రివర్స్ పంచ్ ఉంటుందటగా

రాజకీయాలు సవ్యంగా సాగకపోతే ప్రాంతాలు, మతాలు, కులాలు ఇలా చాలా గొడవలనే ముందుకు తెస్తారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ రగడ మొదట పదవుల దగ్గర మొదలై చివరికి [more]

Update: 2019-08-12 03:30 GMT

రాజకీయాలు సవ్యంగా సాగకపోతే ప్రాంతాలు, మతాలు, కులాలు ఇలా చాలా గొడవలనే ముందుకు తెస్తారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ రగడ మొదట పదవుల దగ్గర మొదలై చివరికి అది జనంలోకి పోయి సెంటిమెంట్ మంట మండించింది. ఆఖరుకు పాలకుండ లాంటి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవాల్సివచ్చింది. విభజన ఏపీలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఉన్నాయి. కోస్తాలో సహజంగానే ఉమ్మడి ఏపీ నుంచి కూడా కొంత అభివృధ్ధి కనిపిస్తోంది. దానికి తోడు అన్నట్లుగా రాజధాని కూడా అక్కడే ఏర్పడింది. హైకోర్టు పెట్టారు. దాంతో ప్రగతి రధం అలా పరుగులు తీస్తోంది. మరి మిగిలిన ప్రాంతాల సంగతేంటి అన్నది ఇపుడు చర్చగా ఉంది. అయిదేళ్ళ పాటు ఏపీని పాలించిన చంద్రబాబు కూడా రాయలసీమ వారే కానీ ఆయన తన సామాజిక వర్గం దన్ను కోసం కోస్తాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇపుడు రాయలసీమకే చెందిన జగన్ సీఎం గా ఉన్నారు. దాంతో కొత్త డిమాండ్లు పుట్టుకువస్తున్నాయి.

సీమను రెండో రాజధానిగా….

కాంగ్రెస్ లో పుట్టి పెరిగి మంత్రిగా కూడా పనిచేసిన సీమ వాసి, కర్నూల్ పెద్దాయన టీజీ వెంకటేష్ తాజాగా ఈ డిమాండ్ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నపుడు కానీ, చంద్రబాబు టీడీపీలో పనిచెసినపుడు కానీ ఈ డిమాండ్ తేలేదు కానీ ఇపుడు జగన్ ఇలా ముఖ్యమంత్రి అయ్యారో లేదో అలా సీమ గుర్తుకువచ్చింది. అక్కడ రెండవ రాజధాని పెట్టాలని వెంకటేష్ అంటున్నారు. ఈ మధ్యనే బీజేపీలో చేరిన ఈ రాజ్యసభ సభ్యుడు రాజకీయానికి అపుడే పదును పెడుతున్నారు. సీమను రెండవ రాజధాని చేసేనే తప్ప మనుగడ లేదని ఆయన అంటున్నారు. విభజనతో సీమ అన్ని విధాలుగా నష్టపోయిందని కూడా అయన చెబుతున్నారు. అభివృధ్ధి అంతా ఒకే చోట ఉండిపోతోందని కూడా విశ్లేషిసున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ టీడీపీలో ఉంటూ బాబు మెప్పు పొందిన సమయంలో ఏకంగా రాజధానినే సీమకు ఎందుకు కోరలేదని వైసీపీ నేతలు అంటున్నారు. అది కాకున్నా హై కోర్టునైనా ఎందుకు తీసుకురాలేకపోయారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇపుడు పార్టీ మారినా చంద్రబాబుకు ఉపయోగపడేలా రాజకీయం చేయాలనుకోవడమే ఇందుకు కారణం తప్ప ప్రాంతం మీద టీజీకి ప్రేమ లేనేలేదని అంటున్నారు.

అసలది సాధ్యమేనా…?

జగన్ రాయలసీమ బిడ్డ. బాబుతో పోలిస్తే ఆయనకు సీమ సెంటిమెంట్ చాలా ఎక్కువ. ముఖ్యమంత్రిగా జగన్ ప్రాంతాలకు అతీతంగా ఆలోచించినా వెనకబడిన సీమకు చేయలన్న తపన మాత్రం చాలా ఉంది. అందుకే ఆయన గోదావరి, క్రిష్ణా నదుల అనుసంధానం అంటున్నారు. ఇక హైకోర్టు బెంచ్ కూడా సీమలో పెట్టాలనుకుంటున్నారు. వీటికి తోడు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా సిధ్ధపడుతున్నారు. పరిశ్రమలు కూడా ఎక్కువగా సీమకు రావాలని ఆయన గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీమ విషయంలో జగన్ ఇలా అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే జగన్ దూకుడు రాజకీయం చేస్తారని పేరు. టీజీ వెంకటేష్ డిమాండ్ ఏ కారణంగా చేసినా అవసరం అనుకుంటే మాత్రం జగన్ రాయలసీమకు రెండవ రాజధాని మంజూరు చేసినా చేస్తారు. అదే సమయంలో ప్రాంతీయ విభేదాలు లేకుండా ఉత్తరాంధ్రాలోనూ మూడవ రాజధాని ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. మొత్తానికి జగన్ ని ఇరుకున పెట్టాలని చూస్తే మాత్రం ఆయన రివర్స్ పంచ్ వేసే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News