సిక్కోలుకూ సింగరేణీకి చిక్కు ముడి ?

ఎక్కడ శ్రీకాకుళం మరెక్కడ సింగరేణి గనులు. దూరమే కాదు అన్ని రకాలుగానూ సామ్యమే లేదు. అయితే నాటి పాలకులు మాత్రం కలిపేశారు, గట్టిగా పీట ముడి కూడా [more]

Update: 2020-12-02 02:00 GMT

ఎక్కడ శ్రీకాకుళం మరెక్కడ సింగరేణి గనులు. దూరమే కాదు అన్ని రకాలుగానూ సామ్యమే లేదు. అయితే నాటి పాలకులు మాత్రం కలిపేశారు, గట్టిగా పీట ముడి కూడా వేశారు, చెట్టు మీద కాయకు, సముద్రంలో ఉప్పుకూ దేవుడు ముడి వేసిన చందంగా ఉమ్మడి ఏపీ పాలకులు ఈ పని చాలా సులువుగా చేశారు. ఫలితంగా ఉత్తరాంధ్రలో అత్యంత వెనకబడిన సిక్కోలులో భావనపాడు పోర్టుకు అదే పెద్ద అడ్డంకిగా మారింది. భావనపాడు అన్నది శ్రీకాకుళం జిల్లా వాసుల దశాబ్దాల కల. దాన్ని ఎట్టకేలకు నెరవేర్చడానికి నేనున్నాను అంటూ జగన్ ముందుకు వచ్చారు.

అదీ కధ….

ఉమ్మడి ఏపీని పాలించిన గత పాలకులు తెలంగాణాలోని సింగరేణి బొగ్గు గనుల కోసం భూములు కావాల్సివస్తే అటవీ భూములను వందల కొద్దీ తీసుకుని సింగరేణికి అప్పచెప్పారు. అటవీ చట్టం ప్రకారం భూమిని భూమి పరిహారం కింద తెలంగాణ సింగరేణికి ఇచ్చిన భూములకు గానూ ఏపీలోని చిట్టచివరి జిల్లా శ్రీకాకుళంలోని భూములను ఇచ్చేశారు. ఇది ఎపుడు జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ ఇపుడు భావనపాడు పోర్టు కోసం జిల్లాలోని మూలపేట ప్రాంతంలో అటవీ భూములను సేకరించాలని అధికారులు నిర్ణయించినపుడు ఫ్లాష్ భ్యాక్ కధ అలా మెరిసింది.

వందల ఎకరాల భారం….

ఇపుడు మూలపేట రిజర్వ్ ఫారెస్ట్ లో దాదాపుగా తొమ్మిది వందల ఎకరాల భూమిని సింగరేణి గనుల భూములకు బదులుగా నాటి పాలకులు పరిహారంగా ఇచ్చారు. ఈ భూములను ఇపుడు భావనపాడు పోర్టు నిర్మాణానికి అనువైనవి అని గుర్తించి మరీ అధికారులు సేకరణకు దిగారు. అయితే ఈ భూములే పరిహారంగా వచ్చినవి అని రికార్డులలో బయటపడడంతో హతాశులు అవడం అధికారుల వంతు అయింది. పైగా ఈ భూములు తీసుకోవాలంటే అటవీ శాఖ అనుమతి కావాలి. అలాగే పర్యావరణ అనుమతులు కావాలి. కేంద్రం పూనుకుంటేనే కానీ అది జరిగే పని కాదు, ఇక ఇంతకు ఇంతా భూములు వేరే చోట పరిహారంగా ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పడింది.

అతి పెద్ద బ్రేక్….

భావనపాడు పోర్ట్ తొలి దశ పనులను 2023 నాటికి పూర్తి చేయాలని జగన్ సర్కార్ గట్టి పట్టుదల మీద ఉంది. దీనికి సంబంధించి పరిపాలనా అనుమతులను, భూసేకరణకు నిధులను కూడా కొద్ది నెలల క్రితం ప్రభుత్వం మంజూరు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భావనపాడు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పోర్టు కి ఆదిలోనే అతి పెద్ద బ్రేక్ పడిపోయింది. ఇపుడు జగన్ స్థాయిలోనే గట్టిగా పట్టుదల పట్టి మోడీ సర్కార్ ని ఒప్పించి అటవీ భూములు తీసుకోవాలి. పర్యావరణ అనుమతులు కూడా మంజూరు చేయించాలి. ఆ మీదట వందల ఏర్కాలు వేరే చోట అటవీ శాఖకు ఇవ్వాలి. ఇవన్నీ ఇప్పట్లో జరిగే పనేలా. మరో వైపు తెలంగాణా విడిపోయింది. సింగరేణి వారి సొంతమైంది. మరి నాడు తీసుకున్న ఆ భూములకు గానూ నష్టపరిహారం కేసీఆర్ సర్కార్ చెల్లిస్తుందా అంటే అది జరిగే పనే కాదు అని అంటున్నారు. మొత్తానికి భావనపాడు జాతకం మారేనా అని సిక్కోలు వాసులు దిగాలు పడుతున్నారుట.

Tags:    

Similar News