ఆయన జగన్ కు ఎంత చెబితే అంత

విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన శ్రీ స్వరూపానందేంద్ర స్వామిజీ ఇపుడు రాజకీయ నాయకులకు పెద్ద దేవుడు అయిపోయారు. వైసీపీ నేతలైతే తరచూ ఆయన్ని కలుసుకుంటున్నారు. ఇక వేరే [more]

Update: 2019-09-28 06:30 GMT

విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన శ్రీ స్వరూపానందేంద్ర స్వామిజీ ఇపుడు రాజకీయ నాయకులకు పెద్ద దేవుడు అయిపోయారు. వైసీపీ నేతలైతే తరచూ ఆయన్ని కలుసుకుంటున్నారు. ఇక వేరే పార్టీలకు చెందిన నేతలు పార్టీ మారాలనుకుంటున్న వారు సైతం స్వరూపానందేంద్ర స్వామిజీ ఆశ్రమానికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం విశేషం. ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితులు స్వరూపానందేంద్ర స్వామిజీ అన్న ముద్ర ఉండడంతో తమ గురించి నాలుగు మంచి మాటలు చెబుతారన్న ఉద్దేశ్యంతోనే స్వామి ఆశ్రమానికి రాజకీయ జీవులు క్యూ కడుతున్నారంటున్నారు. ఈ మధ్య కాలమంతా స్వామిజీ ఉత్తరభారత దేశ యాత్రలకు వెళ్ళారు. ఆయన మళ్ళీ ఆశ్రమానికి రావడంతో రాజకీయ భక్తులతో పరిస‌రాలు కిటకిటలాడుతున్నాయి.

మంత్రి మొక్కులు….

ఇదిలా ఉండగా విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ స్వరూపానందేంద్ర స్వామిజీ ఇలా రావడం ఆలస్యం అలా వెళ్ళి వాలిపోయారు. స్వామీజీతో చాల సేపు మంత్రి మంతనాలు జరపడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. మంత్రిగా అవంతి పనితీరు విషయం కూడా స్వరూపానందేంద్ర స్వామిజీకి వివరించారని అంటున్నారు. అదే విధంగా జిల్లా రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు కూడా స్వామిజీతో మంత్రి పంచుకున్నారని మాట కూడా ప్రచారమైంది. ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తారన్న వార్తల నేపధ్యంలో ఈ భేటీ జరగడం విశేషం. అదే విధంగా మరో వైపు మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ కూడా స్వరూపానందేంద్ర స్వామిజీని దర్శించుకుని చర్చలు జరిపారు.

టీడీపీ నేత సైతం….

ఇక వైసీపీలోకి మారుతారని ప్రచారంలో ఉన్న విశాఖ రూరల్ జిల్లా టీడీపీ ఇంచార్జి పంచకర్ల రమేష్ బాబు సైతం స్వరూపానందేంద్ర స్వామిజీ ఆశీర్వాదం కోసం ఆశ్రమానికి రావడం విశేష పరిణామంగా చెప్పుకోవాలి. పంచకర్ల అక్టోబర్ 5న వైసీపీలో చేరుతారని అంటున్నారు. ఆయన ఈ క్రమంలో స్వరూపానందేంద్ర స్వామిజీని కలసి ఆయన ఆశీర్వాదాలు పొందారు. ఇక కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం స్వరూపానందేంద్ర స్వామిజీ దర్శనానికి రావడం గమనార్హం. ఇదిలా ఉండగా తన దగ్గరకు ఎవరు వచ్చినా వారు ఏ పార్టీ అన్నది చూడనని, కేవలం భక్తులుగానే వారిని చూస్తానని స్వామీజీ ఇప్పటికే చెబుతూ వచ్చారు. పైగా రాజకీయాల గురించి ఏ మాత్రం చర్చకు అవకాశం లేదని కూడా స్వరూపానందేంద్ర స్వామిజీ అంటున్నారు. అయితే స్వామి ఎంత చెప్పినా అధికార పార్టీ నేతలు నిత్యం అక్కడ క్యూ కట్టడం బట్టి చూస్తూంటే స్వామీజీ ప్రభావం మామూలుగా లేదని అంటున్నారు.

Tags:    

Similar News