ఫ్యాన్ తిరిగితేనే…?

అంద‌క అందిన అధికారం వైసీపీ నేత‌ల‌ను ఆనందంలో ముంచెత్తుతోంది. తాము మంత్రులం అయ్యామ‌ని కొంద‌రు మురిసిపోతున్నారు. ఇక‌, వైఎస్ జ‌గ‌న్ మిన‌హా 150 మంది ఎమ్మెల్యేలుగా గెలిచామ‌ని [more]

Update: 2019-09-09 03:30 GMT

అంద‌క అందిన అధికారం వైసీపీ నేత‌ల‌ను ఆనందంలో ముంచెత్తుతోంది. తాము మంత్రులం అయ్యామ‌ని కొంద‌రు మురిసిపోతున్నారు. ఇక‌, వైఎస్ జ‌గ‌న్ మిన‌హా 150 మంది ఎమ్మెల్యేలుగా గెలిచామ‌ని ఉబ్బిత‌బ్బిబ్బ‌వు తున్నారు. అయితే, తాము గెలిచేందుకు క్షేత్ర‌స్థాయిలో ఎంద‌రో క‌ష్టించార‌నే విష‌యంవారికి తెలియంది కాదు. ఇక‌, వారి అనుచ‌రులు, త‌మ గెలుపుకోసం కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేసిన వ్యూహ‌క‌ర్త‌లు ఇలా ప్ర‌తి ఒక్క‌రికీ ఇద్ద‌రి నుంచి ముగ్గ‌రు కీల‌క నాయ‌కులు ఉన్నారు. మ‌రి ఇప్పుడు వీరు గెలిచి, ప‌ద‌వుల్లోకి వ‌చ్చి, అధికారం అనుభ‌విస్తుంటే.. వారు మాత్రం ఊరుకుంటారా? అలాగ‌ని వారికి మొండి చూపించి వీరు మాత్రం చేసేది ఏముంటుంది.

స్థానిక సంస్థలకు….

ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని నామినేటెడ్ ప‌ద‌వుల్లో త‌మ వారికి చోటు ఇవ్వాల‌ని ఎమ్మెల్యేలు మంత్రుల‌పై నా.. మంత్రులు వైఎస్ జ‌గ‌న్ పై ఒత్తిళ్లు పెంచారు. వాస్త‌వానికి ఏ పార్టీ ప్ర‌భుత్వంలోకి వ‌చ్చినా.. నామినేటెడ్ ప‌ద వుల‌ను వారి వారికి ఇవ్వ‌డం స‌హజం. ఈ క్ర‌మంలోనే వారు ఆశించ‌డం త‌ప్పుకాదు. వైఎస్ జ‌గ‌న్ ఇవ్వ‌డాన్ని కూడా త‌ప్పుప‌ట్టలేం. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర స్థాయిలో కొన్ని కీలక పోస్టులను భర్తీ చేసారు. ఇక, నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం మంత్రులు ప్రస్తావించగా.. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులకు..స్థానిక సంస్థల ఎన్నికలకు ముడి పెట్టారు. పదవుల కోసం నెలకొని ఉన్న ఒత్తిడి..స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కోసమే వైఎస్ జ‌గ‌న్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

సీనియర్లకు మాత్రం….

పార్టీలో సీనియర్లు, ముఖ్యులకు మాత్రం కొన్ని నామినేటెడ్‌ పదవులను ఈలోపే లభించే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య, నియోజకవర్గాల వారీగా భారీగా పెరిగింది. ప్రతీ నియోజకవర్గానికి సరాసరిన ఇద్దరు, ముగ్గురు సీనియర్లు, ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన నేతలు నామినేటెడ్‌ పదవులను ఆశిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే గెలిచిన ఎమ్మెల్యేలు త్వరలోనే మనవాళ్ళందరికీ నామినేటెడ్‌ పోస్టులు ఖాయమంటూ ప్రచారం చేశారు.దీంతో ఇప్పుడు వీరంతా త‌మ వారికి ప‌ద‌వులు ఇప్పించుకునేందుకు వైఎస్ జ‌గ‌న్ వద్ద ప్ర‌యాస ప‌డుతున్నారు.

సత్తా చూపిస్తేనే….

అయితే, వైఎస్ జ‌గ‌న్ మాత్రం.. ఎవ‌రికి నామినేటెడ్ ప‌ద‌వులు కావాల‌న్నా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించుకోవాల‌ని ఆయ‌న ష‌ర‌తు విధించిన‌ట్టు స‌మాచారం. ఎవ‌రు పార్టీని బ‌లంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలిపించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జెండా రెప‌రెప‌లాడిస్తారో.. వారికే కోరిన ప‌ద‌వి ల‌భిస్తుంద‌ని వైఎస్ జ‌గ‌న్ అంటున్నారు.దీంతో ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల‌పై ఎడ‌తెగ‌ని భారంప‌డింద‌ని అంటున్నారు. అయితే, ఈ ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికిప్పుడే ముహూర్తం కూడా ఖ‌రారు చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఈ అంశంపై చ‌ర్చిస్తున్న వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మ‌రింత సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డే వ‌ర‌కు స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అంటే వ‌చ్చే ఏడాదే వీటిని నిర్వ‌హించ‌నున్న‌ట్టు తాజా స‌మాచారం. దీంతో వీరి ఆశ‌లు ఫ‌లించేందుకు క‌నీసం ఆరు నుంచి 8 మాసాలు ప‌డుతుంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News