సీమకు సీన్ మార్చారే

మాంత్రికుడి బలం ఎక్కడ ఉందో తెలుసుకుంటే కధ కంచికి చేరినట్లే. రాజకీయాల్లో కూడా ప్రత్యర్ధి బలం, బలహీనతలు ఏంటో గుర్తించడంలోనే సగం విజయం సాధించినట్లుగా చెబుతారు. ఇపుడు [more]

Update: 2019-12-02 05:00 GMT

మాంత్రికుడి బలం ఎక్కడ ఉందో తెలుసుకుంటే కధ కంచికి చేరినట్లే. రాజకీయాల్లో కూడా ప్రత్యర్ధి బలం, బలహీనతలు ఏంటో గుర్తించడంలోనే సగం విజయం సాధించినట్లుగా చెబుతారు. ఇపుడు అదే పనిలో తెలుగుదేశం పార్టీ, జనసేన బిజీగా ఉన్నాయి. జగన్ రాయలసీమకు చెందిన నాయకుడు అంటూ కోస్తా నడిబొడ్డు విజయవాడలో నిలబడి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే విమర్శలు దట్టించారు. జగన్ రాజధానిని పులివెందులలో పెట్టుకుని, హైకోర్టును కర్నూలులో పెట్టుకుంటే బాగుంటుందని ఎకసెక్కం ఆడింది కూడా ఇదే పవన్. అంటే జగన్ రాయలసీమ మనిషి, ఆయన కోస్తాపై వివక్ష చూపిస్తాడన్న కలరింగ్ ఇచ్చేలా పవన్ ఈ కామెంట్స్ చేశారు. తరచూ రాయలసీమ ముఖ్యమంత్రి అని గుర్తు చేయడం వెనక కూడా విషయం అదే. ఇక ఇపుడు హఠాత్తుగా పవన్ రాయలసీమ టూర్ పెట్టుకున్నారు. ఆరు రోజుల పాటు ఆయన సీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. రాయలసీమలో రాజకీయం అంటే జగన్ తో నేరుగా తలపడడమే.

కడప గడపలో బాబు….

గాలి మళ్ళింది జగన్ పైన అని చంద్రబాబు ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో మూడు రోజుల టూర్ పూర్తి చేశారు. కడప నుంచే జగన్ పాలనను ఆయన ఎండగట్టారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను, జగన్ ఒక లెక్కా అంటూ బాబు గర్జన చేశారు. తాజా ఎన్నికల్లో కడపలో ఒక్క సీటూ టీడీపీకి దక్కలేదు. ఆ మాటకు వస్తే కర్నూలులో కూడా బోణీ కొట్టలేదు. అనంతపురం జిల్లాలో రెండు సీట్లు, చిత్తూరులో చంద్రబాబు ఒక్కరు మాత్రమే గెలిచారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ సీట్లు, ఆరు ఎంపీ సీట్లు ఉంటే కేవలం మూడు ఎమ్మెల్యే సీట్లు తప్ప మొత్తానికి మొత్తం వైసీపీ ఊడ్చేసింది. ఈ నేపధ్యంలో జగన్ ని ఎదుర్కోవడానికి కడప నుంచే బాబు శ్రీకారం చుట్టారు. ఆయన పర్యటనకు నాయకులు దూరంగా ఉన్నా క్యాడర్లో మాత్రం కొంత భరోసా నింపగలిగారు. ఇక బాబు మరిన్ని టూర్లకు కూడా రంగం సిధ్ధం చేసుకుంటున్నారు.

జగనే టార్గెట్…

ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా సీమలో తన తొలిపాదం జగన్ సొంత జిల్లా కడపలోనే మోపనున్నారు. రాయలసీమ రాజకీయం, ఫ్రాక్షనిజం అంటూ జగన్ని అనేక మాటలు అన్న పవన్ ఇపుడు సీమ టూర్లో ఏ రకమైన పంచులు పేలుస్తారో చూడాలి. ఇవన్నీ ఇలా ఉంచితే సీమలో జనసేనకు తాజా ఎన్నికల్లో డిపాజిట్లు చాలా చోట్ల దక్కలేదు. ఆయనకు సరైన అభ్యర్ధులు కూడా దొరకలేదు. ఓ విధంగా చూస్తే జనసేన ఉనికి ఇక్కడ పెద్ద ప్రశ్నగా ఉంది. అయినా సరే పవన్ సామాజిక వర్గం బలిజలు ఎక్కువ సంఖ్యలో సీమ జిల్లాల్లో ఉన్నారు. ప్రజారాజ్యం సమయంలో బలిజలు ఆ పార్టీ వైపు మొగ్గారు, కొన్ని సీట్లు కూడా దక్కాయి. జనసేన ఏర్పాటు చేసినా కూడా వారు పెద్దగా తొంగి చూడలేదు. గత అనుభవాల వల్ల వారు అలా ఉంటున్నారనుకోవాలి. ఇక ఓడిపోయాక కూడా పార్టీని గట్టిగా నిర్మిస్తానని పవన్ చేస్తున్న ఈ టూర్ల వల్ల వారిలో కొంత మార్పు వస్తుందని అనుకుంటున్నారు. అదే సమయంలో పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఉన్నారు. అలాగే యువత కూడా అయన అంటే ఇష్టపడతారు. దాంతో పవన్ కి ఘనస్వాగతాలకు ఏ లోటు లేదు, ఇక పవన్ సమీక్షలు ఎలా సాగుతాయో, ఎవరెవరు ఆయన్ని కలుస్తారో ఆయన ప్రసంగాల బట్టి వ్యూహం ఏంటన్నది తెలుస్తొంది. మొత్తానికి జగన్ ఇలాకాలోనే సవాల్ చేసేందుకు రెండు పార్టీలు గట్టిగానే రెడీ అయిపోతున్నాయి.

Tags:    

Similar News