అందుకే జగన్ ఎంచుకున్నారు

స్వర్ణాంధ్ర నిర్మాత చంద్రబాబు అంటూ ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత గొప్పగా ప్రచారం చేయించుకున్నారు. హైదరాబాద్ ని నేనే అభివృధ్ధి చేశానంటూ క్లెయిం చేసుకున్నారు. సైబరాబాద్ కట్టి [more]

Update: 2019-12-23 02:00 GMT

స్వర్ణాంధ్ర నిర్మాత చంద్రబాబు అంటూ ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత గొప్పగా ప్రచారం చేయించుకున్నారు. హైదరాబాద్ ని నేనే అభివృధ్ధి చేశానంటూ క్లెయిం చేసుకున్నారు. సైబరాబాద్ కట్టి మొత్తం భాగ్యనగారానికే భాగ్య విధాతగా వందిమాగధుల చేత అనిపించుకున్నారు. ఆ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ లో మళ్ళీ ఉపయోగపడకపోయినా నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముచ్చటగా మూడవసారి సీట్లో కూర్చునేందుకు బాగా హెల్ప్ అయింది. ఇక అమరావతి వంటి ప్రపంచ రాజధానిని నిర్మించి తాను చరిత్ర పురుషుడు అవుతాను అనుకున్నారు చంద్రబాబు. కానీ ఇక్కడ చూస్తే కాన్వాస్ చాలా పెద్దది. పైగా నిధులు లేని ఏపీలో సర్కస్ ఫీట్లు చేయడం తప్ప అయిదేళ్ళలో చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు.

ఇదీ రూట్ కదా….

దీన్ని బట్టి అర్ధమైంది ఏంటి అంటే బాగా ఎదిగిన నగరంలో నాలుగు భవనాలు కొత్తగా కడితే సిటీలను కట్టించిన పెద్ద మేస్త్రీగా చలామణీ అయిపోవచ్చు. పైగా నగరాలు ఎపుడూ విస్తరిస్తూనే ఉంటాయి. ఆ ఖ్యాతి అప్పనంగా ఏలికల ఖాతాలో పడిపోతుంది. అదే పర్ర భూముల్లో నగరాలను నిర్మించడం అసాధ్యమని చంద్రబాబు అయిదేళ్ళ నవ్యాంధ్ర జమానా రుజువు చేసింది. సరిగ్గా ఇదే పాయింటుని జగన్ పట్టుకున్నారు. అందుకే ఆయన వేలాది ఎకరాలు ఉన్నా ఖాళీ భూముల జోలికి పోవడం లేదు. అక్కడ మహా నాగరాలు నిర్మించడం తన తరం కాదని చాలా ముందుగానే తెలుసుకున్నారు. అందుకే ఇప్పటికే హైదారాబాద్ తో సమానంగా అభివృధ్ధి చెందుతున్న విశాఖను తన స్థావరంగా ఎంచుకున్నారు.

నంబర్ వన్ ఖాయం…

ఇప్పటివరకూ తీసుకుంటే విశాఖ సొంతంగా ఎదిగిన నగరం. ఈ నగరం ఎదుగుదల కేవలం వందేళ్ళ నుంచే మొదలైంది. బ్రిటిష్ వారు 1933లో పోర్టుని ప్రారంభించారు. ఆ తరువాత నుంచే నగరం అభివృధ్ధి మొదలైంది. ఇపుడు దేశంలోని మొదటి పది మేజర్ పోర్టుల్లో ఒకటిగా చలామణీ అవుతోంది. అదిపుడు శరవేగంగా పరుగులు తీస్తూ పాతిక లక్షల జనాభా పై దాటి విస్తరించింది. విశాఖకు ఒక చెన్నై, బెంగుళూర్ స్థాయిలో ఎదిగే అవకాశం ఉంది. దానికి కొంత ఇంధనం కావాలి. ఇపుడు పాలనారాజధానిగా చేయడం అంటే విశాఖను ఎక్కడికో తీసుకుపోయినట్లే.

చరిత్రలో కొన్ని పేజీలు…

ఇది చాలు విశాఖ సమీప భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ వన్ కావడానికి. ఇలా ఈ నగరం ఎంత ఎదిగితే అంతలా జగన్ కి పేరు రావడం తధ్యం. హైదరాబాద్ నగరాభివృధ్ధిలో బాబు పాత్రను అక్కడి టీఆర్ఎస్ తోసిపుచ్చవచ్చు కానీ జగన్ కి అలాంటి రాజకీయ ఇబ్బంది కూడా ఉండదు. భవిష్యత్తులో ఎటువంటి విభజనలకు అవకాశం లేకుండా వికేంద్రీకరణ మంత్రం చదువుతున్న జగన్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉంచుకోవడం తధ్యమని కూడా అంటున్నారు.

కర్నూలు విషయంలోనూ…

సీమ నుంచి పదకొండు మంది ముఖ్యమంత్రులు రాజ్యం చేసారు కానీ. ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇప్పటిదాకా ఇది సీమవాసుల దీన గాధ. ఇక శ్రీబాగ్ ఒప్పందం అన్నది చరిత్రలో కలిపేశారు. దాన్ని మళ్ళీ తెచ్చి దశాబ్దాల కాలం నాటి అన్యాయాన్ని జగన్ సరిదిద్దారన్న పేరు కూడా కచ్చితంగా సొంతం అవుతుంది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు ద్వారా జగన్ మంచి ప్రతిపాదన చేశారని కూడా అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి ఏపీ సీఎం గా చంద్రబాబుకు మంచి పాలకుడిగా పేరు వస్తే రావచ్చు కానీ విభజన ఏపీలో మాత్రం జగన్ తనకంటూ ఒక చరిత్ర ఉండాలని పడుతున్న తపనతో బాబుతో పాటు ఆయన పార్టీ కూడా వెనకబడే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు.

Tags:    

Similar News