జగన్ ఒకటి తలుచుకుంటే…?

తెలుగుదేశం ప్రభుత్వం పతనానికి దారితీసిన కారణాల్లో ఇసుక మాఫియా ఒకటి. అడ్డగోలుగా ఇసుక దందా సాగినా ప్రభుత్వం పట్టించుకున్న పాపానికి పోలేదు. ఇక ఎమ్యెల్యేలు, ఎంపిలు, మంత్రులు [more]

Update: 2019-07-07 02:00 GMT

తెలుగుదేశం ప్రభుత్వం పతనానికి దారితీసిన కారణాల్లో ఇసుక మాఫియా ఒకటి. అడ్డగోలుగా ఇసుక దందా సాగినా ప్రభుత్వం పట్టించుకున్న పాపానికి పోలేదు. ఇక ఎమ్యెల్యేలు, ఎంపిలు, మంత్రులు స్థాయినుంచి గ్రామస్థాయి నేతవరకు ఇసుక పై సంపాదన అంతా ఇంతా కాదు. కళ్లెదుటే సాగుతున్న ఈ దందా పై ఐదేళ్లు వైసిపి గొంతెత్తి ఘోషిస్తూనే వుంది. ఇదంతా టిడిపి అనుకూల మీడియా లో సైతం వచ్చినా ఎలాంటి చర్యలు లేనేలేవు. ఇసుక వ్యవహారం సామాన్యుడి నుంచి పై స్థాయివరకు చర్చనీయమే అయ్యింది. టిడిపి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక భావన పెరిగిపోవడంతో బాటు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపేలా చేసింది. ఫలితం అందరికి తెలిసిందే. టిడిపి చరిత్రలో చూడని ఓటమి ఆ పార్టీ ని వెక్కిరించింది. వై.ఎస్.జగన్ అధికారంలోకి వచ్చారు.

వైసిపికి బురద అంటుకుంటుంది ….

తాము అధికారం చేపట్టిన వెంటనే ఇసుక పాలసీ పూర్తిగా మార్చేస్తామని ప్రకటించారు వైసిపి అధినేత వై.ఎస్.జగన్ . మాఫియా ను తరిమికొడతామన్నారు. అందరికి అందుబాటులో వుండే ధర తో బాటు ప్రభుత్వ ఖజానాకు సొమ్ము వచ్చేలా విధానం తీసుకు వస్తామని ప్రకటించారు. అనుకున్నట్లే ఆయన ప్రభుత్వం ఏర్పడింది. తక్షణం పాత ప్రభుత్వ ఇసుక విధానం రద్దు చేశారు కొత్త ముఖ్యమంత్రి. జులై ఒకటో తేదీ నుంచి నూతన పాలసీ ప్రకారం ఇసుక అమ్మకాలు అని ప్రకటించారు. ఆ సమయం రానేవచ్చింది. కొత్త విధానం ప్రకటిస్తామని చెప్పి సెప్టెంబర్ ఒకటి నుంచి అని సర్కార్ మాట మార్చింది. ఎపి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇసుక అమ్మకాలు పారదర్శకం అని పేర్కొంది. ఒక పక్క నూతన సర్కార్ వచ్చిన నాటి నుంచి ఇసుక విక్రయాలు ఆగిపోవడంతో ఒక్కసారిగా నిర్మాణాలు ఎపి లో ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. దాంతో బ్లాక్ మార్కెట్ లో ఇసుక చుక్కలు తాకుతుంది.

బ్లాక్ మార్కెట్ లో …

లారీ ఇసుక నాలుగువేలరూపాయలనుంచి తొమ్మిదివేలరూపాయలకు చేరుకోవడంతో అటు బిల్డర్లు ఇటు సామాన్యులు హడలిపోతున్నారు. పట్టపగలే ఇసుక లారీలు రవాణా నిషేధం వున్నా యథేచ్ఛగా సాగుతున్నాయి. పోలీస్, రెవెన్యూ వర్గాలు, రాజకీయ నేతలు కొందరు మూకుమ్ముడిగా ఈ వ్యవహారం వెనుక జేబులు నింపుకుంటున్నారు. ఇందులో టిడిపి, వైసిపి అనే తేడా లేకపోవడం చూస్తే అంతా వ్యాపారంగానే వ్యవస్థ నడుస్తుంది. అవినీతి వ్యవస్థలో కలుపు మొక్కలు ఏరి పారేయకుండా కొత్త పాలసీలను అమలు చేయడం అంత సులువు కాదని వై.ఎస్.జగన్ కి క్రమంగా అర్ధమౌతుంది. ఇసుక విషయంలో తక్షణమే కొత్త విధానం అమలు చేయడం మాని మీనమేషాలు లెక్కిస్తూ రావడం ప్రజల్లోనూ ఏ పార్టీ అధికారంలో వున్నా ఇంతే కదా అనే భావన ప్రోది చేస్తుంది.

వారే అమ్మేస్తున్నారంటున్న మంత్రి ….

ఇసుక బ్లాక్ మార్కెటింగ్ పై ఎపి మంత్రి తానేటి వనితను “తెలుగు పోస్ట్” ప్రశ్నించింది. లారీ ఇసుక 9 వేలరూపాయల ధర పలకడం నిజమే అని అయితే ఇదంతా టిడిపి మాఫియా పనే అని గుర్తించామన్నారు ఆమె. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా గుట్టలుగా స్టాక్ పెట్టుకున్న టిడిపి నేతలు ఇప్పుడు ఆ ఇసుకను బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారని తాము మాత్రం కలెక్టర్ల ద్వారా అవసరమైన వారికి ఇసుక తక్కువ ధరకే అధికారుల ద్వారా విక్రయిస్తున్నామని వనిత వ్యాఖ్యానించడం గమనార్హం.

Tags:    

Similar News