బీజేపీతో జగన్ కు చెడితే ?

జగన్ కి బీజేపీతో అర్జంట్ గా చెడిపోవాలి. అది కాస్తా పూర్తి అయితే చంద్రబాబు మళ్ళీ పులి అయిపోతారు. ఆయనకు రాజకీయంగా ఆలంబన దొరుకుతుంది. ఏపీలో కచ్చితంగా [more]

Update: 2020-06-04 03:30 GMT

జగన్ కి బీజేపీతో అర్జంట్ గా చెడిపోవాలి. అది కాస్తా పూర్తి అయితే చంద్రబాబు మళ్ళీ పులి అయిపోతారు. ఆయనకు రాజకీయంగా ఆలంబన దొరుకుతుంది. ఏపీలో కచ్చితంగా బీజేపీ తెలుగుదేశంతో కలసి ముందుకుసాగుతుంది. ఇవన్నీ మరో నాలుగేళ్ళలో ఎలాగోలా జరుగుతాయనుకున్నా జగన్ మెడ మీద కత్తి పెట్టి ఆయన మీద ఉన్న సీబీఐ కేసులకు వేగం పెంచి ఇబ్బందులు పెట్టవచ్చు. వీలు అయితే బెయిల్ కూడా రద్దు చేయించవచ్చు. ఇక జగన్ తో చెడుగుడు ఆడుకోవచ్చు. ఇది కదా ఆయన ప్రత్యర్ధి పార్టీల ఆలోచన. అయితే ఎందుకో కానీ చంద్రబాబు దోస్తీగా ఉన్నపుడు కూడా బీజేపీ జగన్ ని పెద్దగా ఇబ్బందులు పెట్టలేదు. చంద్రబాబు కోరుకున్నట్లుగా మళ్లీ జైల్లో పెట్టలేదు.

కోపం దానికేనా…?

నిజానికి బీజేపీ మీద బాబుకు పీకల మీద కోపం ఉండడానికి అసలు కారణం జగన్ విషయంలో కేంద్రం నాడు చూసీచూడనట్లుగా వదిలేయడం. అంతే కాదు, ఆయనకు తరచూ ప్రధాని మోడీ అపాయింట్ మెంట్లు ఇవ్వడం. జగన్ ని ఏపీలో తన మీదకు ఎగదోయడం. ఈ కారణాల వల్లనే మోడీ సర్కార్ మీద బాబు అంతలా కోపం పెంచుకున్నారని అంటారు. దానికి ప్రత్యేక హోదా మసాలా కలిపి ఎన్నికలకు ఏడాది ముందు ఉందనగా బయటకు వచ్చి మోడీ మీద విరుచుకుపడ్డారు. అయితే అన్నిరకాలుగా నష్టపోయింది తెలుగుదేశమే. మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చారు, ఇక్కడ జగన్ బంపర్ మెజారిటీతో గెలిచాడు. అన్ని విధాలుగా ఇక్కట్లు పడిన తరువాత సీన్ అర్ధమైన బాబు మళ్ళీ బీజేపీకి చేరువ కావాలన్న ఆలోచనలో ఉన్నారు.

చిచ్చు రగిలిందా…?

ఇక ఏపీ వరకూ చూసుకుంటే బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ జగన్ మీద విరుచుకుపడుతున్నా బీజపీ హై కమాండ్ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. కానీ తెలంగాణా నుంచి బండి సంజయ్ ఏపీలోని టీటీడీ భూముల విషయంలో గర్జించారు. ఆయన జగన్ మీద తొలిసారిగా దాడి చేశారు. భూములు అమ్మడానికి ఎవరు మీకు అధికారం ఇచ్చారు అని కూడా ప్రశ్నించారు. అంతే కాదు, పవన్ తో కలసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పోరాడుతామని కూడా అంటున్నారు. ఏపీలో క్రైస్తవ రాజ్యం అని కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఇవన్నీ చూసుకున్నపుడు బండి సంజయ్ ద్వారా బీజేపీ హై కమాండ్ ఏమైనా పావులు కదుపుతోందా అనిపించకమానదు. బండి సంజయ్ అంటే జాతీయ నాయకత్వానికి బాగా గురి. అక్కడ కేసీయార్ మీదకు ఆయన్ని ప్రయోగించింది కూడా బీజేపీ పెద్దల చాణక్యమే. ఇపుడు అదే సంజయ్ ఏపీ మీద కూడా చూపు విసిరారంటే దీని వెనక బీజేపీ ఢిల్లీ నేతల హ‌స్తం లేకుండా ఉందని చెప్పలేమని అంటున్నారు.

ఇబ్బందేనా…?

బీజేపీకి ఏ పార్టీ మీద వ్యక్తి మీద ప్రత్యేకమైన అభిమానాలు ఉండవు. అది అందరికీ తెలిసిందే. వారికి తమ రాజ్య విస్తరణే ధ్యేయం. దానికి సమయం సందర్భం కలసివస్తే మాత్రం చాలా వేగంగా పావులు కదిపి కధను కంచికి చేరుస్తారు. ఇపుడు ఏపీలో జగన్ ని ఇబ్బంది పెట్టాలనుకుంటే హిందూ కార్డు తీయడమే మార్గం అనుకుంటే దానికి పదును పెడతారు కూడా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవుడు విషయంలో భక్తుల సెంటిమెంట్లు అందరికీ తెలిసిందే. దాంతో జగన్ ని అలా సైడ్ చేయాలనుకుంటే మాత్రం వైసీపీ అధినేతకు కొత్త సవాళ్ళు తప్పవు. ఏడాది పాలన పూర్తి చేసుకుని రెండవ ఏడాదిలోకి అడుగుపెడుతున్న జగన్ కి బీజేపీ పెద్దల ఆగ్రహమే ఆశీర్వాదమైతే మాత్రం ఏపీ రాజకీయ కధలో ఎన్నో మలుపులూ, పిలుపులూ ఉంటాయన్న విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News