అలా దెబ్బకొడితే కదా?

కులం చేత, కులం కోసం, కులం ద్వారా సమాజాన్ని శాసించడమే అసలైన ప్రజాస్వామ్యంగా చలామణి అవుతోన్న రోజులివి. తమ లక్ష్యాలకు, ఆకాంక్షలకు ప్రజల భావోద్వేగాలను ముడి పెట్టి [more]

Update: 2019-09-26 08:00 GMT

కులం చేత, కులం కోసం, కులం ద్వారా సమాజాన్ని శాసించడమే అసలైన ప్రజాస్వామ్యంగా చలామణి అవుతోన్న రోజులివి. తమ లక్ష్యాలకు, ఆకాంక్షలకు ప్రజల భావోద్వేగాలను ముడి పెట్టి లబ్ది పొందడమే అసలు నిజం. జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, సమాజాన్ని ఉద్ధరించే ఆకాంక్షతో తపిస్తున్న పవన్ కళ్యాణ్ అయినా మొదట అధికారాన్ని కులం చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనే భావిస్తారు. వామపక్ష ఉద్యమాలు ఎప్పుడో కులం చట్రంలో చిక్కుకుపోయాయి కాబట్టి వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు.రాజకీయ ప్రత్యర్థుల్ని భయ భ్రాంతులకు గురి చేయడం ద్వారా తమ ఆధిపత్యాన్ని చూపించుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తుండవచ్చు.

రాజధాని విషయంలోనూ….

మొదట రాజధాని నిర్మాణాన్ని తీసుకుంటే ప్రజల భాగస్వామ్యంతో దాదాపు 28వేల మంది రైతుల నుంచి సేకరించిన 33వేల ఎకరాల భూమిలో కొత్త నగరాన్ని నాలుగేళ్ళ క్రితం ప్రారంభించారు. ఈ రాజధానికి భూములు ఇచ్చిన వారు, లబ్ది పొందిన వారు మెజారిటీ పాలక వర్గాలకు చెందిన వారు. నష్టపోయిన వారు ఉపాధి కోల్పోయిన వారు సహజంగానే కింద కులాల వారు అయ్యారు. ఒకప్పటి వ్యవసాయ కార్మికులు ఇప్పుడు సచివాలయంలో పారిశుధ్య కార్మికులుగా మారిపోయారు. కొద్దో, గొప్ప చదువుకున్న వారు డ్రైవర్లు, అటెండర్లుగా మారారు. భూములు లేని వారు నిరాశ్రయులయ్యారు., చివరకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి. రాజధాని నగరం నిర్మాణం కొలిక్కి వస్తే ఓ కొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పడి తమ బతుకులు గాడిన పడతాయనే భ్రమలకు కూడా ఇప్పుడు అర్థం లేకుండా పోయింది. నిజానికి స్థానిక ప్రజల ఉపాధి, భవిష్యత్తు అనే భరోసా ఏది ప్రభుత్వ రాజధాని నిర్మాణ ప్రణాళికలో లేదు. భూసేకరణ- భూముల వాటా కేటాయింపు తర్వాత మిగిలే ఏడెనిమిది వేల ఎకరాల భూమి విలువ నాలుగైదు రెట్లు పెరిగితే దాని ద్వారా ఆదాయం లభిస్తుందనే అంచనా తప్ప సామాజిక సమతుల్యం, వనరుల పంపిణీ, అభివృద్ధిలో భాగస్వామ్యం అన్ని కులాలకు పంచడం లేదని మర్చిపోయారు. అందుకే అమరావతి అందరి రాజధాని కాలేకపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో బలంగా గూడు కట్టుకోవడానికి ఇదే ప్రధాన కారణం. ముఖ్యంగా చంద్రబాబు చుట్టూ బలంగా నిర్మితమైన కుల గోడలు ఈ అసహనాన్ని మరింతగా పెంచాయి. దానికి ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు.

మూలాల్ని బద్దలు గొట్టడానికే…..

కులం బలం పెరిగి, ఆర్థికంగా వనరుల్ని పెంచుకుని రాజకీయంగా పది, పదిహేనేళ్ల పాటు పార్టీని నడుపుకునేంత పరిపుష్ఠం అయిన ప్రత్యర్థుల్ని దెబ్బ తీయడానికి వారి ఆర్థిక మూలాలు కదిలించడమే మార్గంగా భావించడమే ప్రస్తుత చర్యల వెనుక ఉన్న ఉద్దేశం. మొదట ఇసుక సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా రియల్ ఎస్టేట్ కుదేలు అయ్యింది. ఈ రంగం ప్రధానంగా ఓ వర్గం చేతుల్లోనే ఉంది అన్నది నిర్వివాదాంశం. రాజధాని నిర్మాణ పనులు నిలిపి వేయగానే అక్కడ ప్రధాన సంస్థలు దెబ్బ తిన్నాయి. ప్రధాన కాంట్రాక్ట్ లు, వేల కోట్ల ప్రాజెక్టులు ఆగిపోయాయి. 25శాతం కంటే తక్కువ పని జరిగిన పనులు రద్దయ్యాయి.ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబుది కాని ఇంటి మీద దండయాత్ర మొదలైంది. ఈ కూల్చివేత వల్ల లాభ నష్టాలు రెండూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి, కృష్ణా తీరంలో కులపెద్దగా కొలువు దీరిన చంద్రబాబును అక్కడి నుంచి కదిలిస్తే నమ్ముకున్న వారి స్టైర్యం దెబ్బ తింటుంది. ప్రత్యర్థుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అదే సమయంలో చంద్రబాబు పాచిక కూడా పారినట్లవుతుంది. జగన్ మీద విమర్శలు చేయడానికి, అతడి తీరు ఎండ గట్టడానికి చంద్రబాబుకి అవకాశం దక్కుతుంది. ఎటూ చంద్రబాబు పల్లకి మోయడానికి అనుకూల మీడియా రెడీగా ఉంటుంది. కులం ప్రయోజనాలను సమాజ అవసరాలుగా మార్చేసి జనం మైండ్ ట్యూన్ చేయడం ఎలాగో వాటికి బాగా తెలుసు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News