జగన్ చెక్ పెట్టేస్తున్నారే..?

హైదరాబాద్ కేంద్రంగా నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు చేస్తున్నారని, బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ క్యాంపు నుంచి వస్తున్న [more]

Update: 2019-02-22 03:30 GMT

హైదరాబాద్ కేంద్రంగా నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు చేస్తున్నారని, బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ క్యాంపు నుంచి వస్తున్న విమర్శ. జగన్ కు అమరావతికి రావడం ఇష్టం లేదని, హైదరాబాద్ లో కూర్చొని రాజకీయం చేస్తున్నారని కూడా టీడీపీ నేతలు తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలకు జగన్ త్వరలోనే చెక్ చెప్పనున్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్ తిరిగి వచ్చాక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కానున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చనున్నారు. ఇప్పటికే అమరావతిలో జగన్ ఇళ్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 26న లండన్ నుంచి తిరిగి రానున్న జగన్ 27 అమరావతి లో నూతన ఇంటి గృహప్రవేశం చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

కొనసాగనున్న చేరికలు

వాస్తవానికి ఈ నెల 14వ తేదీనే జగన్ గృహప్రవేశం చేయాల్సి ఉన్నా కుటుంబసభ్యుల అనారోగ్యం కారణంగా ఆయన వాయిదా వేసుకున్నారు. దీంతో జగన్ కు అమరావతి రావడం ఇష్టం లేదని ఆరోపణలు చేయడానికి టీడీపీకి అవకాశం దక్కింది. ఇక, 27వ తేదీ నుంచి అమరావతి కేంద్రంగా జగన్ రాజకీయాలు నడపనున్నారు. వరుసగా టీడీపీ ప్రజాప్రతినిధులను, నాయకులను వైసీపీలో చేర్చుకున్న జగన్ లండన్ పర్యటన కారణంగా తాత్కాలికంగా చేరికలను వాయిదా వేశారు. ఇక, 28 నుంచి మరిన్ని చేరికలు ఉండనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి 28న వైసీపీలో చేరనున్నారు. మరో మాజీ కేంద్రమంత్రి కూడా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ నాయకులతో చర్చలు జరుపుతున్న పలువురు టీడీపీ నేతలు, ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు కూడా అమరావతిలోనే వైసీపీలో చేరనున్నారు.

ఇక నుంచి అమరావతి కేంద్రంగానే…

ఇక, అభ్యర్థుల ఖరారుపైన కూడా జగన్ దృష్టి సారించనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఖరారులో టీడీపీ ముందంజలో ఉన్నందున ఆలస్యం చేస్తే దెబ్బ తింటామని భావిస్తున్న వైసీపీ నేతలు అలెర్ట్ అయ్యారని తెలుస్తోంది. జగన్ రాగానే వివాదాలు, ఆశావహుల మధ్య పోటీ ఎక్కువగా లేని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. ఇక, రాయలసీమ జిల్లాల్లో పూర్తయిన సమర శంఖారావం సభలను కూడా జగన్ కొనసాగించనున్నారు. ఇప్పటికే జగన్ ను కలిసిన పలువురు నేతలు వారివారి జిల్లాల్లో జరిగే సమర శంఖారావం సభల్లోనే జగన్ సమక్షంలో పార్టీలో చేరేలా వైసీపీ ప్లాన్ చేసుకుంటోంది. మొత్తానికి, వారం పాటు రాజకీయాలకు విరామం ఇచ్చిన జగన్ తిరిగి వచ్చాక ఫుల్ బిజీ కానున్నారు. టీడీపీ విమర్శలకు చెక్ పెడుతూ అమరావతి కేంద్రంగానే రాజకీయాలు చేయనున్నారు.

Tags:    

Similar News