రాజకీయమా….. అవసరమా..?

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఇప్పుడు రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న అంశం. అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అధికారపార్టీ చెబుతోంది. రాజకీయ కారణాలతోనే ఇందుకు [more]

Update: 2019-12-19 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఇప్పుడు రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న అంశం. అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అధికారపార్టీ చెబుతోంది. రాజకీయ కారణాలతోనే ఇందుకు పూనుకుంటున్నారని టీడీపీ వాదిస్తోంది. పరిపాలన కేంద్రాన్ని కాదు, అభివృద్ధిని వికేంద్రీకరించాలంటున్నారు మేధావులు. మహానగర నిర్మాణం కాన్సెప్టుతో అమరావతి కి పునాది వేసిన చంద్రబాబు నాయుడు సాకారం చేయలేకపోయారు. ప్రత్యామ్నాయంగా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని మూడు రాజధానులతో ముందుకు నడుపుతామంటున్నారు జగన్. ఇందులోని ఆచరణాత్మకత, సాధ్యాసాధ్యాలు, రాజకీయ కోణాల వంటివన్నీ ప్రజల్లో చర్చకు దారి తీస్తున్నాయి.

పార్టీల్లో మల్లగుల్లాలు…

రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ నిర్ణయాలు తీవ్రత వేడి రగిలిస్తూనే వస్తోంది. భావోద్వేగాలతో కూడిన వాతావరణంలో పరిపాలన పరంగా శాశ్వతముద్ర వేసే దిశలో వైసీపీ ప్రభుత్వం కదులుతోంది. అందులో భాగంగానే మూడు రాజధానుల ప్రకటన. ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా తన మనోభావాన్ని వెల్లడించారు. నిపుణుల కమిటీ నివేదికలు, విధివిధానాలు, మార్గదర్శకాల వంటివన్నీ లాంఛనప్రాయమే. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల సెంటిమెంటుతో కూడా ముడి పెట్టే విధంగా సర్కారు ప్రకటన ఉండటంతో మూడు రాజధానులపై పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. రాజకీయంగా అధికారపక్షంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విభేదిస్తున్నప్పటికీ బహిరంగంగా ప్రకటించలేని బలహీనతలో పడ్డాయి.

అడకత్తెరలో టీడీపీ….

నిన్నామొన్నటి వరకూ అధికారంలో ఉండి ప్రపంచస్థాయి రాజధాని అమరావతి అంటూ ప్రణాళిక వేసిన తెలుగుదేశం పార్టీ తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని బలంగా ప్రతిఘటించలేకపోతోంది. ఉత్తరాంధ్ర, రాయల సీమ ప్రాంతాలకు రాజధానులు ఇస్తామంటూ వైసీపీ చెప్పడంతోనే టీడీపీ అడకత్తెరలో చిక్కుకుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ వ్యవహరించలేదు. తిరిగి తాము అధికారంలోకి రావాలంటే ఆ ప్రజలే ఓట్లు వేయాలి. లక్షల కోట్ల రూపాయల వ్యయంతో అమరావతి నిర్మాణమంటూ చెప్పడంతో అభివృద్ధి అక్కడే కేంద్రీకృతమవుతోందని వెనకబడిన ప్రాంతాల ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు. దాని ఫలితం ఎన్నికలపై కూడా కనిపించింది. అందుకే విశాఖ, కర్నూలు నగరాల్లో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ రాజధానులు పెడతామన్న వైసీపీ అధినేత జగన్ నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించలేకపోతోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో టీడీపీ పై సానుకూలత లేదు. కొత్తగా మరింత వ్యతిరేకత మూటగట్టుకోవడానికి పార్టీశ్రేణులు , అధినాయకత్వం సిద్ధంగా లేదు. దాంతో సహజంగానే టీడీపీ స్వరం బలహీనమైపోయింది.

