జోస్యాలతో జోకొడుతున్నారా?

రాజకీయాల్లో ప్లస్ పాయింట్లు చెప్పి అధికారం సంపాదించడం పాతకాలం నాటి మాట. ఇపుడు ఎదుటి వారి మైనస్సులే తమకు ప్లస్ గా మార్చుకుని కుర్చీ ఎక్కడం కొత్త [more]

Update: 2020-02-14 00:30 GMT

రాజకీయాల్లో ప్లస్ పాయింట్లు చెప్పి అధికారం సంపాదించడం పాతకాలం నాటి మాట. ఇపుడు ఎదుటి వారి మైనస్సులే తమకు ప్లస్ గా మార్చుకుని కుర్చీ ఎక్కడం కొత్త ట్రెండ్ గా మారింది. ఏపీ విషయానికి వస్తే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావడానికి జగన్ పాజిటివ్ ఇమేజ్ కి బాబు సర్కార్ నెగిటివిటీ కూడా బాగా హెల్ప్ అయింది. ఇక మరో నాలుగేళ్లలో జరిగే ఏపీ ఎన్నికల గురించి అపుడే చర్చ సాగుతోంది. ఈసారి వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదంటే రాదని టీడీపీ అధినాయకుడు చంద్రబాబు సహా తమ్ముళ్ళు గట్టి ధీమాగా ఉన్నారు. మా సంగతి సరే కానీ ముందు అంతవరకూ మీ పార్టీ ఉంటుందో లేదో చూసుకోండని వైసీపీ నేతలు గట్టి రిటార్ట్ ఇస్తున్నారు.

అపుడే యాంటీ అట…

జగన్ ఇలా గద్దెనెక్కారో లేదో అలా ప్రజా వ్యతిరేకత వెల్లువలా పొంగిపొర్లుతోందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అంటున్నారు. ఏ ప్రభుత్వానికైనా మూడేళ్ళు పాలన చేశాక కొంత వ్యతిరేకత వస్తుందని, కానీ జగన్ సర్కార్ కి మాత్రం నెల రోజుల్లోనే ఆ వ్యతిరేకత వచ్చిందని నాని విశ్లేషిస్తున్నారు. దానికి కారణం జగన్ ప్రజావేదికను కూల్చడంతో మొదలుపెట్టి అన్ని వ్యవస్థలను కూల్చడమేనని అంటున్నారు. ఇదే మాట మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంటి వారు కూడా గట్టిగా చెబుతున్నారు. జగన్ సర్కార్ కి పొరపాటున అధికారం ఇచ్చామని జగన్ నెత్తీ నోరు బాదుకుంటున్నారని విశాఖ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంటున్నారు.

చీలిక ఖాయమా…?

ఇలా వైసీపీ సర్కార్ మీద తమ్ముళ్ళు సొంత విశ్లేషణ చేసుకుంటూ ఆత్మానందం పొందుతూంటే వైసీపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఓ పెద్ద బాంబు పేల్చారు. టీడీపీలో తొందరలోనే చీలిక వస్తుందట. చంద్రబాబు పార్టీని నడపలేరన్న సాకుతో ఆ తిరుగుబాటు వస్తుందట. చినబాబు సైతం పార్టీకి పనికిరారని, ఈ నేపధ్యంలో అసలు పార్టీ ఉంటుందో ఊడుతుందో ఎవరికి తెలుసు. 2024 నాటికి టీడీపీ రాజకీయ తెర మీద నుంచి అంతర్ధానం కావడం తధ్యమని శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. మంత్రి అనిల్ కుమార్ అయితే మరో అడుగు ముందుకేసి రానున్న రోజుల్లోనే టీడీపీ ఉనికి కోల్పోతుందని జోస్యం చెబుతున్నారు. అంటే టీడీపీ ఇక బతికి ఉండదని, ఎప్పటికీ ఏకపక్షంగా జనం వైసీపీనే గెలిపిస్తాన్నది వైసీపీ పెద్దల ధీమాంగా కనిపిస్తోందన్న మాట.

లోకల్ ఫైట్ తేలుస్తుందా…?

ఇవన్నీ ఆత్మ తృప్తి కోసం చెప్పుకుంటున్న మాటలే. నిజానికి వైసీపీకి ఎంత ప్రజావ్యతిరేకత ఉంది. టీడీపీకి మరెంతటి ఆదరణ ఉంది అన్నది లోకల్ బాడీ ఎన్నికలు తేల్చేస్తానని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ తొమ్మిది నెలల పాలనలో ప్రజలకు ఇబ్బంది లేని నిర్ణయాలు అనేకం తీసుకున్నారని అంటున్నారు. అమరావతి రాజధాని మూడుగా మార్పు, ప్రజావేదిక కూల్చివేత‌ సామాన్య జనానికి సంబంధం లేని విషయాలు అని అంటున్నారు. ఇక సంక్షేమ పధకాలు ఎటూ జగన్ సర్కార్ కి శ్రీరామరక్షగా ఉంటాయని, అయితే అక్కడ కోతలు పెడితే మాత్రం వ్యతిరేకత పెచ్చరిల్లడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇక టీడీపీకి క్షేత్ర స్థాయిలో పట్టుంది కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో కొంత పుంజుకునే అవకాశాలు ఉంటాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు అంటున్నారు. మొత్తం మీద లోకల్ ఫైట్ తరువాత అయినా రెండు పార్టీల అతి ధీమాలు, చిలక జోస్యాలు తగ్గుతాయా అన్నది చూడాలి.

Tags:    

Similar News