వదిలేది లేదు..వడ్డింపులే..

Update: 2018-07-17 17:00 GMT

తెలుగుదేశం విసిరిన రాజకీయ ఉచ్చు నుంచి బయటపడేందుకు వ్యూహరచన చేస్తోంది వైసీపీ. 2014లో చేసిన తప్పు పునరావృతం అవుతుందేమోనని పార్టీ శ్రేణులు కొంతకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి పరిష్కారమార్గాలు వెదికి, ప్రత్యామ్నాయం చూపించే దిశలో పార్టీ ఉన్నతస్థాయి మంత్రాంగం నెరపుతోంది. టీడీపీ నుంచి వస్తున్న విమర్శలకు బదులివ్వకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అగ్రనాయకత్వం గ్రహించింది. తక్షణం అనుమాన నివృత్తి చేయాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. మాటలతో కాకుండా చేతలతో బదులిస్తేనే పార్టీ వర్గాలతోపాటు ప్రజల్లోకి వెళుతుందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. భారతీయ జనతాపార్టీ తో అంటకాగుతున్నారనేది ప్రధానంగా వైసీపీ ఎదుర్కొంటున్న విమర్శ. దీనికి బదులివ్వాల్సి ఉంది. తమకు కమలం పార్టీ తో ఎటువంటి సంబంధం లేదు. కేంద్రంతో ఒక పార్టీకి ఉండాల్సిన సాంకేతిక బంధాలే తప్ప రాజకీయ బాంధవ్యం ఏమాత్రం లేదని తేల్చి చెప్పాలని భావిస్తున్నారు. ఈ దిశలో అవసరమైన కార్యాచరణకు జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం...

లోక్ సభలో వైసీపీ ఎంపీలు ఎవరూ లేరు. రాజ్యసభకు, అవిశ్వాసానికి సంబంధం లేదు. దీనిని ఆసరాగా చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కు తాను ఏకైక ప్రతినిధిని అన్నట్లుగా గుత్తాధిపత్యం సాధించే యత్నాలు చేస్తుంది. ప్రచార ప్రపంచంలోకి రాకుండా వైసీపీని నిరోధిస్తుంది. ఈ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఆమోదింపచేసుకున్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే క్రెడిట్ వారికి దక్కకుండా తెలుగుదేశం ప్రతివ్యూహం రచించింది. టీడీపీ ఎంపీలతో జిల్లాలవారీ దీక్షలకు శ్రీకారం చుట్టింది. విశాఖ,కడప,అనంతపురం, కాకినాడ వంటి చోట్ల దీక్షలను ఇప్పటికే పూర్తి చేశారు. లోక్ సభ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత వీటిని కంటిన్యూ చేయాలని నిశ్చయించారు. ఢిల్లీలో సమావేశాల సందర్బంగా హల్ చల్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే తమ ఎంపీలకు ఆదేశించారు. ఆరు బృందాలుగా ఏర్పడి వివిద రాజకీయపార్టీలను కలుస్తున్నారు. దీనిని ఎదుర్కోవాలంటే రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జగన్ ఆదేశించారు. వారంతా ఢిల్లీలోనే ఉండి మీడియా సమావేశాలు, ఆందోళనలు, రాజకీయపార్టీలను కలిసే కార్యక్రమాలు చేయబోతున్నారు. టీడీపీకి తీసిపోని విధంగా, దీటుగా హస్తినలో ఆందోళన చేయాలనేది వైసీపీ యోచన.

రాజ్యసభలో..రాజీ లేదు...

చట్టసభలో తమ వాణి వినిపించి ప్రజల ద్రుష్టిలో పడాలంటే వైసీపీకి మిగిలిన ఏకైక వేదిక రాజ్యసభ మాత్రమే. ఇప్పటికే శాసనసభ సమావేశాలను వైసీపీ బహిష్కరిస్తోంది. బడ్జెట్ సమావేశాలను సైతం వినియోగించుకోలేదు. సంఘటితంగా నిరసన తెలిపేందుకు, ప్రజల్లోకి తమ వాణిని తీసుకెళ్లేందుకు అసెంబ్లీ , పార్లమెంటు మంచి వేదికలు. అయితే జగన్ పాదయాత్రలో ఉండటంతో అసెంబ్లీ ని సమర్థంగా వినియోగించుకోలేమనే భావనతో వైసీపీ ఈ అవకాశాన్ని జారవిడుచుకుంది. వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు లేవు. దీనిని తెలుగుదేశం పార్టీ గరిష్టంగా ఉపయోగించుకొంటోంది. ప్రభుత్వప్రచారానికి, వైసీపీని దుమ్మెత్తిపోసేందుకు అసెంబ్లీని వాడేసుకుంటోంది. దీనిని ప్రతిఘటించడానికి తమ సభ్యులెవరూ లేరు. ఇప్పుడు లోక్ సభలో సైతం సీట్లు ఖాళీ చేసేశారు. వైసీపీ నంబర్ టు నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై పెద్ద బాధ్యత పడింది. లోక్సభ లో తమ సభ్యులు లేని లోపాన్ని రాజ్యసభలో ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో బీజేపీ తో రాజీపడినట్లు కనిపించకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి చురుకైన పాత్ర పోషించగలరని వైసీపీ భావించడం లేదు. దీంతో విజయసాయి కి ఒంటరి పోరాటం తప్పదు.

అవినీతి.. హైలైట్...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 1500 రోజులు గడచిన సందర్బంగా ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. గ్రామదర్శిని పేరిట ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి అభివ్రుద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తున్నారు. ఇదంతా సర్కారీ ఖర్చుతో సాగిపోతున్న వ్యవహారం. దీనికి ప్రతిగా పదిహేను వందల రోజుల్లో చోటు చేసుకున్న అవినీతి, కుంభకోణాలపై ప్రజల్లో చార్జిషీటు పెట్టేందుకు సిద్ధమవుతోంది వైసీపీ.‘ పెట్టుబడుల విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించారు. రాజధానికి రూపం ఇవ్వలేకపోయారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి సైతం ప్రత్యేక హోదా, రైల్వేజోన్ సాధించలేకపోయారు. రహదారుల నుంచి ప్రాజెక్టుల వరకూ పర్సంటేజీలు వసూలు చేస్తున్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ వంటివాటిని సక్రమంగా అమలు చేయలేదు. డ్వాక్రా రుణాలు టీడీపీ అధికారంలోకి వచ్చేనాటికి 15వేల కోట్లరూపాయలు ఉంటే ఇప్పుడు 22 వేల కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇక మాఫీ ఎక్కడ? ‘ వంటి వాటిపై వైసీపీ రచ్చ చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాల వారీ అవినీతిని వెలికి తీసి ప్రభుత్వ తప్పిదాలను హైలైట్ చేయాలనే దిశలో కసరత్తు సాగిస్తున్నారు.

-ఎడిటోరియల్ డెస్క్

Similar News