భయపడినట్లుందిగా

విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలు మళ్ళీ వాయిదా పడ్డాయి. జగన్ పాలనలోనైనా తొందరగా ఎన్నికలు జరుగుతాయని భావించిన వారికి అవి మరింత దూరం అవుతున్నాయి. నిజానికి [more]

Update: 2019-10-08 02:00 GMT

విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలు మళ్ళీ వాయిదా పడ్డాయి. జగన్ పాలనలోనైనా తొందరగా ఎన్నికలు జరుగుతాయని భావించిన వారికి అవి మరింత దూరం అవుతున్నాయి. నిజానికి ఈ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగాలి. అయితే వార్డుల విభజన, రిజిర్వేషన్లు అంటూ చాలా కధ నడుస్తోంది. దానికి తోడు కోర్టు గొడవలు కూడా ఉండడంతో ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం విలీన ప్రాంతాలతో సంబంధం లేకుండా ఓ జాబితా రూపొందించి వార్డుల సంఖ్యను 81 వరకూ పెంచారు. ఇక విలీన పంచాయతీలను జీవీఎంసీలో విలీన చేసేలా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు కూడా. ఇలా అన్నీ చేశాక ప్రభుత్వం నుంచి మళ్ళీ వాయిదా వాదన వచ్చినట్లుగా తెలుస్తోంది.

99 వార్డులుగానట…

నిజానికి జీవీఎంసీ వార్డులు 72 ఉన్నాయి. వాటిని అధికారులు 81 వరకూ పెంచారు. ఇపుడు వాటిని 99 వార్డులుగా చేయాలని జగన్ సర్కార్ ఆలోచిస్తోందట. వార్డులు ఎంత ఎక్కువైతే అంతగా తమ పార్టీ వారికి అవకాశాలు వాస్తాయన్న కారణం ఒకటైతే. పెద్ద వార్డులు, టీడీపీకి అనుకూలంగా ఉన్న వాటిని తెగ్గొట్టడం ద్వారా అక్కడ జగన్ పార్టీకి అనుకూల పవనాలు వీచేలా చూడాలన్నది మరో ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఇలా చేసినట్లైతేనే టీడీపీ ధాటిని తట్టుకోవచ్చునని వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో అధికారులు ఇచ్చిన నివేదికను జగన్ సర్కార్ పక్కన పెట్టేసి మళ్ళీ వార్డులను పెంచమన్నట్లుగా భోగట్టా.

ఆరు నెలలు ఖాయమట…

ఇపుడున్న వార్డులను దాదాపుగా వంద వరకూ పెంచాలన్నది జగన్ ఉద్దేశ్యం. అయితే ఇది నెరవేరాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని జీవీఎంసీ అధికారులు అంటున్నారు. మళ్ళీ వార్డుల విభజన, తరువాత రిజర్వేషన్ల ప్రక్రియ, ఆ మీదట వాటిని ఓ కొలిక్కి తీసుకురావడానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు డీలా పడుతున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది. మెల్లగా సర్కార్ పాతబడిపోతోంది. ఈ టైంలోనే ఈ వేడిలోనే ఎన్నికలు జరిపించుకుంటే మేయర్ పీఠం తమకే దక్కుతుందని, ఎక్కువమంది వార్డు కార్పొరేటర్లు కూడా వస్తారని అంటున్నారు. అదే లేట్ చేసిన కొద్దీ విపక్షం పుంజుకుని గట్టి పోటీ ఇస్తుందని కూడా భయపడుతున్నారు. అదే జరిగితే ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపు అవకాశాలు బాగా తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం వార్డుల విభజన దగ్గరే ఆగిపోయారు. ఇలా ఆగడానికి కారణం విశాఖ నగరంలో వైసీపీ కంటే టీడీపీకి బలం బాగా ఉన్నట్లు తేలడమేనని అంటున్నారు.

Tags:    

Similar News