మాటకు బాట వేస్తున్నారు

వైఎస్ జగన్ పాదయాత్రలోనూ, ప్రమాణ స్వీకారం సమయంలోనూ ఇచ్చిన మాటను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని వైఎస్ [more]

Update: 2019-09-13 09:30 GMT

వైఎస్ జగన్ పాదయాత్రలోనూ, ప్రమాణ స్వీకారం సమయంలోనూ ఇచ్చిన మాటను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని వైఎస్ జగన్ చెప్పడంతో ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పారదర్శక పాలన, బడుగులకు న్యాయం, సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అవినీతికి ఆస్కారం లేని పాలన అందిస్తామన్న జగన్ సర్కార్ ఆ దిశగానే నడకను ప్రారంభించింది.

టెండర్లలో అవినీతిని….

వేల కోట్ల రూపాయల విలువైన పనుల్లో అవినీతి జరగడం సర్వసాధారణం. బయటకు కన్పించకపోయినా కమీషన్ల రూపంలో పాలకుల చేతుల్లోకి వెళుతుంటాయి. దీనిని కట్టడి చేసేందుకు జగన్ ప్రమాణస్వీకారం రోజునే వంద కోట్లు దాటిన ప్రతి టెండరును జ్యుడిషియల్ కమిషన్ కు అప్పగిస్తామని చెప్పారు. దీనిపై ఇటీవల శాసనసభలో చట్టం కూడా చేశారు. వందకోట్లు దాటిన ప్రతి టెండరును ఇక న్యాయపరిశీలనకు పంపాల్సి ఉంటుంది. వారి నుంచి వచ్చే సూచనల మేరకే టెండర్ ఖరారుపై నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది.

జ్యుడిషియల్ కమిషన్ తో…..

అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ టెండరులో పాల్గొనేలా అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ జస్టిస్ శివశంకరరావును రాష్ట్ర ప్భుత్వం నియమించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకే ఈయనను పదవిలో నియమించింది. జస్టిస్ శివశంకరరవావు పదవీకాలం మూడేళ్ల పాటు ఉంటుంది. శివశంకరరావు నియామకం పూర్తి కావడంతో ఇకపై ఆంధ్రప్రదేశ్ లో జరిగే వంద కోట్లు, ఆపైదాటిన ప్రతి టెండరును జ్యుడిషియల్ కమిషన్ పరిశీలించనుంది. పనుల్లో పారదర్శకతకు అవకాశమిచ్చేలా జగన్ ప్రభుత్వం తొలి అడుగు వేసిందనే చెప్పాలి.

బీసీ కమిషన్ ఏర్పాటుతో…..

ఇక మరో కీలకమైన విషయంలోనూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. బీసీ కమిషన్ ఛైర్మన్ గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణను నియమించనుంది. ఇప్పటికే తాత్కాలిక చీఫ్ జస్టిస్ సూచనల మేరకు ఈయన పేరు ఖరారయింది. ఎన్నికల సమయంలో జగన్ తాను బీసీ కమిషన్ ను ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. క్యాస్ట్ సర్టిఫికేట్ల దగ్గర నుంచి వెనుకబడిన వర్గాల్లో అత్యంత పేదలను గుర్తించడం, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు తదితర అంశాలను ఈ కమిషన్ పరిశీలించనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి బీసీలు అండగా నిలబడటంతో జగన్ సత్వరమే బీసీ కమిషన్ ను ఏర్పాటు చేశారు. మొత్తం మీద జగన్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అనతికాలంలోనే నిర్ణయాలను తీసుకుంటున్నారు.

Tags:    

Similar News