అంతా ఎదురీత… అధికారంలో ఉన్నా?

‘మాట తప్పను. మడమ తిప్పను’ అన్న నినాదం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కి ఒక ట్యాగ్ లైన్ వంటిది. ఆ సూత్రాన్ని నరనరాన జీర్ణించుకున్ పార్టీ పదో [more]

Update: 2020-03-12 15:30 GMT

‘మాట తప్పను. మడమ తిప్పను’ అన్న నినాదం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కి ఒక ట్యాగ్ లైన్ వంటిది. ఆ సూత్రాన్ని నరనరాన జీర్ణించుకున్ పార్టీ పదో ఏట ప్రవేశించింది. తొలి ఎనిమిది సంవత్సరాలు ఎదురీత నుంచే పార్టీ రాటుదేలింది. జాతీయ పార్టీలు, బలమైన ప్రాంతీయ పార్టీని ఎదిరించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక రికార్డు విజయం సాధించింది. ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఎనిమిదేళ్ల పాటు అవిరామ రాజకీయ పోరాటం సాగించి అధికారపథానికి చేరడం చిన్నవిషయం కాదు. అందులోనూ దేశ రాజకీయాల్లోనే అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీకి ఘోరపరాజయాన్ని చవిచూపించడం ఒక సాధారణ పొలిటికల్ సంఘటన కాదు. దీని వెనక సాగించిన కృషి, ప్రజాభిమానం కచ్చితంగా గమనించదగ్గవే. ప్రాంతీయ రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలూ ఇందులో దాగి ఉన్నాయి.

ఆత్మాభిమానం..ఆగ్రహం..

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భావం జాతీయ పార్టీలకు ఒక చెంపపెట్టుగానే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అడుగు జాడల్లో ఒక రాజకీయ నాయకునిగా పురుడు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీలోనే. ఆ పార్టీ తొలి నుంచి ప్రాంతీయ నాయకులపట్ల చిన్నచూపు కనబరుస్తూనే వచ్చింది. 1980లలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపనకు కారణాల్లో అది కూడా ఒకటి. అదే విధంగా సొంతపార్టీ నాయకుడైన జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పుయాత్రకు బ్రేక్ వేయాలని చూసింది. ఏపీలోని కొందరు నాయకులు అసూయతో చేసిన ఫిర్యాదులకు అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చింది. అదే సమయంలో తండ్రి మరణం సానుభూతితో జగన్ రాజకీయంగా ఎదిగిపోతాడని భావించింది. జగన్ లో ఉన్న పొలిటికల్ పొటెన్షియాలిటీని గుర్తించడానికి నిరాకరించింది. ఆత్మాభిమానం దెబ్బతిన్న జగన్ పార్టీని ధిక్కరించారు. తానే ఒక శక్తిగా , వ్యవస్థగా , పార్టీగా రూపాంతరం చెందాడు. ఇది కాంగ్రెసు స్వయంకృతాపరాధం.

అడుగడుగునా ఎదురీత…

పార్టీ స్థాపించినంత మాత్రాన నల్లేరుపై బండి నడక మాదిరిగా జగన్ ప్రస్థానం సాఫీగా సాగిపోలేదు. క్విడ్ ప్రో కో కేసులు పట్టి పీడించాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ఊరకనే వదిలిపెట్టలేదు. చాలా రకాలుగానే వేధించింది. దాంతో పాటు బలమైన ప్రత్యర్థిగా మారతాడని భావించిన తెలుగుదేశమూ జగన్ ను టార్గెట్ చేసింది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు, సీబీఐ కేసులు ఏతావాతా నిర్బంధపరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. విచారణలో భాగంగా జగన్ కు 16 నెలలపాటు జైలులో గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. సమస్యలు, సవాళ్లు నాయకుడిని రాటుదేలేలా చేస్తాయి. జగన్ విషయంలోనూ అదే జరిగింది. అన్ని వైపులా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ మొండి ధైర్యంతోనే ముందడుగు వేశారని చెప్పాలి. పార్టీ స్థాపించిన తొలినాళ్లలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రభావాన్ని చూపుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. 2012 ఉప ఎన్నికల్లో సానుభూతి ప్రభంజనం వీచింది. 18స్థానాలకు గాను 15 స్థానాలు గెలుచుకొంది. అయితే 2014 రాష్ట్ర విభజన వైసీపీపై పెను ప్రభావమే చూపింది. జనసేన, బీజేపీతో జట్టుకట్టిన తెలుగుదేశం పార్టీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో అనూహ్యమైన విజయాన్ని సాధించింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇదొక పెద్ద ఎదురుదెబ్బ. ముఖ్యమంత్రి పీఠం ఎక్కడమే తరువాయి అనుకుంటున్న పరిస్థితుల్లో పార్టీ చేదు ఫలితాన్ని చవిచూసింది. ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.

ప్రజాసంకల్పం…

వ్యూహ నైపుణ్యంలో ఎంతో ఘటికుడైన చంద్రబాబు నాయుడి ఎత్తుగడలను ఎదుర్కొంటూ వైసీపీ మనుగడ సాగించడమే కష్టమని రాజకీయ మేధావులు తొలుత భావించారు. టీడీపీ అధినేత వైసీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేయాలనే దిశలోనే పావులు కదిపారు. 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. వైసీపీ శ్రేణుల్లో నైతిక స్తైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీకి భవిష్యత్ లేదనే సూచనలను ప్రజల్లోకి పంపాలనుకున్నారు. ఒకరకంగా చూస్తే టీడీపీ అనైతిక పద్ధతులు వైసీపీకి కలిసొచ్చాయి. శాసనసభను 2017 నవంబర్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా పోయింది. తద్వారా ప్రభుత్వంపై తీవ్రస్థాయి అవిశ్వాసాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రకటించగలిగారు. దాంతో పాటు తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి 2017 నవంబర్ ఆరో తేదీ నుంచి ప్రజాసంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 14 నెలలపాటు 3648 కిలోమీటర్ల మేరకు సాగిన ఈ పాదయాత్ర రాజకీయ పార్టీగా వైసీపీకి టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవాలి.

అత్యధిక మెజారిటీతో…..

2003లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానంతో కాంగ్రెసును అధికారానికి తెచ్చారు. అదే విధంగా జగన్ ప్రజాసంకల్పం వైసీపీకి ఉపకరించింది. 175 స్థానాల అసెంబ్లీలో 151 సీట్లతో విజయాన్ని కైవసం చేసుకొన్నారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణకు ఈ ఎన్నికలు దర్పణం పట్టాయి. ముఖ్యంగా అధినేత జగన్ కృషికి లభించిన ఫలితంగా చెప్పుకోవాలి. గడచిన తొమ్మిదినెలలుగా అధికారంలో సంక్షేమ పథకాలకే పెద్దపీట వేస్తూ తనకు లభించిన ఆదరణకు కృతజ్ణతలు ప్రకటించే పనిలో నిమగ్నమైంది వైసీపీ. వైసీపీ తొలి నుంచి సవాళ్లను ఎదుర్కొంటూ ఎదురీతతోనే సాగుతోంది. ఇప్పుడు కూడా ప్రభుత్వంలోనూ ఆ బాధ్యత తప్పేట్లు లేదు. కొత్త రాష్ట్రం, ఆర్థిక సమస్యలు సవాల్ విసురుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడితే దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేరవు. అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకొంటేనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుంది. అప్పుడే పార్టీగా వైసీపీ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోగలుగుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News