ్చాయని అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా మీడియా ఊహించుకోవడమే.

టీడీపీ నేతల్లో టెన్షన్…..

అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రధానిని కలసినప్పుడు సీన్ రివైండ్ చేసుకుని చూడండి. ఢిల్లీలో ఒకటి, మధ్యలో వీలయితే హైదారాబాద్ లో చివర్లో అమరావతిలో మీడియా మీటు పెట్టేసి తన భేటీ రాష్ట్రానికి ఎంత మేలు చేకూర్చిందో చెప్పేవారు. కానీ వైఎస్ జగన్ మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. మోడీ భేటీలో రాష్ట్రానికి ఎలాంటి హామీలు వచ్చాయో చెప్పలేదు. పూర్తిగా మౌనంగా ఉంటున్నారు. మరి టీడీపీ నేతలకు జగన్ తీరు చిర్రెత్తుకురాదూ. అందుకే జగన్ మోడీతో ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు మన యనమల రామకృష్ణుడు గారు. మొత్తం మీద జగన్ మోడీతో ఏం మాట్లాడరన్న దానిపై టీడీపీ నేతలే ఎక్కువ టెన్షన్ పడుతున్నట్లుంది.

Tags:    

Similar News