జగన్… ఇక రన్..రాజా… రన్..!

విదేశీ పర్యటన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మళ్లీ రాజకీయాలతో బిజీ అయ్యారు. నిన్న అమరావతిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి కొత్తగా కట్టుకున్న [more]

Update: 2019-02-28 02:30 GMT

విదేశీ పర్యటన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మళ్లీ రాజకీయాలతో బిజీ అయ్యారు. నిన్న అమరావతిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. పలువురు నాయకులను కొత్త కార్యాలయంలోనే పార్టీలో చేర్చుకున్నారు. ఎన్నికలకు రెండు నెలలే సమయం ఉండటంతో పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలు అన్నీ పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. టీడీపీ, వైసీపీ మధ్య పోరు హోరాహోరీగా ఉండనుండటంతో ప్రతీ నిమిషమూ కీలకంగా మారింది. చంద్రబాబు ప్రతీ రోజూ ఎన్నికల కసరత్తులోనే ఉంటున్నారు. గతానికి భిన్నంగా ఆయన అప్పుడే అభ్యర్థులపై క్లారిటీ ఇస్తున్నారు. జగన్ మాత్రం ఈ విషయంలో వెనుకబడ్డారు. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులపై క్లారిటీ లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు లేదా ముగ్గరు ఆశావహులు టిక్కెట్లు ఆశిస్తున్నారు. ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దీనికి తోడు కొత్త నేతల చేరికలతో నేతల్లో తమకు టిక్కెట్ దొరుకుతుందా లేదా అనే అయోమయం నెలకొంది. ఫలితంగా చాలా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు.

అభ్యర్థుల ఖరారుకై కసరత్తు

ఈ విషయాన్ని గుర్తించిన జగన్ త్వరగా అభ్యర్థులపై క్లారిటీ ఇస్తే వారు ప్రజల్లోకి వెళ్లిపోతారని భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన టీడీపీ అభ్యర్థులు ప్రచారం కూడా మొదలుపెడుతున్నారు. దీంతో జగన్ కూడా అలెర్ట్ అయ్యారు. సాధ్యమైనంత త్వరలో 100కు పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాలనుకుంటున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటించకున్నా అభ్యర్థులకే నేరుగా సిగ్నల్ ఇచ్చి నియోజకవర్గంలో పనిచేసుకోవాలని చెప్పనున్నారు. జిల్లాల వారీగా జగన్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించనున్నారు. దీనికి తోడు కొత్త నేతల చేరికలకు కూడా జగన్ డెడ్ లైన్ పెడతారత. మరో వారం లేదా పది రోజుల వరకే చేరికలకు అవకాశం ఇవ్వాలని, తర్వాత ఎవరి కోసమూ ఎదురు చూడకుండా అభ్యర్థులను ఫైనల్ చేయాలని భావిస్తున్నారు.

మార్చి చివరి నుంచి ప్రజల్లోకి…

ఇక, తటస్థులను ఆకర్షించడానికి రూపొందించిన ‘అన్న పిలుపు’, పార్టీ బూత్ లేవల్ కార్యకర్తలను కలవడానికి రూపొందించిన ‘సమర శంఖారావం’ కార్యక్రమాలు కూడా జగన్ లండన్ పర్యటన వల్ల ఆగిపోయాయి. కేవలం మూడు జిల్లాల్లోనే ఈ కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి రేపటి నుంచి ఒక్కో జిల్లా చొప్పున ఈ కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని జగన్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి మార్చి చివరి నాటికి పార్టీ కార్యక్రమాలు, అభ్యర్థుల ఎంపిక వంటివి పూర్తి చేసేసే మొత్తం ప్రజల్లోకి వెళ్లేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. మొత్తానికి ఎలక్షన్ రేస్ లో విదేశీ పర్యటన వల్ల కొంత వెనుకబడ్డా స్పీడ్ అందుకునేలా జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

Tags:    

Similar News