జైలుకు వెళ్తారనేనా..?

అదేంటో తెలియదు కానీ జగన్ గద్దెనెక్కిన దగ్గర నుంచి ఏపీలోని విపక్షాలు అపశకునాలే పలుకుతున్నాయి. మూడేళ్ళలో ఎన్నికలు వస్తాయని టీడీపీ పిల్లి జోస్యాలు చెబుతూంటే, జగన్ ది [more]

Update: 2019-11-15 02:00 GMT

అదేంటో తెలియదు కానీ జగన్ గద్దెనెక్కిన దగ్గర నుంచి ఏపీలోని విపక్షాలు అపశకునాలే పలుకుతున్నాయి. మూడేళ్ళలో ఎన్నికలు వస్తాయని టీడీపీ పిల్లి జోస్యాలు చెబుతూంటే, జగన్ ది కూల్చివేతల ప్రభుత్వం అది కూలిపోతుందంటూ పవన్ శాపాల మీద శాపాలు పెడుతున్నారు. మరి పవన్ ఒకే మాటను పదే పదే అంటున్నారంటే జగన్ ముఖ్యమంత్రిగా పూర్తికాలం కొనసాగరని ఆయనకేమైనా సంకేతాలు ఉన్నాయా? లేక ఏదో పనిగట్టుకుని అనాలని అక్కసుతో అంటున్నారా అన్నది చర్చగా ఉంది. విశాఖ లాంగ్ మార్చ్ లో కూడా పవన్ జగన్ సర్కార్ ఎక్కువ కాలం ఉండదని అనేశారు. ఇపుడు తాజాగా మరో మారు జగన్ పరిస్థితి అటు ఇటు అయితే వైసీపీ ఎమ్మెల్యేల సంగతేంటని అంటున్నారు. అంటే జగన్ పరిస్థితి ఇపుడు ఎలా ఉంది. అది అటూ ఇటూ ఎందుకు అవుతుంది. ఈ సందేహాలను జనాల్లో అలా ఉంచుతూనే పవన్ తన విమర్శలను ఎపుడూ కొనసాగించడమే విశేషం.

జైలుకి వెళ్తారనేనా?

జగన్ మీద కేసులు 2011 నుంచి ఉన్నాయి. ఇప్పటికి ఎనిమిదేళ్ళుగా జగన్ ఆ కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల ముందు జగన్ జైలు నుంచి విడుదలై వచ్చినా కూడా జగన్ బాగానే ఆదరించారు. ఆయన పార్టీకి 67 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. సరైన రాజకీయ వ్యూహం లేక అధికారం నాడు చేజారింది తప్ప జగన్ ఓడిపోలేదని రాజకీయ విశ్లేషకులు సైతం అంటారు. ఇక 2019 వచ్చేనాటికి ఏపీలో మొత్తం సీట్లను జగన్ వూడ్చేశారు. ఈ మధ్యలో ప్రతీసారి కూడా జగన్ కోర్టు మెట్లు ఎక్కుతూనే వచ్చారు. అయినా సరే జనాలు జగన్ని ముఖ్యమంత్రిని చేశారు. మరి అటువంటిది జగన్ పరిస్థితి ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా బాగా ఉంటుంది కానీ అటూ ఇటూ ఎందుకు అవుతుందన్నదే పెద్ద ప్రశ్న. మరి జగన్ కేసు చూస్తే ట్రయిల్ కోర్టులోనే ఇంకా విచారణ దశలో ఉంది. మరి ఇంతలోనే ఈ కేసు తొందరగా పరుగులు తీసి జగన్ దోషి అని చెప్పేస్తే ఆయన జైలుకి వెళ్తారనా పవన్ ఈ మాటలు అంటున్నది అన్న మాట కూడా వినిపిస్తోంది.

బలహీనమా.. బలమా?

ఇక జగన్ మీద పెట్టిన కేసులు బలహీనమైనవని తలపండిన న్యాయ కోవిదులు కూడా చెబుతున్నారు. జగన్ కేసులో పన్నెండు చారిషీట్లు వేసి ఏళ్ళ తరబడి విచారణ జరుపుతున్నా కూడా కధ ఇంకా కంచికి చేరలేదు. దీని మీద రాజకీయ విశ్లేషకుల వాదన మరోలా ఉంది. జగన్ నిజంగా తప్పు చేస్తే నాటి యూపీయే కానీ, నేటి మోడీ సర్కార్ కానీ ఇన్నాళ్ల వరకూ వూరుకుంటాయా జగన్ని ఏనాడో జైలుకు పంపేవారు కదా అంటున్నారు. మరో వైపు ఈ కేసు 2004 నుంచి 2009 మధ్యలో వచ్చిన ఆరోపణల మీద పెట్టారు. అప్పట్లో జగన్ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు. ఇక ఒక్క సంతకం కూడా ఆయనది లేదు అధికారులతో కలసి ఉన్న ఆధారాలు లేవని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు.

పెద్దల వ్యూహం ఉందా?

ఇక జగన్ అక్రమాస్తులు మొదట లక్ష కోట్లు అన్నారు. దాని మీద మాజీ టీడీపీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, దాడి వీరభద్రరావు లాంటి వారు భారీగా ఉంటుందనే ఈ ఫిగర్ వేశామని అప్పట్లోనే చెప్పారు. ఇక జనసేన నుంచి తాజా ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ సైతం జగన్ కేసులో 1300 కోట్ల అక్రమాస్తుల మీదనే దర్యాప్తు అని కూడా చెప్పేశారు. ఇవన్నీ ఇలా ఉంటే మరి పవన్ ఎందుకో పదే పదే జగన్ జైలుకు వెళ్తారన్న అర్ధం వచ్చేలా మాట్లాడ‌డం బట్టి చూస్తూంటే రాజకీయంగా జగన్ ని ఇబ్బంది పెట్టే వ్యూహం తెర వెనక ఏదైనా జరుగుతోందా అన్న అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో తనకు కేంద్ర పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటున్న పవన్ ఈ కామెంట్స్ చేయడంతోనే ఆ డౌట్లు ఇంకా పెరుగుతున్నాయి. పవన్ మాటల వెనక ఆవేశం ఉందా, ఎవరైనా పెద్దల వ్యూహం ఉందా అన్నది చూడాలి మరి.

Tags:    

Similar News