జగన్ జాబితా రెడీ…విడుదల ఎప్పుడంటే…?

ఈసారి కచ్చితంగా అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ [more]

Update: 2019-03-06 03:30 GMT

ఈసారి కచ్చితంగా అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. చివరి నిమిషం వరకు అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెడితే నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆయన గుర్తించారు. ఓ వైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో గతానికి భిన్నంగా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారు. సుమారు 100 స్థానాల్లో అభ్యర్థులను ఆయన నోటిఫికేషన్ వచ్చే నాటికే ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రతీరోజు పార్లమెంటు నియోజకవర్గాలవారిగా అభ్యర్థుల ఎంపికపై స్పష్టత ఇస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించకున్నా.. పని చేసుకోవాల్సిందిగా వారికి ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. దీంతో అధినేత నుంచి మాట పొందిన టీడీపీ అభ్యర్థులు ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఓ వైపు టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో ఉంటే మనం చివరి నిమిషం వరకు తాత్సారం చేస్తే నష్టం జరుగుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

త్వరలో ఫస్ట్ లిస్టు…

ఇప్పటికే జగన్ 100-120 స్థానాల్లో అభ్యర్థులపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో సిట్టింగులు అందరికీ టిక్కెట్లు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీలోనే కొనసాగిన ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. ఒకరిద్దరు మినహా మిగతా అన్ని స్థానాల్లో సిట్టింగులకు ఆయన టిక్కెట్లు ఖరారు చేశారు. ఇక, చేరికలకు కూడా ఆయన త్వరలో తలుపులు మూసేయాలని భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని, నోటిఫికేషన్ వచ్చాక చేరితే టిక్కెట్లు ఇవ్వలేమని వైసీపీ నేతలు స్పష్టం చేసేస్తున్నారు. ఇప్పటికీ బలమైన అభ్యర్థులు లేని నియోజకవర్గాలకు మాత్రం రెండో విడతలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. మొత్తానికి మరో పది రోజుల్లో 100-120 అభ్యర్థులతో వైఎస్సార్ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల కానుందని తెలుస్తోంది.

పది రోజుల్లో బస్సు యాత్ర…

నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థులను ప్రకటించేసి జగన్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. బస్సుయాత్ర ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఆయన బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా నేతలు సిద్ధం చేశారు. పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టేలా ఈ రూట్ మ్యాప్ సిద్ధమయ్యింది. బస్సుయాత్రకు ముందే బూత్ లెవల్ కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో ‘సమర శంఖారావం’ సభలు కూడా పూర్తి చేయాలని పార్టీ యోచిస్తోంది. ఇప్పటివరకు ఐదు జిల్లాల్లోనే ఈ సభలు పూర్తయినందున మిగతా జిల్లాల్లోనూ ఈ పది రోజుల్లో పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. మొత్తానికి జగన్ ఈసారి గతానికి భిన్నంగా ప్రణాళిక ప్రకారం ఎన్నికలకు వెళుతున్నారు. గత ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో సిఫార్సులు, మొహమాటాలకు పోయిన జగన్ ఈసారి అటువంటి వాటికి కూడా చోటివ్వకుండా బలమైన అభ్యర్థులకే టిక్కెట్లను ఖరారు చేస్తున్నారు.

Tags:    

Similar News