అంత ఆశ్చర్యం ఎందుకో?

వైఎస్ జగన్ కు ఎందుకంత తొందర? ఆయనకు ఇటీవల జరిగిన ఎన్నకల్లో 151 సీట్లను కట్టబెట్టారు ప్రజలు. ప్రతిపక్షం ఉన్నా లేనట్లే. శాసనసభలో వైసీపీదే పూర్తి స్థాయి [more]

Update: 2019-10-12 15:30 GMT

వైఎస్ జగన్ కు ఎందుకంత తొందర? ఆయనకు ఇటీవల జరిగిన ఎన్నకల్లో 151 సీట్లను కట్టబెట్టారు ప్రజలు. ప్రతిపక్షం ఉన్నా లేనట్లే. శాసనసభలో వైసీపీదే పూర్తి స్థాయి ఆధిపత్యం. మరో 23 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ ఓటమి పాలయింది. అయితే వైఎస్ జగన్ నాలుగు నెలలు మౌనంగా ఉండి ఇప్పుడు పార్టీ గేట్లను బార్లా తెరవడం వెనక వ్యూహ మేంటి? అంత అవసరం ఉందా? పార్టీని మరింత బలోపేతం చేయాలంటే కొత్త నాయకులను తయారు చేసుకునే వీలుంది. అందుకు తగినంత సమయం కూడా జగన్ కు ఉంది.

సీఎం అయిన తర్వాత….

అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతర రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తారని అందరూ భావించారు. ముఖ్యంగా పార్టీ క్యాడర్, నేతలు ఈ విషయంలో జగన్ పై నమ్మకం ఎక్కువగా పెట్టుకున్నారు. కానీ గత కొద్దిరోజులుగా వైసీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూసి సొంత పార్టీ నేతలే అవాక్కవుతున్నారు. ఇప్పటికే ఫ్యాన్ పార్టీ ఫుల్లుగా ఉంది. నియోజకవర్గాల్లో సయితం నేతలకు కొదవలేదు. మొన్నటి వరకూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నియోజకవర్గానికి ఇద్దరు ఇన్ ఛార్జులను నియమించిన ఘనత జగన్ దేనని చెప్పక తప్పదు.

జనంలో లేని….

అలాంటిది పార్టీకి ఏమాత్రం ఉపయోగపడని, జనంలో బలంలేని నేతలకు కండువా కప్పడాన్ని కార్యకర్తలు సయితం తప్పుపడుతున్నారు. మరో 30 ఏళ్లు తానే ముఖ్యమంత్రి గా కొనసాగుతానని చెప్పిన జగన్ ఇలా చేస్తే అవుతారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. విశ్వసనీయతకు జగన్ చిరునామాగా భావించిన వారు సయితం ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇది వ్యూహంలో భాగమని అంటున్నారు. వ్యూహం వేరు, విధానం వేరు అని పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా భవిష్యత్తు మీద ఆశతో ఉన్న పవన్ కళ్యాణ్ అయినా రాజకీయంగా వారి నిర్ణయాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే వారు సేవా సంస్థలను నిర్వహించడం లేదు.

అధికారమే లక్ష్యం…..

రాజకీయ పార్టీలను నడుపుతున్నారు. రాజకీయ పార్టీ లక్ష్యం అధికారం. ఈ అధికారంలోకి రావడానికి, లేదా వచ్చిన అధికారాన్ని నిలుపుకోడానికి వారు అనేక వ్యూహాలు అమలుచేస్తుంటారు. ఆ వ్యూహాల్లో భాగమే నాయకులను పార్టీలో చేర్చుకోవడం, లేదా వదిలించుకోవడం, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, లేదా పొత్తునుండి వైదొలగడం. ఇవన్నీ వ్యూహాలే. రాజకీయానికి ప్రాధమిక లక్షణమే వ్యూహం. కనుక వ్యూహాన్ని తప్పు పట్టాల్సినపని లేదు. తప్పు పట్టాల్సింది ఆయా పార్టీల లేదా నేతల విధానాలను మాత్రమే. ఈ చిన్న తేడా అర్ధమైతే నడుస్తున్న రాజకీయాల్లో గందరగోళం కనిపించదు. సమీకరణల పట్ల ఆశ్చర్యం కూడా కనిపించదు. వ్యూహానికి, విధానానికి తేడా గమనించలేకపొతే అన్నీ ఆశ్చర్యాలే. ఆ పార్టీతో పొత్తు ఏంటి? ఆ నాయకుడు ఇక్కడేంటి? ఇలాంటి ప్రశ్నలే మిగులుతాయి. రాజకీయం అంతిమ లక్ష్యం అధికారం. అది తెలుసుకోండి ఫ్యాన్ పార్టీ మిత్రులారా.

Tags:    

Similar News