ఇక.. జనం కోసం జగన్..!

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. పదేళ్లకు ముందు ఆయన ఓ బిజినెస్ మెన్. ప్రజలకు పెద్దగా పరిచయం కూడా లేని వ్యక్తి. మొదటిసారి 2009లో కడప ఎంపీగా గెలిచినప్పుడూ [more]

Update: 2019-05-30 01:30 GMT

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. పదేళ్లకు ముందు ఆయన ఓ బిజినెస్ మెన్. ప్రజలకు పెద్దగా పరిచయం కూడా లేని వ్యక్తి. మొదటిసారి 2009లో కడప ఎంపీగా గెలిచినప్పుడూ ఆయన కేవలం జిల్లా ప్రజలకు మాత్రమే పరిచయమయ్యారు. ఒక్క సంఘటన ఆయన జీవితాన్నే మార్చేసింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆయన రాజకీయాలు ఎంత కఠినమైనవో తెలిసొచ్చింది. తండ్రి మరణంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని కలుస్తానని ఆయన చేసిన ఒక్క ప్రకటన ఆయనను అనేక ఇబ్బందుల పాలు చేసింది. ఎన్ని సమస్యలు, అవరోధాలు ఎదురైనా ఆయన ఇచ్చిన మాటను కాపాడుకోవడమే ఇవాళ ఆయనను ప్రజల మనిషిని చేసింది. ఓదార్పు యాత్ర ద్వారా తొమ్మిదేళ్ల క్రితం ఆయన ప్రారంభించిన యాత్రనే ఇప్పుడు జగన్ ను ప్రజానాయకుడిని చేసింది. ఇచ్చిన మాటను కాపాడుకోవడానికి కష్టాలు ఉంటాయని తెలిసి కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి బయటకు వచ్చిన ఆయన ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు కనుక ఆయన తన మాట తప్పి ఉంటే ఇవాళ జగన్ ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా మాత్రమే ఉండేవారు.

పదేళ్లలోనే ప్రజానాయకుడిగా ఎదిగిన వైనం

పదేళ్ల రాజకీయ జీవితంలో జగన్ అనేక ఎత్తుపల్లాలను చూశారు. విమర్శలు, ఆరోపణలు, నమ్మకద్రోహాలు, రాజకీయ కుట్రలు, ఓటములు, గెలుపులు ఎన్నో చూశారాయన. గెలిచినప్పుడు సంబరపడిపోలేదు. ఓడినప్పుడు ధైర్యం చెడలేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు అహర్నిశలు కష్టపడ్డారు. ఏ నాయకుడైనా ప్రజల్లో ఉంటేనే ప్రజానాయకుడవుతారనే దానికి జగన్ సరైన ఉదాహరణ. ఓదార్పు యాత్రను వ్యతిరేకించడంతో కాంగ్రెస్ ను వీడి బయటకు వచ్చిన జగన్ తక్కువ కాలంలోనే తన సత్తాను చాటారు. కడప పార్లమెంటు నుంచి రికార్డు మెజారిటీతో గెలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తర్వాత ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. కేసులు, ఆరోపణలతో 16 నెలల జైలు జీవితం గడిపారు. అయితే, ఆయన అవినీతిపరుడని ప్రజలు నమ్మలేదు. ఆయన జైల్లో ఉండగానే వచ్చిన 18 ఎమ్మెల్యే, 1 పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. 15 అసెంబ్లీ, 1 పార్లమెంటు సీటును సాధించి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. జగన్ ముందునుంచీ ఏ విషయంలోనైనా ఒకే విధానంతో ముందుకెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఆయన సమైక్యాంధ్ర నినాదం చివరి వరకు వీడలేదు.

ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా..!

2014 ఎన్నికల్లో ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారనే అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే చెప్పాయి. అయితే, చంద్రబాబు అనుభవం ముందు జగన్ ఇమేజ్ సరిపోలేదు. చంద్రబాబు విజయం సాధించారు. జగన్ ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. జగన్ ఎప్పటికీ తమకు గట్టి పోటీదారుగా ఉంటారని గుర్తించిన చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రమాణస్వీకారం కూడా చేయకముందే ఎంపీని లాక్కోవడంతో ప్రారంభించి ముగ్గురు ఎంపీలను, 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి ఆకర్షించి టీడీపీలో చేర్చుకున్నారు. వెళ్లే ఎమ్మెల్యేలంతా జగన్ పై దుమ్మెత్తిపోశారు. అయినా, జగన్ ఎక్కడా ధైర్యం చెడలేదు. ఇక, ప్రజల్లోకి వెళ్లలని నిర్ణయించిన ఆయన సుదీర్ఘ పాదయాత్రకు పూనుకున్నారు. 14 నెలల పాటు 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. లక్షలాది మందిని ప్రత్యక్షంగా కలుసుకున్నారు. సమస్యలు తెలుసుకున్నారు. తానున్నానని భరోసా ఇచ్చారు. ఇదే జగన్ ను అధికారానికి దగ్గర చేసింది. ఒక్క అవకాశం ఇవ్వాలన్న జగన్ కోరికను ప్రజలు మన్నించారు. గతంలో ఎప్పుడూ కనివినీ ఎరుగని రీతిలో ఘన విజయాన్ని ఆయనకు కట్టబెట్టారు. పదేళ్ల క్రితం రాష్ట్ర ప్రజలకు తెలియని జగన్ పదేళ్లలోనే తన ప్రజల నాయకుడిగా ఎదిగారు. అన్ని కష్టాలను, అడ్డంకులు ఎదురుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇవాళ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తన తండ్రి వైఎస్సార్ కూడా ముఖ్యమంత్రి కావడానికి 30 ఏళ్లు శ్రమించారు. జగన్ మాత్రం ఈ లక్ష్యాన్ని పదేళ్లలోనే సాధించారు. జగన్ విజయం సాధించిన తర్వాత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నట్లుగా వైఎస్సార్ ఏ లోకాన ఉన్నా ఈ రోజు తన కుమారుడి విజయాన్ని చూసి నిజంగా గర్వపడుతుంటారు.

Tags:    

Similar News