జగన్ ను ఏకాకి…?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరునే నమ్ముకున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా మూడు పార్టీలు [more]

Update: 2019-03-27 02:30 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరునే నమ్ముకున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేయగా ఈసారి కూడా జగన్ ఓటమే ధ్యేయంగా ప్రత్యర్థి పార్టీలు పనిచేస్తున్నాయి. జగన్ విజయావకాశాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. జగన్ కు బీజేపీ, కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. అయితే, వారు జగన్ కు ఎక్కడా బాహాటంగా మద్దతు ఇవ్వలేదు. బీజేపీ అన్ని స్థానాలకూ అభ్యర్థులను పోటీలో నిలిపింది. ఇక, కేసీఆర్ మద్దతు ఉన్నా లేకున్నా ఏపీలో జగన్ కలిగే ప్రత్యేక మేలు ఏమీ ఉండదు. ఇదే సమయంలో వీరిద్దరితో జగన్ లాలూచీ పడ్డారని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో లాభపడాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు.

పొత్తు లేకున్నా ఇద్దరిదీ ఒకే మాట

నరేంద్ర మోడీ, కేసీఆర్ తో జగన్ లాలూచీ పడ్డారని తెలుగుదేశం పార్టీ చాలారోజులుగా ఆరోపిస్తూ వస్తోంది. వీరిద్దరూ ఏపీకి ద్రోహం చేశారని, వారితో జగన్ కుమ్మక్కయ్యి రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రధాన ప్రచారాస్త్రమే ఈ అంశంగా తెలుగుదేశం పార్టీ మలుచుకుంది. అయితే, ఒక్కసారిగా చంద్రబాబు ఆరోపణలనే పవన్ కళ్యాణ్ తన నోటి వెంట పకలడం ప్రారంభించారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలే ఆయన కూడా జగన్ పై చేస్తున్నారు. ఇలా రెండు ప్రధాన పార్టీలూ జగన్ టార్గెట్ గానే పనిచేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తున్నా ఆయన అధికార తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయకుండా ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేస్తుండటంతో టీడీపీ, జనసేన ఒకటే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, జనసేన అభ్యర్థుల ఎంపిక కూడా వైసీపీ ఓటమే టార్గెట్ గా జరిగిందని, బీఎస్పీతో పొత్తు ద్వారా వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న దళిత ఓట్లను చీల్చేందుకు పవన్ కుట్ర చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.

ఓట్లు చీల్చడమే లక్ష్యంగా…

ఇక, ఇదే స్ట్రాటజీని కే.ఏ.పాల్ కూడా అవలంబిస్తున్నారు. ఆయన పార్టీ జెండా రంగులు, ఎన్నికల గుర్తు అచ్చం వైసీపీని పోలి ఉన్నాయి. ఆయన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎనిమిది మంది పేర్లు వైసీపీ అభ్యర్థుల పేర్లే ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్న టీడీపీ కార్యకర్తలతో కేఏ పాల్ పార్టీ తరపున నామినేషన్లు వేయించారు. ప్రధానంగా ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ఈ వ్యూహం పన్నారు. ఒకటి రెండు చోట్ల అభ్యర్థుల పేర్లు ఒక్కటే కావడం యాధృచ్ఛికంగా జరుగుతుంటాయి కానీ ఎనిమిది చోట్ల ఒకే పేర్లు ఉండటం కచ్చితంగా కుట్రే అని వైసీపీ ఆరోపిస్తోంది. క్రైస్తవుల ఓటు బ్యాంకును చీల్చడంతో పాటు ఫ్యాను గుర్తును కేఏ పాల్ హెలీకాఫ్టర్ గుర్తు పోలి ఉండటంతో వెనుక వైసీపీ ఓట్లను చీల్చే కుట్ర ఉందంటున్నారు. ఇటీవ హెలీకాఫ్టర్ గుర్తుపై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా తప్పుపట్టిన విషయాన్ని వైసీపీ గుర్తు చేస్తోంది.

జాతీయ నేతలు… మీడియా… మేధావులు

ఇక, చంద్రబాబు.. ప్రచార బరిలోకి తనకున్న పరిచయాలతో జాతీయ నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఫరూఖ్ అబ్దుల్లాతో ఇప్పటికే మైనారిటీలు ఎక్కువ ఉన్న చోట్ల ప్రచారం చేయించారు. త్వరలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, దేవెగౌడ, స్టాలిన్ ను కూడా తీసుకువచ్చి ప్రచారం చేయించనున్నారు. జనసేనతో పొత్తులో భాగంగా ఇప్పటికే సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. త్వరలో మాయావతి కూడా అమలాపురంలో బహిరంగ సభ నిర్వహించి ప్రచారం చేయనున్నారు. ఇక, ఇవన్నీ ఒకెత్తు అయితే తెలుగుదేశం పార్టీకి ఉన్న మీడియా మరొక ఎత్తు. తటస్థంగా ఉంటామనే పేరుతో జగన్ కు వ్యతిరేకంగా, చంద్రబాబుకు మద్దతుగా ప్రతీ రోజూ నియోజకవర్గ పేజీల నుంచి మెయిన్ పేజీ వరకు ప్రతీరోజూ కథనాలు రాస్తున్నాయి. జగన్ కు కూడా మీడియా సంస్థ ఉన్న అది జగన్ మీడియా అని అందరికీ తెలిసిందే. జగన్ మీడియా కంటే వ్యతిరేక మీడియా బలంగా ఉంది. రాష్ట్రంలో మేధావులుగా, తటస్థులుగా చలామణీ అవుతున్న కొందరు వ్యక్తులు కూడా టీడీపీని గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇలా రాష్ట్ర నేతలు ఓ వైపు, జాతీయ నేతలు మరో వైపు, మీడియా ఒక వైపు, మేధావులు మరొక వైపు నుంచి జగన్ లక్ష్యంగా చేసుకున్నారు. మరి, జగన్ ఒంటరిగా ఇవన్నీ చేధించి విజయం సాధించాలంటే మామూలు విషయమైతే కాదు.

Tags:    

Similar News