ప్రాంతాల వారీ స్పందనలే…

ప్రజల్లో ప్రాంతాలవారీ అనుకూల,వ్యతిరేక స్పందనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు లో హైకోర్టు పెడితే తమ సీమకు ప్రయోజనమని ఆ ప్రాంత ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. శ్రీబాగ్ ఒడంబడికను చిత్తశుద్ధితో అమలు చేయకపోవడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తమకు అన్యాయం జరిగిందనే భావన దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఒకానొకప్పుడు రాజధానిగా ఉన్న ప్రాంతం తెలంగాణతో కలిసి ఉమ్మడి రాష్ట్రంగా రూపుదాల్చిన తర్వాత పూర్తి నిర్లక్ష్యానికి గురైందనే భావన నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాతైనా తమ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఆశించారు. రాయలసీమ ప్రాంత ప్రజలు రాజధానినే తమ ప్రాంతంలో పెట్టాలని డిమాండ్ చేశారు. కనీసం హైకోర్టు అయినా ఇవ్వాలని ఆందోళనలు సాగించారు. కానీ రాజధానితోపాటు హైకోర్టు సైతం అమరావతిలోనే నెలకొల్పడంతోనే అసంతృప్తి అంతర్గతంగా రగులుతూ వస్తోంది. హైకోర్టు ఏర్పాటు ప్రకటన వారికి ఊరట కలిగించే అంశమే. ఉత్తరాంధ్ర ప్రజలు ఊహించని వరం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆప్రాంతంలో పెట్టనున్నట్లు చేసిన ప్రకటన. నిజానికి అదే జరిగితే పరిపాలన కేంద్రంగా విశాఖపట్నమే ఉంటుంది.

ద్వైధీ భావం…

దాదాపు రాజకీయపార్టీలన్నీ గోడమీద పిల్లి వాటంగానే వ్యవహరిస్తున్నాయి. మేధో,రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినవస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోనూ రెండు రకాలుగా మాట్టాడుతున్నారు. ఉత్తరాంధ్ర బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాంధ్ర బీజేపీ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. మేధావుల్లోనూ ఏకాభిప్రాయం కరవు అవుతోంది. మహానగరాలు ఉన్నచోట్ల ఆయా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయవనరుగా తోడ్పడుతున్నాయనేది కొందరి వాదన. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ అనుభవాలు వేరుగా ఉన్నాయి. హైదరాబాద్ కీలకంగా చాలా కాలంపాటు కేంద్రీకరణ సాగడంతో అటు ఉత్తర తెలంగాణతోపాటు ఆంధ్రప్రాంతమూ నష్టపోయిందనే వాదన ఉంది. అందువల్ల కొత్త రాష్ట్రం లో భవిష్యత్తులో ప్రాంతాల మధ్య సమతుల్యం దెబ్బతినకుండా చేయడం మంచిదనీ కొందరు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫార్ములా ఇందుకు సరైనదంటున్నారు.

కేంద్రం నిధులు ఇస్తుందా?

మహానగరం నిర్మించి ఆదాయవనరుగా మార్చినప్పటికీ ప్రజల్లో భావోద్వేగాలు అసంతృప్తికి, ఆందోళనలకు దారి తీయవచ్చు. కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ పాత్రను తక్కువగా చూడలేమని రాష్ట్ర రాజధానుల ఏర్పాటులో అది కూడా కీలకమేనని రాజకీయ వర్గాల్లో కొంతమంది భావిస్తున్నారు. నిజానికి రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం రాజధాని నిర్ణయం రాష్ట్రప్రభుత్వ అధికారమే. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరగడంతో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాజ్ భవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్ లకు కేంద్రమే నిధులివ్వాలి. ఇప్పటికే 1500 కోట్లరూపాయల కేంద్ర నిధులు విడుదల చేసింది. మరింత వికేంద్రీకృత రాజధానులు ఏర్పాటు చేసుకుంటే కొత్తగా నిధులు ఇవ్వకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కొత్త సంవత్సరంలో ఈ అనిశ్చితికి తెరపడి రాజధానుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News