గురి జగన్ పైనే

రాష్ట్రంలో రాజకీయవ్యూహాలు పదునుదేలుతున్నాయి. జనసేన, బీజేపీల కొత్త కూటమి నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు భిన్న ధోరణులతో స్పందిస్తున్నాయి. భవిష్యత్ అవకాశాలను బేరీజు వేసుకుంటూ ఆప్షన్లను అట్టే పెట్టుకుంటున్నాయి. [more]

Update: 2020-01-17 15:30 GMT

రాష్ట్రంలో రాజకీయవ్యూహాలు పదునుదేలుతున్నాయి. జనసేన, బీజేపీల కొత్త కూటమి నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు భిన్న ధోరణులతో స్పందిస్తున్నాయి. భవిష్యత్ అవకాశాలను బేరీజు వేసుకుంటూ ఆప్షన్లను అట్టే పెట్టుకుంటున్నాయి. మూడో ప్రత్యామ్నాయం తామేనంటూ కూటమి కట్టిన జనసేన, బీజేపీలను అధికార, ప్రతిపక్షాలకు బహిరంగ సవాల్ గానే చెప్పాలి. ఈ పొత్తు బలం ఎంత అనేది ప్రజాక్షేత్రంలో తేలాల్సి ఉన్నప్పటికీ ముందస్తుగా సిద్ధం చేసుకున్న కార్యాచరణ మాత్రం ఆసక్తి రేపుతోంది. బీజేపీ, జనసేనల యాక్షన్ ప్లాన్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ముడిపడి ఉండటంతో డ్యూయల్ గేమ్ కు ఆస్కారం ఏర్పడుతోంది.

బీజేపీపై వైసీపీ మెతక వైఖరి…

పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుంటూ గత కొంతకాలంగా వైసీపీ సర్కారు తీవ్రమైన దూకుడునే ప్రదర్శిస్తోంది. జనసేనానిని వ్యక్తిగతంగా విమర్శించడమే కాకుండా ఆ పార్టీ శ్రేణులపై అక్కడక్కడా దాడులకు పాల్పడుతున్న ఉదంతాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. దాంతో ఒక బలమైన రాజకీయ అండ తీసుకోవాల్సిన అనివార్యత జనసేనకు ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపితే అధికార వైసీపీని దీటుగా ఎదుర్కోగలమనే అంచనాకు పవన్ కల్యాణ్ వచ్చారు. ఒక రాజకీయ అనివార్యతే బీజేపీతో వెళ్లేందుకు జనసేనకు మార్గం వేసిందని చెప్పాలి. ప్రత్యేక హోదా వంటి అంశాలను పక్కనపెట్టి మరీ కూటమి కట్టాల్సి వచ్చింది. పరస్పర ప్రయోజనాల కోసమే ఈ రెండు పార్టీలు కలిశాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణం అందుకు దోహదం చేసింది. బీజేపీతో కలవడం పవన్ కు ఎంత తక్షణ అవసరమో ఒక జనసమ్మోహక శక్తి కావాల్సి రావడం బీజేపీకి అంతే అవసరం. కమలం అండతో జనసేనకు నైతిక స్థైర్యం లభించింది. బీజేపీ కి ఒక ప్రచారసారథి, జనాన్ని ఆకర్షించి పార్టీ విస్తరణకు దోహదపడగల వ్యక్తి లభించినట్లయింది. ఈ కూటమికి మొదటి టార్గెట్ అధికార వైసీపీనే. అయినప్పటికీ పవన్ కల్యాణ్ పైనే ఇప్పటికీ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ పై దూకుడు ప్రదర్శించలేకపోతోంది. ఇక్కడే వైసీపీ రాజకీయ వ్యూహం తేటతెల్లమవుతోంది.

