ఆ ముద్ర చెరిగిపోతుందా?

జగన్ అంటే ఇపుడు అందరికీ తెలుసు కానీ పదేళ్ళ క్రితం మాత్రం సన్ ఆఫ్ వైఎస్సార్ అని మాత్రమే రిఫరెన్స్ ఉండేది. జగన్ తొలిసారిగా జనం ముందుకు [more]

Update: 2020-02-16 15:30 GMT

జగన్ అంటే ఇపుడు అందరికీ తెలుసు కానీ పదేళ్ళ క్రితం మాత్రం సన్ ఆఫ్ వైఎస్సార్ అని మాత్రమే రిఫరెన్స్ ఉండేది. జగన్ తొలిసారిగా జనం ముందుకు వచ్చింది 2008లో సాక్షి మీడియా హౌస్ ప్రారంభ సమయంలో మాత్రమే. అప్పటికి కూడా ఆయన ఔత్సాహిక పారిశ్రామికవేత్తగానే అంతా చూశారు, పత్రికలూ అదే రాశాయి. ఇక 2009 ఎన్నికల్లో ఆయన కడప ఎంపీ అయ్యారు. అప్పటికి ఉమ్మడి ఏపీలో ఉన్న 42 మంది ఎంపీల్లో అయన ఒకరుగానే ఉన్నారు. పైగా మధ్యాహ్న మార్తాండుడుగా వెలిగిపోతున్న వైఎస్సార్ ముందు మరో నేత పేరు కూడా కనిపించిన, వినిపించని రోజులవి. అయితే వైఎస్సార్ హఠాన్మరణం తరువాతనే జగన్ తొలిసారి మీడియా కళ్ళకు చిక్కారు. ఇక నల్ల కాలువ వద్ద ఆయన తొలి స్పీచ్ తో తండ్రి పోలికలను జనం వెతుక్కున్నారు. ఆ తరువాత ఆయనలోనే వైఎస్సార్ ని చూసుకున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జగన్ రాజకీయ ఎదుగుదల వెనక నీడలా ఇప్పటికీ వైఎస్సార్ బలంగా ఉన్నారన్నది అక్షర సత్యం.

తెగిపోయిందా…?

ఇదిలా ఉండగా పీసీసీ కొత్త అధ్యక్షుడు సాకె శైలజానాధ్ తాజాగాఒక కామెంట్ చేశారు. వైఎస్సార్ ఎంతో ఇష్టపడి తెచ్చిన శాసనమండలిని రద్దు చేసిన కొడుకు జగన్ అంటూ ఘాటుగానే విమర్శించారు. అంతటితో ఆగకుండా ఈ రద్దు నిర్ణయంతో వైఎస్సార్ తో జగన్ బంధం కూడా అన్ని విధాలుగా తెగిపోయిందని అన్నారు. వైఎస్సార్ అడుగు జాడలలో నడుస్తానని చెప్పిన జగన్ దానికి విరుధ్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అంటున్నారు. వైఎస్సార్ అన్ని వర్గాలకూ దేవుడని, జగన్ మాత్రం బీజేపీ గుప్పిట్లో బంధీ అని శైలజానాధ్ బాణాలు సంధిస్తున్నారు. మతాలను విడదీసి చూసే బీజేపీతో చెలిమి చేస్తున్న జగన్ జేబులో నరేంద్ర మోడీ బొమ్మ మాత్రమే ఉందని సెటైర్లు వేశారు. ఇక రేపో మాపో జగన్ తన తండ్రి వైఎస్సార్ బొమ్మ కూడా పార్టీ జెండా నుంచి తొలగిస్తారని కూడా కామెంట్స్ చేసారు.

వైఎస్సార్ గ్రేట్…..

ఈ మాట చిత్రంగా టీడీపీ నేతలు అనడం విశేషం. రాష్ట్ర రాజకీయాలపైన అవగాహన ఉన్న వారికి 2004 నుంచి 2009 వరకూ సాగిన ఉమ్మడి ఏపీ పాలిటిక్స్ బాగా గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్, చంద్రబాబు ఉప్పూ నిప్పులా ఉండేవారు. తమ్ముళ్ళు సైతం వైఎస్సార్ పొడ గిట్టనట్లుగా ఉంటూ ప్రతీ దానికీ నానా యాగీ చేసేవారు. అటువంటిది ఇపుడు జగన్ పుణ్యమాని టీడీపీకి వైఎస్సార్ దేవుడిగా కనిపిస్తున్నారులా ఉంది. సాక్షాత్తూ చంద్రబాబు అయితే వైఎస్సార్ ని మెచ్చుకుంటున్నారు. ఆయన ప్రజాస్వామ్యయుతంగా పాలన చేసేవారని, ప్రతిపక్షాలు చెప్పే సలహా, సూచనలు తీసుకునేవారని, కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. జగన్ మీద ద్వేషంతో బాబు, టీడీపీ ఇలా వైఎస్సార్ తరఫున వకల్తా పుచ్చుకుంటున్నారని అంటున్నారు. అంతే కాదు, వైఎస్సార్ పెట్టిన శాసనమండలి రద్దు చేస్తూ తండ్రి ఆశయాలను జగన్ దెబ్బతీశారని కూడా తమ్ముళ్ళు అంటున్నారు.

వేరుగా చూస్తే….?

నిజానికి జగన్ పార్టీ సిధ్ధాంతం ఏంటి అని ఠక్కున అడిగితే ఎవరికైనా తోచేది ఒకటే. ఆయన తండ్రి వైఎస్సార్ ఆశయాల కోసమే పార్టీ పెట్టారు. తండ్రి విధానాలే జగన్ పార్టీ లక్ష్యాలు అంటారు. అంటే జగన్ రాజకీయానికి, పార్టీ పుట్టుకకూ ఆత్మలా వైఎస్సార్ ఉన్నారన్నది వాస్తవం. ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్ కి బదిలీ కావడం వెనక కూడా వైఎస్సార్ ఉన్నారు. కొత్త పార్టీ పెట్టిన వారికి తొలి ఎన్నికల్లోనే 45 శాతం దాకా ఓట్ల వాటా రావడం అంటే అది వైఎస్సార్ గొప్పతనమే. వైఎస్సార్ ని మైనస్ చేస్తే జగన్ పార్టీకి ఇబ్బందే కాదు, ఆత్మాహత్యా సదృశ్యమే.

జనాలకు కూడా….

మరి ఓ వైపు టీడీపీ, మరో వైపు కాంగ్రెస్ కూడా వైఎస్సార్ని పొగుడుతూ జగన్ ని తిడుతున్నారు. వైఎస్సార్ ఆశయాలు జగన్ చంపేస్తున్నారని అంటున్నారు. జగన్ వైఎస్సార్ పేరు ఎత్తడానికి లేదని అంటున్నారు. మరి జగన్ తీసుకున్న శాసనమండలి రద్దు నిర్ణయం జనాలకు కూడా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇలాగే మరింత దూకుడుగా జగన్ వెళ్తే భవిష్యత్తులో వైఎస్సార్ నీడ నుంచి బయటపడితే వైసీపీకి కష్టాలు మొదలవుతాయని కూడా అంటున్నారు. ఇప్పటికే తండ్రీ కొడుకుల పొలిటికల్ బంధాన్ని దెబ్బతీసేందుకు విపక్షాలు రెడీగా ఉన్నాయి. చూడాలి వైఎస్సార్ జగన్ రాజకీయ బంధం ముందు ముందు ఎలా కొనసాగుతుందో. అది జగన్ చర్యల బట్టి ఆధారపడుతుందన్నది వాస్తవం.

Tags:    

Similar News