ఇలా చేస్తున్నారేందబ్బా

ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని అమరావతిపై మౌనం వీడకపోవడానికి కారణమేంటి? మరికొద్దిరోజులు ఇలాగే ప్రచారాన్ని కంటిన్యూ చేయాలన్న యోచనలో వైఎస్ జగన్ ఉన్నారా? లేక [more]

Update: 2019-08-31 12:30 GMT

ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని అమరావతిపై మౌనం వీడకపోవడానికి కారణమేంటి? మరికొద్దిరోజులు ఇలాగే ప్రచారాన్ని కంటిన్యూ చేయాలన్న యోచనలో వైఎస్ జగన్ ఉన్నారా? లేక ఫుల్ స్టాప్ పెడితే టీడీపీకి ప్రయోజనం ఉందని భావిస్తున్నారా? అన్నది ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ చర్చనీయాంశమైంది. రాజధాని అమరావతి అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ‌్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రైతులను కలసి భరోసా ఇస్తున్నారు.

ఆందోళనకు దిగుతున్నా….

మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా అమరావతిపై ఆందోళనలను ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతోంది. రాజధానిపై చంద్రబాబు రోజూ మీడియా ముందుకు వచ్చి జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం రాజధాని విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. వైఎస్ జగన్ అమెరికా వెళ్లిన తర్వాతే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై ప్రకటన చేసి అలజడి రేపారు. అయితే అమెరికా నుంచి వచ్చిన తర్వాతనైనా జగన్ దీనిపై క్లారిటీ ఇస్తారని అందరూ భావించారు.

ఎటువంటి ప్రకటన రాక….

తాజాగా సీఆర్డీఏ సమీక్ష నిర్వహించిన వైఎస్ జగన్ అమరావతి గురించి ఆ ప్రాంత రైతులకు భరోసా ఇస్తారని అనుకున్నారు. రైతులకు కౌలు చెల్లిస్తామని మాత్రం ప్రకటించారు. అంతే తప్ప రాజధాని పనులను కొనసాగిస్తామని, రీటెండర్లకు పిలుస్తామని ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో పాటు రాజధాని ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం 130 కోట్ల తో నిర్మించనున్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి కూడా ఖర్చును 30 కోట్లకు తగ్గించడం చర్చనీయాంశమైంది.

కొంతకాలం ఇలాగే…..

అయితే వైసీపీనేతలు మాత్రం రాజధానిని ఎందుకు మారుస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తమ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రాజధానికి దగ్గరలోనే సొంత ఇంటిని నిర్మించుకున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రాజధాని అమరావతి నుంచి ఎట్టిపరిస్థితుల్లో మార్చరని, అయితే కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశముందంటున్నారు. పొదుపు చర్యల్లో భాగంగానే రాజధానిలో నిర్మాణాల ఖర్చును కూడా తగ్గిస్తారని చెబుతున్నారు. కానీ జగన్ నోటి నుంచి మాత్రం రాజధానిపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఈ ఆందోళన మరికొంత కాలం కొనసాగే అవకాశముంది.

Tags:    

Similar News