ఏకాంత చర్చలు అందుకేనా?

ఆపదలో ఉన్నపుడే అందరూ గుర్తుకువస్తారు. ముందే చెప్పుకున్నట్లు వరస పరాజయాలతో బీజేపీ ఇపుడు బాగా కుంగిపోయింది. తొమ్మిది నెలల క్రితం 303 సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన [more]

Update: 2020-02-13 03:30 GMT

ఆపదలో ఉన్నపుడే అందరూ గుర్తుకువస్తారు. ముందే చెప్పుకున్నట్లు వరస పరాజయాలతో బీజేపీ ఇపుడు బాగా కుంగిపోయింది. తొమ్మిది నెలల క్రితం 303 సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి జోష్ ఇపుడు మచ్చుకైనా లేదు. అదే సమయంలో అన్ని రాష్ట్రాలు, వాటితో పాటే అధికారాలు బీజేపీకి పోతున్నాయి, మిత్రులూ కూడా జారిపోతున్నారు. దీంతో మోడీకి ఇపుడు అర్జంట్ గా జగన్ గుర్తుకువచ్చారు. జగన్ మీద ఉక్కుపాదం మోపాలనుకున్న వారే పిలిచి పెద్ద పీట వేస్తున్నారు. అటు ఆప్ ఢిల్లీలో బంపర్ విక్టరీ కొట్టడం, ఇటు జగన్ కి హస్తిన పెద్దల పిలుపు రావడం రెండూ ఒకేసారి జరిగాయి. ఇది కాకతాళీయం కాదు, దీని వెనక ఏదో పెద్ద రాజకీయమే ఉందని అంటున్నారు.

ఏకాంత చర్చలు…

జగన్ కి ప్రధాని మోడీ దాదాపుగా మంచి మర్యాదే చేశారు. గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో ముందు రాష్ట్ర సమస్యలు చర్చించారు. అందులో వైసీపీ ఎంపీలు పాలుపంచుకున్నారు. ఆ తరువాత మోడీ, జగన్ ఏకాంత చర్చలు జరిపారు. ఇది యాభై నిముషాల పైగా సాగింది. ఇది ఫక్తు రాజకీయ చర్చగా సాగిందని అంటున్నారు. జగన్ ని అక్కున చేర్చుకోవడం ఇపుడు బీజేపీకి అత్యవసరం అనిపించేలా ఈ భేటీ ఉందని చెబుతున్నారు. ఇక జగన్ ని బాగా దువ్వే పనిలో భాగమే ఈ మీటింగు అంటున్నారు. ఈ ఏకాంత చర్చలు అటు ఏపీనే కాదు, ఇటు జాతీయ రాజకీయాలను ప్రభావం చేస్తాయని చెబుతున్నారు.

ఇక కేంద్రంలోకి ….

ఇక కేంద్ర మంత్రివర్గంలోకి తొందరలోనే వైసీపీ చేరుతుందని అంటున్నారు. బీజేపే ఈ విధంగా జగన్ కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. కనీసంగా ఇద్దరు, గరిష్టంగా ముగ్గురు వైసీపీ ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు ఖాయమని అంటున్నారు. జగన్ కి లోక్ సభలో ఉన్న బలంతో పాటు, రాజసభలో త్వరలో పెరగబోయే ఆరుగురు సభ్యుల బలం బీజేపీకి కావాలి. ఇక ఏపీలో చూసుకుంటే జగన్ దాదాపుగా ఒంటరి పోరుగా రాజకీయం చేస్తున్నారు. ఆయనకు ఇక్కడ అన్ని పార్టీలూ వ్యతిరేకంగా ఉన్నాయి. దాంతో ఏ నిర్ణయం తీసుకున్నా నానా యాగీ చేస్తున్నారు. అంతే కాదు ఏపీ ఆర్ధికంగా ఇబ్బందులో ఉంది. దాంతో కేంద్ర సాయం కూడా అవసరం. అదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబుని బీజేపీకి దూరంగా ఉంచడం ఇంకా ముఖ్యం. దీంతో జగన్ సైతం కేంద్రంలో చేరడానికి, అవసరమైన నిధులు తెచ్చుకోవడానికి సై అంటున్నారని తెలుస్తోంది.

వేరు చేయడ‌మే….

ఇలా పరస్పర అవసరాలు బీజేపీ, వైసీపీని కలిపేందుకు వేదిక అవుతున్నాయని అంటున్నారు. అదే సమయంలో దేశంలో ప్రాంతీయ‌ పార్టీలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణాలో కేసీఆర్ తొందరలోనే తన ఫెడరల్ ఫ్రంట్ ని బయటకు తీయబోతున్నారు. ఆయనకు జగన్ కంటే పెద్ద మిత్రుడు లేడు. దాంతో జగన్ ని కూడగట్టుకుని గట్టిగా బలముందని చెబితే మిగిలిన పార్టీలను దగ్గరకు తీయవచ్చు. దాన్ని ఆదిలోనే దెబ్బతీయాలంటే జగన్ ని తమ వైపు తిప్పుకోవాలన్నది బీజేపీ రాజకీయ ఎత్తుగడగా ఉంది. మొత్తం మీద చూసుకున్నపుడు జగన్ కి బాబు శత్రువు, బీజేపీకి కేసీఆర్ శత్రువు. ఇలా తెలుగు రాజకీయాల్లో జగన్ ని చేరదీయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు. అన్నీ అనుకునట్లుగా సాగితే బడ్జెట్ సెషన్ తరువాత జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో వైసీపీ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News