జగన్ జర జాగ్రత్త టీడీపీ తమ్ముళ్ళు కాషాయధారులవుతున్నారు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఎన్నడూ లేనంతగా అనుకూలమైన రాజకీయ వాతావరణంలో ఉన్నారు. ఆయనను ఎదుర్కొనే శక్తి టీడీపీకి లేదు. చంద్రబాబుని ఇపుడున్న స్థితిలో జనాలు [more]

Update: 2019-06-22 02:30 GMT

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఎన్నడూ లేనంతగా అనుకూలమైన రాజకీయ వాతావరణంలో ఉన్నారు. ఆయనను ఎదుర్కొనే శక్తి టీడీపీకి లేదు. చంద్రబాబుని ఇపుడున్న స్థితిలో జనాలు నమ్మడం లేదు. ఇక మరో వైపు బీజేపేకి ఏపీలో నోటా కంటే తక్కువ సీట్లు, ఓట్లు వచ్చాయి. జనసేన పత్తా లేకుండా పోయింది. . ఈ సమయంలో జగన్ మోహన్ రెడ్డి కి ఈ అయిదేళ్ళు దర్జాగా గడచిపోవాలి. కానీ..పట్టుమని ఇరవై రోజులు కూడా గడవకుండానే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అమల్లో పెట్టారు. తనను టీడీపీని ప్రాణం కన్నా మిన్నగా భావించే నలుగురు రాజ్యసభ ఎంపీలను ఆయనే కావాలని బీజేపీలోకి పంపారని టాక్ బలంగా వినిపిస్తోంది. సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ వీరిలో ఎవరూ కూడా టీడీపీని విడిచి వెళ్ళే వారే కాదు. కానీ హఠాత్తుగా వీరు బీజేపీలోకి వెళ్తున్నారంటే ఇందులో మతలబు ఉందని అంటున్నారు.

బాబు పార్టీకి బ్యాంక్ లాంటి వారు :

టీడీపీకి ఆర్ధికంగా సహాయం చేసే సీఎం రమేష్, సుజన చౌదరి వంటి వారు బీజేపీకి వెళ్ళడం అంటే బాబుకు తెలియకుండా వుండదని అంటున్నారు. వీరే టీడీపీలో ఉంటే ఆర్ధిక నేరాల్లో పడి ఇబ్బందుల పాలు అవుతారు. అందుకే బాబు మాస్టర్ స్ట్రోక్ అలా ఇచ్చారన్నమాట. బీజేపీలో అయిదేళ్ళు హాపీగా సేఫ్ జోన్లో ఉండి మరో వైపు నుంచి టీడీపీకి ఆర్ధికంగా అయిదేళ్ళు సాయపడతారన్నమాట. ఆ విధంగా వీరు కేంద్రంలో రాజకీయంగా గట్టిగా , అధికారంలోనే వుంటూ బాబుకు వెన్ను దన్నుగా ఉంటారని అంటున్నారు. హాట్ మెయిల్ పాలిటిక్స్ బాబుతో ఎటూ ఉంటాయని , మధ్యలో వీరిని నమ్మి పదవులు, అధికారం ఇస్తే అది బీజేపీ తాను మోసపోయినట్లేనని అంటున్నారు.

జగన్ని విడదీసే ప్లాన్ :

ఇక మరో వైపు జగన్ మోహన్ రెడ్డి బీజేపీతో కలసి మెలసి ఉంటున్నారు. వ్యూహాత్మకంగా ఆయన్ని బీజేపీ నుంది విడదీయడం, రానున్న రోజుల్లో కేంద్రం నుంచి వైసీపీకి ఏ సాయం అందకుండా చేయడం, ఇదంతా వ్యూహంలో భాగమని అంటున్నారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ని బీజేపీని విడదీస్తే ఏపీకి కేంద్ర సాయం నిలిచిపోతుంది. అపుడు జగన్ మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాలు చేయలేక ఇబ్బంది పడతారు. అది వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి రాజకీయంగా కలసివస్తుంది. మొత్తానికి బాబు గొప్ప వ్యూహంతోనే ఇలా తన వారిని ఇపుడు పంపుతున్నారని అంటున్నారు. అదే నిజమైతే జగన్ మోహన్ రెడ్డి జాగ్రత్త పడవలసిందే.

Tags:    

Similar News