పవన్ పై టీడీపీ అదే ధోరణి…

భవిష్యత్తులోనూ టీడీపీ, వైసీపీలతో తమకు తెర వెనుక, తెర ముందు పొత్తు ఉండదని బీజేపీ అగ్రనాయకత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో తమ పార్టీ దారుణంగా దెబ్బతినడానికి టీడీపీ ప్రధానకారణమనే భావన బీజేపీలో ఉంది. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సానుభూతిపరులు సైతం వైసీపీకి అండగా నిలిచారనే వాదన ఉంది. ఇప్పటికీ మెజార్టీ బీజేపీ నాయకులు టీడీపీతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకోవడానికి వ్యతిరేకంగా ఉన్నమాట ఒక వాస్తవం. మరోవైపు వైసీపీని ఎదుర్కోవాలంటే జనసేన, టీడీపీ, బీజేపీ భవిష్యత్తులో కలిసి నడవకతప్పదనే వాదనా ఉంది. అప్పుడు 2014 ముఖచిత్రం తప్పదు. అదే జరిగితే ఇప్పటికే వైసీపీ చేస్తున్న విమర్శలకు బలం చేకూరుతుంది. ఈ విమర్శ ఎదురుకాకుండా ముందుగానే కూటమి తరఫున వివరణ ఇవ్వాల్సిన అవసరమొచ్చింది. ఈ సమయంలో బీజేపీ, జనసేన కూటమిపై టీడీపీ చాలా జాగ్రత్తగా , లౌక్యంగా స్పందిస్తోంది. పవన్ తో భవిష్యత్ చెలిమి అవకాశాలను దెబ్బతీసుకోవడానికి ఇష్టపడటం లేదు. కానీ బీజేపీని ఇరుకున పెట్టేందుకు కొంత ప్రయత్నిస్తోంది. ‘రాష్ట్ర విభజన, ప్రత్యేకహోదా, పునర్విభజన చట్టం అమలు వంటి విషయాల్లో బీజేపీ పోషించిన పాత్ర అందరికీ తెలిసిందే ’ అంటూ చాలా తెలివిగా బీజేపీ వైపు వేలెత్తి చూపేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. పవన్ విషయంలో మాత్రం కనీస విమర్శకు సైతం దిగడం లేదు.

కూటమి ఖాతాలో…

రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ముఖాముఖి మోహరించి ఉన్న పరిస్థితి. అందువల్ల మూడోపక్షానికి రాజకీయ అవకాశాలు అంతంతమాత్రమే. అందులోనూ సార్వత్రిక ఎన్నికలు జరిగి ఆరునెలలు మాత్రమే అయింది. అయితే రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ వాతావరణం కొత్త కూటమికి ఆప్షన్ వచ్చింది. మూడు రాజధానుల ముచ్చట, పోలవరం పనుల నిలిపివేత, స్థానిక ఎన్నికలు ఇందులో ప్రధానమైనవి. కేంద్రం కీలక పాత్ర పోషించాల్సిన తరుణం ఇది. మూడు రాజధానుల విషయంలో రాష్ట్రప్రభుత్వ దూకుడు ఉద్యమాలకు, ఆందోళనలకు దారి తీస్తోంది. బీజేపీ, జనసేనలు రెండూ అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. టీడీపీ ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తోంది. అయితే ప్రతిపక్షంలో ఉండటంతో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేయగల స్థాయి, శక్తి లోపించింది. ఈ స్థితిలో రాజధాని తరలింపును అడ్డుకోగల శక్తి కేంద్రానికి మాత్రమే ఉందనేది సర్వత్రా వ్యాపిస్తున్న భావన.

ముకుతాడు వేయగలిగితే….

ఇప్పుడు కొత్త కూటమి రూపంలో కార్యాచరణకు దిగి కేంద్రం సహకారంతో రాష్ట్రప్రభుత్వ దూకుడుకు ముకుతాడు వేయగలిగితే ఆ క్రెడిట్ కచ్చితంగా జనసేన,బీజేపీలకు దక్కుతుంది. రాష్ట్రంలో బలోపేతమైన శక్తిగా నిలిచేందుకు ఒక ప్రాతిపదిక లభిస్తుంది. అయితే రాష్ట్రంలో జనసేనతో చేతులు కలిపి బలపడాలని చూస్తున్న బీజేపీ వైసీపీ సర్కారును కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుందా? అంటే సందేహాలే వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభలో చట్టాల ఆమోదం విషయంలో వైసీపీ సహాయసహకారాలు కేంద్రానికి అవసరం. అటువంటి స్థితిలో రాష్ట్రంలో కూటమి ని బలోపేతం చేసుకొనేందుకు వైసీపీకి చెక్ చెప్పేందుకు సాహసిస్తుందా? అంటే అనుమానమే. ఇది బీజేపీకి పెద్ద సవాల్. కూటమి ప్రజాక్షేత్రంలో పటిష్టం కావాలంటే ఆచరణ రూపంలో ఎంతో కొంత పాజిటివ్ ఫలితాన్ని ప్రజలకు అందించాలి. రాజధాని తరలింపును నిరోధించగలగడం అనేది చేతిలో ఉన్న మొదటి అస్త్రం. ఒకవేళ ఆ దిశలో సాఫల్యం సాధించలేకపోతే కూటమి రాష్ట్రంలో మూడోపక్షంగానే మిగిలిపోతుంది తప్ప వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయం గా తనను తాను ఆవిష్కరించుకోలేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News