జగన్ భుజంపైన తుపాకీ

రాజకీయాలు పైకి కనిపించేంతగా లోపల ఉండవు. బయటకు తిడుతున్నాడని శత్రువు అనలేం. మౌనంగా ఉండాడని మిత్రుడు అని భావించలేం. ఎప్పటికి ఏది అవసరమో దానికి తగినట్లుగానే రాజకీయం [more]

Update: 2019-08-30 09:30 GMT

రాజకీయాలు పైకి కనిపించేంతగా లోపల ఉండవు. బయటకు తిడుతున్నాడని శత్రువు అనలేం. మౌనంగా ఉండాడని మిత్రుడు అని భావించలేం. ఎప్పటికి ఏది అవసరమో దానికి తగినట్లుగానే రాజకీయం కూడా నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద స్థాయిలో రాజకీయం పూర్తిగా అర్దమై కానట్లుగానే ఉంటుంది. పార్టీలు, వ్యక్తులు ఇవన్నీ సెకండరీ, రాజకీయమే మొదటి స్థానంలో ఉంటుంది ఎపుడూ.. విషయానికి వస్తే ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడ్డాక బీజేపీ మిత్ర స్థానం నుంచి శత్రువుగా మారిందని అనుకుంటున్నారు. అయితే ఇది ఏపీలోని కొంతమంది నాయకుల వరకే పరిమితం. కేంద్రంలోని బీజేపీతో జగన్ సంబంధాలు అలాగే ఉన్నాయి. జగన్ కి, మోడీ, షాలకు ఒకే ఒక్క విషయంలో ఉమ్మడి అజెండా ఉంది. అదే టీడీపీ, చంద్రబాబు నాయుడు. కేంద్రంలో ఆ ఇద్దరూ ఇప్పటికి కూడా చంద్రబాబు అంటే మండిపడుతున్నారు. అదే జగన్ ని వారికి దగ్గరగా చేస్తోంది.

వారే సారధులు….

ఇక బీజేపీ అనేది ఒక మహా సముద్రం. అందులో సుజనాచౌదరి లాంటి వారు ఉన్నా పెద్దగా ప్రభావితం చేసే స్థితిలో ఎపుడూ ఉండరు. కేంద్రంలో మంత్రులుగా, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న వారికి సైతం మోడీ షాల వ్యూహాలు తెలియవు. వారు ఒక డెసిషన్ తీసుకుని అమలు చేశాక కానీ మిగిలిన వారికి అదేంటో అర్ధం కాదు. అలా బీజేపీని ఆ ఇద్దరూ నడిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో నలుగురు ఎంపీలను పంపించి బీజేపీని మ్యానేజ్ చేస్తున్నానని టీడీపీ పొంగిపోతే అంతకంటే వెర్రితనం కూడా ఉండదు. బీజేపీలో నిన్న కాక మొన్న జాయిన్ అయిన ఈ ఎంపీలు ఏమీ చేయలేరన్నది కూడా వాస్తవం. ఇక జగన్ ముఖ్యమంత్రి. ఆయన అధికారంలో ఉన్నారు. పైగా బీజేపీకి అనధికార మిత్రుడు. కేంద్రంలో బీజేపీ కీలకమైన బిల్లులకు అవసరం పడినపుడల్లా జగన్ సాయం చేస్తూనే ఉన్నారు. తమకు ఇన్ని రాష్ట్రాల్లో అధికారం ఉందని చెప్పుకునే బీజేపీకి బీహార్లో నితీష్ ఎలాగో ఏపీలో జగన్ కూడా అలాగే. ఆ మాటకు వస్తే ఒడిషా సీఎం నవీన్ కూడా బీజేపీకి మిత్రుడే.

ఉమ్మడి శత్రువు బాబే ….

ఈ సమీకరణలు అర్ధమయ్యాక జగన్ ని సుజనా చౌదరీలు, మరొకరూ ఏదో చేస్తారని, చేయిస్తారని అనుకుంటే పొరపాటే. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు మాటలను బట్టి చూస్తే బీజేపీకి ఎవరు శత్రువులో అర్ధమైపోతారు. ఆయన బాబునే టార్గెట్ చేసి తిట్టిపోశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బాబుని మళ్ళీ పీఠం ఎక్కించేలా బీజేపీ రాజకీయ విధానాలు ఉండవన్నది కూడా అందరికీ తెలిసిందే. ఇక అమరావతి రాజధాని మార్పు కానీ, పోలవరం అవినీతి కానీ బయటకు తీయాలన్నదే మోడీ, షాల ప్రధాన ఉద్దేశ్యం. ఆ విధంగా బాబుని టార్గెట్ చేసి కార్నర్ చేయాలన్నది కూడా వారు ఎత్తుగడ. అయితే తమ చేతికి మట్టి అంటించుకోకుండా వారు జగన్ ద్వారా ఈ పనిని జరిపిస్తున్నారన్నది కొందరి బీజేపీ నేతల అభిప్రాయం. ఆ మాటలనే వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి అంటే బీజేపీలో కొత్త పూజారులకు కోపం వచ్చింది.

తెర వెనక కధ వేరే….

ముందే చెప్పుకున్నట్లుగా బీజేపీలో పైన ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తెలిసిన వారు ఇద్దరే ఇద్దరు. వారే మోడీ, షా. ఇక జగన్ సైతం కేంద్రం చెప్పినట్లుగా కొన్ని విషయాల్లో చేస్తున్నారని అంటారు. ఆయనకు ఏపీలో బాబు కనిపించకూడదు. అదే అజెండాతోనే ఇపుడు కధ సాగుతోంది. అందులో పోలవరాలు, అమరావతులు అవన్నీ కూడా అలా కళ్ళకు కనిపించే చిత్రాలు. అసలు కధ తెర వెనకాల సాగుతోంది. జనానికి, రాజకీయ పార్టీలకు కూడా బయటా కనిపించేది జగన్. ఆయన భుజాన తుపాకి పెట్టి పేల్చాలనుకునేది మాత్రం బీజేపీ. ఈ రాజకీయ క్రీడలో లాభమెవరికి. అంటే ఇపుడే సమాధానం చెప్పలేం.

Tags:    

Similar News