జగన్ తప్పు చేస్తున్నారా

రాజకీయ సలహాదారులు ఎవరో కానీ జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు హర్షించేవిలా లేవని అంటున్నారు. దానికి ఉదాహరణగా నవంబర్ 1 న ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరపాలని [more]

Update: 2019-10-25 12:30 GMT

రాజకీయ సలహాదారులు ఎవరో కానీ జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు హర్షించేవిలా లేవని అంటున్నారు. దానికి ఉదాహరణగా నవంబర్ 1 న ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరపాలని వైసీపీ సర్కార్ తీర్మానించడం పట్ల వివాదం రేగుతోంది. ఏపీ రాష్ట్ర చరిత్ర తెలుసుకోకుండా ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. నిజానికి మద్రాస్ స్టేట్ లో భాగంగా పదమూడు జిల్లాలుగా ఇపుడు ఉన్న ఏపీ భౌగోళిక స్వరూపం ఉండేది. ఆ సమయంలో నిజాం పాలనలో తెలంగాణా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఇక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి 1915లో అంకురార్పణ జరిగింది. మహాత్ముడు సైతం ఈ డిమాండ్ కు మద్దతుగా నిలిచాడని కూడా చెబుతారు. ఇలా కొన్ని దశాబ్దాలు గడచిన తరువాత స్వాతాంత్రానంతరం మరో ఆరేళ్లకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

ఆ త్యాగ స్పూర్తి ఏదీ…?

మదరాసీలుగా ఉన్న ఆంధ్రుల‌కు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అమర జీవి పొట్టి శ్రీరాములు చేసిన అలుపెరగని పొరాటంతో పాటు, ఆయన‌ అమరణ దీక్ష ఫలితంగా నాటి ప్రధాని నెహ్రూ ప్రక‌టించాల్సివచ్చింది. 1953 అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత మూడేళ్ళకు 1956 నవంబర్ 1 న తెలంగాణాను కలుపుకుని ఉమ్మడి అంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. నవంబర్ 1ని అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రజలు దాదాపుగా 58 ఏళ్ళ పాటు జరుపుకున్నారు ఎపుడైతే ఏపీ నుంచి తెలంగాణా విడిపోయిందో నవంబర్ 1 కి అర్ధం లేకుండా పోయిందని చరిత్రకారులు అంటున్నారు. ఇక 1956 కి ముందు నాటి ఆంధ్ర రాష్ట్రంగా నవ్యాంధ్ర ఉన్నందువల్ల అక్టోబర్ 1న ఆవిర్భావ దినం జరుపుకోవడం సమంజసం అన్నది భాషాభిమానులు, ఆంధ్ర ప్రముఖుల భావన. ఇక తెలంగాణా ఆవిర్భావ దినాన్ని జూన్ 2న జరుపుకుంటున్నారు. ఏపీ అక్టోబర్ 1న జరుపుకుంటేనే పొట్టి శ్రీరాములు త్యాగానికి అర్ధం పరమార్ధం ఉంటాయని అంటున్నారు.

పెళ్ళి రోజుట….

ఇక నవంబర్ 1 అన్నది ఏపీకి తెలంగాణాకు పెళ్ళి రోజు అని, జూన్ 2 విడాకుల రోజు అని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అంటున్నారు. ఎవరైనా పుట్టిన రోజు మానేసి పెళ్ళి రోజుని జన్మదినంగా జరుపుకుంటారా అని ఆయన తర్కాన్ని లేవదీస్తున్నారు. మరో వైపు అయిదేళ్ళ చంద్రబాబు జమానాలో అసలు ఆవిర్భావ దినం లేకుండా చేసి ఏకంగా బాబు తాను ప్రమాణం చేసిన జూన్ 8 వరకూ నవ నిర్మాణ దీక్షలు చేపట్టి అవమాన పరచారని గుర్తు చేస్తున్నారు. ఇపుడు జగన్ అక్టోబర్ 1 న కాకుండా నవంబర్ 1 ని ఏపీ ఫార్మేషన్ డే గా నిర్ణయించడం ద్వారా చరిత్రను అవమానించారని విమర్శిస్తున్నారు. అయితే దీని మీద‌ ఏపీ అధికారుల వివరణ చూస్తే వేరేగా ఉంది. కేంద్రాన్ని టీడీపీ సర్కార్ ఫార్మేషన్ డే ఏది జరుపుకోవాలో కోరినపుడు నవంబర్ 1 ని సూచించారని, దాని ప్రకారమే జగన్ సర్కార్ ఆమోదించి వేడుకలు జరిపేందుకు నిర్ణయించిందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా రాష్ట్రం గొప్పతనం చెప్పుకోవడానికి ఒక రోజు అంటూ ఉండడం ముఖ్యమని, అందరికీ తెలిసిన నవంబర్ 1 ని కొనసాగించడంలో తప్పు లేదని వైసీపీ నేతలు అంటున్నారు.

Tags:    

Similar News