మోడీకి జగన్ నో చెబుతారా ?

దేశాన్నేలే నరేంద్ర మోడీ ఎదురుగా వచ్చి జగన్ ని బతిమాలితే ఒప్పుకోకుండా ఉంటారా. జాతీయ స్థాయిలోనే బలమైన నేతగా ఉన్న మోడీని కాదని ముందుకు పోగలరా. ఇదీ [more]

Update: 2020-07-13 12:30 GMT

దేశాన్నేలే నరేంద్ర మోడీ ఎదురుగా వచ్చి జగన్ ని బతిమాలితే ఒప్పుకోకుండా ఉంటారా. జాతీయ స్థాయిలోనే బలమైన నేతగా ఉన్న మోడీని కాదని ముందుకు పోగలరా. ఇదీ ఇపుడు చర్చగా ఉంది. ఇంతకీ మోడీ అడిగేది ఏంటి, జగన్ కాదనేదేంటి అన్నది ఆలోచిస్తే అది చాలా క్లిష్టమైన విషయమే. సంక్లిష్టమైన వ్యవహార‌మే. నిజానికి జగన్ కి ఇలాంటి అనుభవం ఎదురైతే ఏం చెబుతారో కూడా పార్టీ వారికే అర్ధం కాదంటున్నారు. అదేంటి అంటే వైసీపీని కేంద్ర మంత్రివర్గంలోకి చేరమని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా స్వయంగా అభర్ధిస్తే జగన్ కాదంటారా అన్నది. నిజమే రాజకీయ పార్టీగా బీజేపీ సిధ్ధాంతాలు వేరు, వైసీపీవి వేరు. పైగా జగన్ రాజకీయ సైద్ధాంతిక పునాది కూడా వేరు. అలాంటిది ఆయన వెళ్ళి ఎన్డీఏలో చేరడానికి ఎలా సంసిధ్ధులవుతారు అన్నది పెద్ద ప్రశ్న.

విస్తరణ దిశగా …..

కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలో విస్తరిస్తారని అంటున్నారు. ఈ మేరకు మోడీ ఈ మధ్యనే వెళ్ళి రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్ ని కలసి మాటలో మాటగా ఈ సంగతి చెప్పారని అంటున్నారు. ఈ మధ్యనే రాజ్యసభకు కూడా ఎన్నికలు జరిగాయి. కొత్త వారు చేరారు. మరో వైపు ఏడాది కాలంగా పనిచేయని వారిని తీసేసి అవసరం ఉన్న చోట, రాజకీయ ప్రాధాన్యతల దృష్ట్యా కొత్తవారిని తీసుకోవాలని మోడీ భావిస్తున్నారు. దాంతో ఇపుడు అందరి దృష్టి కేంద్ర మంత్రివర్గ విస్తరణ మీద పడింది. మరీ ముఖ్యంగా ఏపీ వంటి రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లేదు. దాంతో అక్కడ ఎవరికి చాన్స్ ఇస్తారన్నది కూడా ఒక చర్చగా ఉంది.

మోడీ పట్టు…..

ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ రాజకీయ అవసరాలు ముందు చూపుతో బీహార్ నుంచి నితీష్ ని, ఏపీ నుంచి జగన్ ని కేంద్ర మంత్రి వర్గంలో చేరాలని కోరుతున్నాట్లుగా వార్తలు వస్తున్నాయి. బీహార్లో బీజేపీకి ఎన్నికల అవసరాలతో పాటు నితీష్ పార్టీ జేడీయూతో మంచి సంబంధాల కోసం మంత్రి వర్గంలో చేర్చుకోవడాలు వంటివి ఉన్నాయి. ఇక ఏపీ విషయం తీసుకుంటే జగన్ పార్టీ లోక్ సభలో నాలుగవ అతి పెద్ద పార్టీగా ఉంది. పైగా ఏపీతోనూ, జగన్ తోనూ కూడా మోడీకి రాజకీయ అవసరాలు బోలెడు ఉన్నాయి. దాంతో జగన్ పార్టీని ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. మరి మోడీ అంతలా పట్టుపడితే జగన్ కూడా మెత్తబడతారా అన్నది చూడాలని అంటున్నారు.

మూడు బెర్తులు….

ఒక క్యాబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటోందిట. పైగా వైసీపీతో మంచి సంబంధాలు నెరపాలని కూడా బీజేపీ భావిస్తోందిట. ఇక రాజ్యసభలో ఆరుగురు వైసీపీ ఎంపీలు ఉండడంతో ఆ పార్టీని మచ్చిక చేసుకోవాలనుకుంటోందిట. అటు నితీష్, ఇటు జగన్ ఓకే అంటే కేంద్ర మంత్రి వర్గానికి ముహూర్తం పెట్టుకోవచ్చునని మోడీ భావిస్తున్నారుట. గతంలో తమకు ప్రాధాన్యత సరిగ్గా లేదని అలిగి దూరంగా ఉన్న జేడీయూ ఈసారికి తగ్గి మంత్రి పదవులు తీసుకోవచ్చు. పైగా బీహార్ లో బీజేపీ, జేడీయూల మధ్య రాజకీయ పొత్తులు ఉన్నాయి. ఇబ్బంది లేదు, కానీ ఏపీలో అలా కాదు, బీజేపీ వైసీపీ వేరుగా ఉంటున్నాయి. పైగా దళితులు, మైనారిటీలు వైసీపీ ఓటు బ్యాంక్. . బీజేపీ పెద్దల మాటలకు మెత్తబడి ఎన్డీయో లో చేరి రెండో మూడో మంత్రి పదవులకు ఆశపడితే రాజకీయంగా పూర్తిగా ఇబ్బందులు వస్తాయన్న భయం వైసీపీ పెద్దలలో ఉందని చర్చ సాగుతోంది. అసలు వైసీపీ రాజకీయ పునాదిని దెబ్బతీయడానికేనా బీజేపీ కేంద్ర మంత్రి పదవులతో వత్తిడి తెస్తోంది అన్న చర్చ కూడా ఉందిట. మొత్తానికి మోడీ ఎంత బతిమాలినా జగన్ మొండిగానే నిలబడతారు తప్ప కేంద్రంలో చేరరు అన్న మాట కూడా వినిపిస్తోంది. చూడాలి మరి.

Tags:    

Similar News