చంద్రబాబుని మరచిపోతేనే బెటరా…?

ఏపీకి ముమ్మారు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుని మరచిపోవడం అసాధ్యం. రాజకీయాలు ఆ మాత్రం తెలిసిన వారు సైతం చంద్రబాబుని పొగుడుతూనో తిడుతూనో ఆయన ప్రస్థావన తెస్తూనే ఉంటారు. [more]

Update: 2019-08-21 06:30 GMT

ఏపీకి ముమ్మారు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుని మరచిపోవడం అసాధ్యం. రాజకీయాలు ఆ మాత్రం తెలిసిన వారు సైతం చంద్రబాబుని పొగుడుతూనో తిడుతూనో ఆయన ప్రస్థావన తెస్తూనే ఉంటారు. మరి అటువంటి చంద్రబాబుని మరచిపోమంటే మాటలా. అందులోనూ ఆయనతో పదేళ్ళుగా రాత్రి పగలు తేడా లేకుండా పోరాడుతున్న జగన్ కి అది సాధ్యపడే విషయమా. కానీ తప్పదు మరి. జగన్ తాను చేసిన పోరాటం ఫలితంగా కోరుకున్న ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆయన వయసు కూడా చిన్నదే. అంత చిన్న వయసులో దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జగన్ అసలైన రాజకీయ జీవితం చెప్పాలంటే ఇపుడే మొదలైంది.

అభివృధ్ధి వైపుగా….

జగం ముఖ్యమంత్రి అయి వంద రోజులు దగ్గరకు చేరువ అవుతోంది. జగన్ ఈ మధ్య కాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. అలాగే కొన్ని చికాకులు కూడా ఎదురయ్యాయి. మరి కొన్ని వారసత్వంగా కూడా చంద్రబాబు నుంచి వచ్చాయి. అయితే చంద్రబాబుని జనం మాకు వద్దు అనుకుని ఇంటికి పంపించారు. కాబట్టి జగన్ వేరేగా ఆయన్ని జనం ముందు దోషిని చేసి నిలబెట్టనక్కరలేదు. ఆ విధంగా చేస్తే అది చంద్రబాబుకే మేలు తప్ప జగన్ కి ఏ మాత్రం కాదని తెలుసుకోవాలి. చంద్రబాబు ప్రస్తావన లేకుండా జగన్ అడుగులు ముందుకువేయాలి. కొన్ని కాని పనులు చంద్రబాబు చేసినా కూడా జగన్ సహనంతో వాటిలో లోటుపాట్లు సవరించుకుని ముందుకు సాగాలి. చంద్రబాబు చేశాడు కనుక అన్ని చెడ్డవి కూడా కావు. ఇక్కడ ప్రజలు ముఖ్యమన్న సంగతిని కూడా జగన్ గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటివరకూ జగన్ ప్రజల కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు, కానీ వాటి కంటే ఎక్కువగా చంద్రబాబుని ఇబ్బందుల పాలు చేస్తున్నారన్న సంకేతాలను టీడీపీ విజయవంతంగా జనంలోకి పంపుతోంది. చంద్రబాబు ఉంటున్నది అక్రమమైన భవనం అయితే దాన్ని న్యాయబద్ధంగా కోర్టుల ద్వారా పరిష్కారం చేసి మరీ కూల్చే పనులు చేస్తే జనం హర్షిస్తారు, అంతే తప్ప తుపాను సమయాల్లో డ్రోన్లు ఇంటి మీద పెట్టడం, మంత్రులు దండెత్తి చంద్రబాబు నివాసానికి వెళ్ళడం ద్వారా బాబుకు సానుభూతి వస్తుంది తప్ప మరేమీ కాదు.

అవుట్ డేటెడ్ పాలిటిక్స్….

చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన పూర్తిగా అవుట్ డేటెడ్ పాలిటిక్స్ చేస్తారని పేరు. ఆయన రాజకీయ జీవితం కూడా దాదాపుగా ముగిసినట్లేనని తలపండిన రాజకీయ మేధావులు చెబుతారు. ముందున్న జీవితమంతా జగన్ దే. ఆయన పొలిటికల్ కెరీర్ ఎంత బాగా చక్కదిద్దుకుంటే అన్నేళ్ళ పాటు ఆయన కోరుకున్న పీఠం మీద ఉంటారు. ఇక అధికారంలోకి వచ్చేశాం కదా అని దూకుడు మీద ఉంటే మాత్రం జనం నుంచి విమర్శలే ఎదురవుతాయి. ఆ సంగతి తెలుసుకుని జగన్ వ్యవహరిస్తే మేలు. ముప్పయ్యేళ్ళు ముఖ్యమంత్రిగా పాలిస్తాను అని చెప్పడం కాదు, దానికి తగిన ప్రాతిపదిక ఇప్పటి నుంచే సిధ్ధం చేసుకుని జగన్ అడుగులు వేయాలి. జగన్ గత ప్రభుత్వం చెసిన మంచి పనులు కొనసాగిస్తూనే చంద్రబాబు పేరుని మాత్రం తలవకుండా ముందుకు సాగితేనే మేలైన రాజకీయ జీవితాన్ని అందుకోగలరన్నది అందరి మాట.

Tags:    

Similar News