ఆయనకు జగన్ రాసిచ్చారట

విశాఖ అర్బన్ జిల్లాలో ఉత్తరం సీటు మరో మారు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా ఉంది. ఈ సీటుకు అంత రాజకీయ ప్రాధాన్యత ఎందుకంటే మాజీ [more]

Update: 2019-12-10 05:00 GMT

విశాఖ అర్బన్ జిల్లాలో ఉత్తరం సీటు మరో మారు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా ఉంది. ఈ సీటుకు అంత రాజకీయ ప్రాధాన్యత ఎందుకంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓటమి ఎరుగని నేతగా గంటా శ్రీనివాసరావు రికార్డుని కాపాడిన పుణ్యం కూడా ఉత్తరానిదే. గంటా శ్రీనివాసరావు ఉత్తరం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అసలైన అధికార‌ హవా అంతా ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ ఇంచార్జి కేకే రాజుదే. జగన్ కి అత్యంత సన్నిహితుడైన ఈ రియల్ ఎస్టేట్ బడా వ్యాపారి చావో రేవో అన్నట్లుగా 2019 ఎన్నికల్లో పోరాడి కేవలం మూడు వేల ఓట్ల తేడాతో పరాజయం పాలు అయ్యారు. ఆయన్ని ఇంచార్జిని చేయడం ద్వారా తమ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా జగన్ రాజునే గుర్తించేశారు. దాంతో ఉత్తరంలో రాజు గారి హోదాయే ఒక్కసారిగా మారిపోయింది.

పోటా పోటీగా…

వారం రోజుల తేడాలోనే ఉత్తర నియోజకవర్గంలో ఇద్దరు కీలకనేతల పుట్టిన రోజుల వేడుకలు జరిగాయి. గంటా శ్రీనివాసరావు బర్త్ డే మొదట వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడా దర్జా తగ్గకుండా ఆయన దూకుడు ప్రదర్శిస్తే ఇపుడు కేకే రాజు వంతు. ఆయన కూడా తన పుట్టిన రోజును ప్రజల పండుగ చేశారు. అసలే పార్టీ అధికారంలో ఉంది. దాంతో ఉత్తరం అంతటా హడావుడి చేశారు. వైసీపీ మొత్తం నేతలు ఆయన చుట్టూ చేరి అభినందనల వర్షం కురిపించేశారు. ఫ్లెక్సీలు, కటౌట్లు, జెండాలు హడావుడి… ఇక చెప్పనక్కరలేదు. మొత్తం మీద కేకే రాజు పుట్టిన రోజు అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే లెవెల్లో సాగిపోవడం విశేషం. పార్టీ పవర్లో ఉండడంతో రాజు తన అసలు పవర్ ఇదీ అని గట్టిగా చాటి చెప్పేశారు.

ఎమ్మెల్యేనేనట…..

ఇక వైసీపీ నేతలు సైతం కేకే రాజుని ఓడిపోయిన నేతగా ఎక్కడా చూడడంలేదు. ఆయనే తమ ఎమ్మెల్యే అంటున్నారు. పైగా గంటా శ్రీనివాసరావు ప్రతిపక్షంలో ఉండడం, నియోజకవర్గంపైన సరిగ్గా దృష్టి పెట్టకపోవడంతో రాజుకు బాగా కలసివచ్చింది. ఆయన చెప్పినట్లే ప్రభుత్వ అధికారులు కూడా పనులు చేస్తున్నారు. నియోజకవర్గంలో అధికారులతో సమీక్షలు చేస్తూ అభివృధ్ధిని అంతా తానే చేశానని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు ఆయనకు విజయసాయిరెడ్డి వంటి వారి అండ కూడా దొరకడంతో రాజు గారు ఓడినా మహారాజేనని అంటున్నారు. అందువల్లనే తన దర్జాని ప్రత్యర్ధికి చాటి చెప్పడం కోసం గంటా శ్రీనివాసరావుతో పోటీగా ఎన్నడూ లేని విధంగా కేకే రాజు బర్త్ డే సెలబ్రేషన్లు చేసుకున్నారని అంటున్నారు. మొత్తానికి విశాఖ జిల్లాలో ఏ సీటుకూ లేని వేడి వాడి ఉత్తరంలో ఉందని అంటున్నారు. మరి గంటా శ్రీనివాసరావు రేపు రూట్ మార్చి వైసీపీలోకి వస్తే అపుడు రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో చూడాలి. ఇపుడు మాత్రం రాజు గారు ప్రత్యర్ధికి గట్టి సవాలే విసురుతున్నారు. ఓడినా వాడలేదని చెప్పకనే చెబుతున్నారు.

Tags:    

Similar News