అందుకే నువ్వు నాకు నచ్చావ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో అసంతృప్తులు తలెత్తకుండా, సంక్షేమ కార్యక్రమాలు [more]

Update: 2019-08-28 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో అసంతృప్తులు తలెత్తకుండా, సంక్షేమ కార్యక్రమాలు గాడి తప్పకుండా చూసేందుకు నూతన విధానాలను వైఎస్ జగన్ అనుసరిస్తున్నారు. చంద్రబాబునాయుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకుండానే కాలాన్ని గడిపేశారు. ముఖ్యమైన పోస్టుల్లో కొందరికే చంద్రబాబు అవకాశమిచ్చారు. జిల్లా స్థాయి పోస్టులను భర్తీ చేయలేదు. కానీ వైఎస్ జగన్ మాత్రం నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో తాను అనుకున్న వారికి కట్టబెట్టడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.

నామినేటెడ్ పోస్టులు…..

నామినేటెడ్ పోస్టులు భర్తీ అయిపోతున్నాయి. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ, అధికార భాషా సంఘం ఛైర్మన్ గా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా జక్కంపూడి రాజాను నియమించారు. ఇక తెలంగాణకు చెందిన దేవులపల్లి అమర్ ను అంతరాష్ట్ర, దేశీయ మీడియా వ్యవహారాల ఇన్ ఛార్జిగా నియమించారు. ద్రోణంరాజు శ్రీనివాస్ కూ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. ఇలా అన్ని సామాజికవర్గాల వారికీ పదవులను ఇస్తుండటంతో పార్టీ నేతల్లోనూ సంతృప్తి వ్యక్తమవుతోంది.

చేరదామనుకుంటున్నా……

దీంతోపాటుగా గత కొద్దిరోజులుగా ఏపీలో చేరికలు ముమ్మరంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలు కావడంతో అధికార పార్టీలో చేరేందుకు అనేక మంది నేతలు ఉత్సాహం చూపుతున్నారు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్లాలని ప్రయత్నించారు. ఈ మేరకు తమ సన్నిహితుల ద్వారా సమాచారాన్ని పంపారు. అయితే వైఎస్ జగన్ మాత్రం వారి చేరికలను సున్నితంగా తిరస్కరించారు.

నో ఎంట్రీ అని చెప్పి…..

పార్టీ కోసం తొమ్మిదేళ్ల పాటు కష్టపడిన వారు చేరికలతో నష్టపోతారని జగన్ భావిస్తున్నారు. వచ్చే వాళ్లు ఖచ్చితంగా పదవులు ఆశించే వస్తారని, వారికి పదవులు ఇస్తే పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేసినవారమవుతామని జగన్ చెప్పినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా కీలక నేతలు పార్టీలో చేరతారని ఓ ముఖ్యనేత జగన్ వద్ద ప్రస్తావన చేసినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే స్థాయి నేతలకు నో ఎంట్రీ అని జగన్ చెప్పడంతో వైసీపీలో చేరాలనుకున్న నేతలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. జగన్ నిర్ణయానికి వైసీపీ నేతలు ఫిదా అవుతున్నారు. చేరికలకు నో చెప్పడంతో తమకు ఫ్యూచర్ ఉంటుందని కొందరు నేతలు బహిరంగంగానే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News